స్మార్ట్ మీటర్లకు రాష్ట్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్.
* వ్యవసాయ కనెక్షన్లకు మినహాయింపు.
* కరెంటు బిల్లుల లెక్క పక్కా.
* రాష్ట్రంలో ఆర్డీఎస్ఎస్ పథకం అమలుకు ఆమోదం.
* వినియోగదారులపై భారం పడకుండా సర్కార్ పక్కా ప్లాన్.
హైదరాబాద్, మహా.
రాష్ట్ర విద్యుత్ రంగంలో మరో కీలక పరిణామానికి రేవంత్‌రెడ్డి సర్కార్ శ్రీకారం చుట్టింది. కేంద్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా తీసుకువచ్చిన ‘ఆర్డీఎస్ఎస్’ (రీవ్యాంప్డ్ డిస్ట్రిబ్యూషన్ సెక్టార్ స్కీమ్) పథకంలో చేరేందుకు రాష్ట్ర కేబినెట్ అధికారికంగా ఆమోదముద్ర వేసింది. దీంతో రాష్ట్రవ్యాప్తంగా స్మార్ట్ మీటర్ల ఏర్పాటుకు మార్గం సుగమమైంది. రైతాంగానికి ఊరటనిస్తూ వ్యవసాయ కనెక్షన్లకు ఈ మీటర్ల ఏర్పాటు నుంచి పూర్తిగా మినహాయింపు ఇచ్చారు. గృహ, వాణిజ్య, పారిశ్రామిక కేటగిరీలన్నింటికీ దశలవారీగా ఈ స్మార్ట్ మీటర్లను అమర్చనున్నారు.
**ఖర్చులన్నీ ప్రభుత్వానివే..**
గత ప్రభుత్వ హయాంలో ఈ పథకానికి సంబంధించి త్రైపాక్షిక ఒప్పందం జరిగినా, అప్పట్లో ప్రక్రియ ముందుకు సాగలేదు. ప్రస్తుతం విద్యుత్ పంపిణీ సంస్థల (డిస్కంల) నష్టాలను తగ్గించడంతో పాటు పారదర్శక బిల్లింగ్ వ్యవస్థను తీసుకురావడమే లక్ష్యంగా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. స్మార్ట్ మీటర్ల కొనుగోలు, ఏర్పాటుకు అయ్యే ఖర్చును కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలే సంయుక్తంగా భరిస్తాయని అధికారులు స్పష్టం చేశారు. వినియోగదారులపై ఎలాంటి అదనపు భారం పడబోదని తేల్చిచెప్పారు.
**స్మార్ట్ మీటర్ల ప్రత్యేకతలు.. లాభాలు**
స్మార్ట్ మీటర్ అనేది సాధారణ మీటర్ల లాంటిది కాదు. ఇది ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ (IoT) సాంకేతికతతో పనిచేసే అధునాతన డిజిటల్ పరికరం. విద్యుత్ వినియోగ వివరాలను ఎప్పటికప్పుడు నేరుగా డిస్కంల సర్వర్లకు ఇది చేరవేస్తుంది. ఫలితంగా ప్రతి నెలా మీటర్ రీడర్ ఇంటికి రావాల్సిన అవసరం తప్పుతుంది. మానవ తప్పిదాల వల్ల వచ్చే తప్పుడు, భారీ బిల్లుల ఇబ్బందులకు చెక్ పడుతుంది.
వినియోగదారులు ఒక ప్రత్యేక మొబైల్ యాప్ ద్వారా తమ రోజువారీ విద్యుత్ వినియోగాన్ని ఎప్పటికప్పుడు ట్రాక్ చేసుకోవచ్చు. పవర్ ఎక్కడ వృథా అవుతుందో గుర్తించి వెంటనే నియంత్రించుకోవచ్చు. ఏ ప్రాంతంలో లోడ్ ఎక్కువగా ఉందో కచ్చితమైన డేటా దొరుకుతుంది. దీనివల్ల లో-వోల్టేజ్ సమస్యలు, అకస్మాత్తు విద్యుత్ అంతరాయాలు తగ్గుముఖం పడతాయి. విద్యుత్ దొంగతనాలను, లైన్ లాసెస్‌ను డిస్కంలు సులభంగా పసిగట్టవచ్చు.
**మొబైల్ రీచార్జ్ తరహాలో ప్రీపెయిడ్ విధానం?**
ప్రస్తుతానికైతే మనం వాడుతున్న సాధారణ ‘పోస్ట్‌పెయిడ్’ (నెలంతా వాడాక బిల్లు కట్టే) విధానంలోనే ఈ స్మార్ట్ మీటర్లను అమలు చేయనున్నారు. భవిష్యత్తులో విద్యుత్ సంస్థల ఆర్థిక బకాయిలను అదుపు చేయడానికి, మొబైల్ రీచార్జ్ తరహాలోనే ముందుగా డబ్బులు చెల్లించి విద్యుత్ వాడుకునే ‘ప్రీపెయిడ్’ విధానాన్ని తీసుకొచ్చే యోచనలో ప్రభుత్వం ఉన్నట్లు సమాచారం. ప్రభుత్వ ఆఫీసులు, స్థానిక సంస్థల విద్యుత్ వినియోగం సైతం ఈ డిజిటల్ నిఘా పరిధిలోకి రానుండటంతో పెండింగ్ బకాయిల సమస్యకు శాశ్వత పరిష్కారం లభిస్తుందని నిపుణులు అంచనా వేస్తున్నారు.








