- హైదరాబాద్ మెట్రోకు భారీ ఊరట
- ఆర్థిక సాయం చేసేందుకు ముందుకు వచ్చిన ఐఆర్ఎఫ్ సీ
- రూ.13,600 కోట్లు రీఫైనాన్స్ కోసం ఒప్పందం
- మెట్రో యాజమాన్యం 100 శాతం వాటా బదిలీ
- భవిష్యత్తులో మెట్రో విస్తరణకు అవకాశం
హైదరాబాద్, మహా : హైదరాబాద్ మెట్రో రైల్ సర్వీసును పూర్తిగా స్వాధీనం చేసుకున్న తెలంగాణ ప్రభుత్వం ఆర్థికంగా బలోపేతం చేసేలా కీలక ఒప్పందం కుదుర్చుకుంది. ఇండియన్ రైల్వే ఫైనాన్స్ కార్పొరేషన్ ( ఐఆర్ఎఫ్ సీ ) మొత్తం రూ.13,600 కోట్ల రుణాలను రీఫైనాన్స్ చేసేందుకు అంగీకారం తెలిపింది. ఈ మేరకు ఆ సంస్థ సీఎండీ మనోజ్‌కుమార్ దూబె, తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కే .రామకృష్ణారావు సమక్షంలో ఒప్పంద పత్రాలపై సోమవారం అధికారులు సంతకాలు చేశారు. ఈ రుణాన్ని 20 ఏళ్ల కాలపరిమితితో త్రైమాసిక పద్ధతిలో చెల్లించేలా ఒప్పందం చేసుకున్నారు.
ఈ సందర్భంగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు మాట్లాడుతూ, హైదరాబాద్ మెట్రోలోని 100 శాతం వాటా ప్రభుత్వానికి బదిలీ అయిందని చెప్పారు. ‘‘నగరంలో రవాణా వ్యవస్థను మెరుగుపరచడానికి ప్రభుత్వం కట్టుబడి ఉంది.. దేశ ఆర్థికాభివృద్ధికి హైదరాబాద్ నగరం కీలక చోదకశక్తిగా ఎదుగుతోంది.. మెట్రో అనుసంధానం బలోపేతం వల్ల ట్రాఫిక్ తగ్గి ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలు లభిస్తాయి’’ అని తెలిపారు. ఈ సందర్భంగా రుణాన్ని రీఫైనాన్స్ చేసినందుకు సహకరించిన కేంద్రం, ఐఆర్ఎఫ్ సీ, ఎల్‌అండ్‌టీ, హైదరాబాద్ మెట్రో సంస్థ బృందాలకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. సమర్థవంతమైన, సుస్థిరమైన ప్రజా రవాణా వ్యవస్థను విస్తరించడమే తమ ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు.
హైదరాబాద్ మెట్రో రైల్ ఫేజ్-1, మూడు కారిడార్లలో 57 స్టేషన్లతో 69.2 కిలోమీటర్ల మేర విస్తరించి ఉంది. పబ్లిక్-ప్రైవేట్ పార్ట్‌నర్‌షిప్ (పీపీపీ) కింద అభివృద్ధి చేసిన ప్రపంచంలోని అతిపెద్ద మెట్రో రైల్ ప్రాజెక్టులలో ఇది ఒకటి. ఈ నెట్‌వర్క్ ప్రస్తుతం ప్రతిరోజూ ఐదు లక్షలకు పైగా ప్రయాణీకులను గమ్యస్థానాలకు చేర్చుతోంది. ఈ రీఫైనాన్సింగ్, మెట్రో నెట్‌వర్క్‌ను కొత్త కారిడార్లలోకి విస్తరించడానికి, హైదరాబాద్ మహానగర అంతటా లాస్ట్-మైల్ కనెక్టివిటీని మెరుగుపరచడానికి తెలంగాణ ప్రభుత్వ ప్రణాళికలకు కూడా మద్దతు ఇస్తుందని భావిస్తున్నారు. ఈ ఫైనాన్సింగ్‌లో ఎలాంటి ప్రాసెసింగ్ ఫీజులు, కమిట్‌మెంట్ ఛార్జీలు లేదా ముందస్తు చెల్లింపు జరిమానాలు లేవని ఐఆర్‌ఎఫ్‌సి స్పష్టం చేసింది. ఐఆర్‌ఎఫ్‌సికి చెల్లించాల్సిన బకాయిలను తీర్చడానికి తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిన బేషరతు హామీ, రాష్ట్ర ప్రభుత్వ గ్యారెంటీ, ఆర్బీఐ మద్దతు కలిగి డైరెక్ట్ డెబిట్ ఆదేశాలు ఉన్నాయి.








