Mahaa Daily Exclusive

  మరుగుదొడ్లు లేవని బాలికలు చదువు ఆపొద్దు….

Share

మరుగుదొడ్లు లేవని బాలికలు చదువు ఆపొద్దు.
* ఉచిత శానిటరీ న్యాప్కిన్లు.. ప్రత్యేక టాయిలెట్లు కల్పించాల్సిందే.
* కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు సుప్రీంకోర్టు అల్టిమేటం.
* రుతుక్రమ ఆరోగ్యం జీవించే హక్కులో భాగమే.
* ప్రతి మూడు నెలలకొకసారి నివేదిక ఇవ్వాలన్న సుప్రీంకోర్టు
ఢిల్లీ, మహా.

పాఠశాలల్లో శానిటరీ ప్యాడ్స్, ప్రత్యేక మరుగుదొడ్ల కొరత కారణంగా ఏ ఒక్క బాలిక చదువు మధ్యలో వదిలేయకూడదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఈ విషయంలో తాము ఇచ్చే ఆదేశాలను అక్షరాలా, పూర్తి నిబద్ధతతో అమలు చేసేలా చూడాలని కేంద్ర ప్రభుత్వానికి గట్టిగా చెప్పింది. పాఠశాలల్లో విద్యార్థినులకు ఉచితంగా శానిటరీ న్యాప్కిన్లు అందించడంతో పాటు బాలబాలికలకు విడివిడిగా ప్రత్యేక మరుగుదొడ్లు ఏర్పాటు చేయాలని జనవరి 30న సుప్రీంకోర్టు చారిత్రాత్మక తీర్పు ఇచ్చింది. దీని ప్రకారం అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో పనులు వేగవంతం అయ్యాయని కేంద్రం తెలిపిన నేపథ్యంలో సోమవారం సర్వోన్నత న్యాయస్థానం ఈ కీలక వ్యాఖ్యలు చేసింది.
“పాఠశాలల్లో ఏర్పాటు చేసిన ప్రత్యేక మరుగుదొడ్లను, శానిటరీ ప్యాడ్స్‌ను చక్కగా ఉపయోగించుకోండి. ఇది దేశంలోని మహిళలు, బాలికల శ్రేయస్సు కోసం ఉద్దేశించింది. కేవలం ఇవి లేవనే కారణంతో బాలికలు చదువు ఆపేసి, ఇళ్లలోనే ఉండిపోయి ఇంటి పనులకు పరిమితం కాకూడదు” అని జస్టిస్ జేబీ… పార్దివాలా, జస్టిస్ ఆర్. మహదేవన్లతో కూడిన సుప్రీం ధర్మాసనం వ్యాఖ్యానించింది. కేంద్ర ప్రభుత్వం తరఫున హాజరైన అడిషనల్ సొలిసిటర్ జనరల్ అర్చన పాఠక్ దవేను ఉద్దేశించి.. సదరు ప్రయోజనాలు అందరికీ అందేలా చూడడం కేంద్రం బాధ్యత అని కోర్టు పేర్కొంది.
**ఉచితంగా అందించాల్సిందే..**
లింగ సమానత్వం, విద్యా హక్కు సమానత్వాన్ని నిర్ధరించడానికి సుప్రీంకోర్టు ఈ తీర్పు ఇచ్చింది. ప్రభుత్వ, ఎయిడెడ్, ప్రైవేట్ పాఠశాలలు అనే తేడా లేకుండా అన్నింటిలోనూ విద్యార్థినులకు ఉచితంగా పర్యావరణానికి హాని చేయని (ఆక్సో-బయోడిగ్రేడబుల్) శానిటరీ న్యాప్కిన్స్ అందించాలని స్పష్టం చేసింది. ఆదేశాల అమలుకు సంబంధించిన నివేదికను లా ఆఫీసర్ అర్చన పాఠక్ దవే ఈ రోజు న్యాయస్థానానికి సమర్పించారు. రాష్ట్రాల నుంచి దాదాపు రెండు నుంచి రెండున్నర నెలల కాలానికి సంబంధించిన డేటాను కేంద్రం సేకరించిందని ఆమె తెలిపారు. క్షేత్రస్థాయిలో పూర్తి నిబద్ధతో పనులు అమలయ్యేలా చూసేందుకు కేంద్రం మరింత చొరవ తీసుకోవాలని ధర్మాసనం పేర్కొంది. ఈ విషయంలో కేంద్రం నిరంతరం రాష్ట్రాలకు మార్గదర్శకత్వం వహించాలని, క్రమం తప్పకుండా డేటాను సేకరించాలని సూచించింది. ఆదేశాల అమలును తాము ప్రతి మూడు నెలలకొకసారి పర్యవేక్షిస్తామని, ప్రగతిపై కేంద్రం కొత్త నివేదికను సమర్పించాల్సి ఉంటుందని స్పష్టం చేసింది.
**పర్యావరణ కోణంపై పరిశీలన**
కోర్టు తన తీర్పులో పేర్కొన్న “ఆక్సో-బయోడిగ్రేడబుల్” శానిటరీ న్యాప్కిన్లు పర్యావరణానికి ప్రతికూలంగా మారే ప్రమాదం ఉందని ఒక న్యాయవాది మధ్యంతర పిటిషన్ ద్వారా ధర్మాసనం దృష్టికి తెచ్చారు. ఈ అంశాన్ని పరిశీలించి, అవసరమైన చర్యలు తీసుకోవాలని లా ఆఫీసర్‌కు ధర్మాసనం సూచించింది. తదుపరి అమలు నివేదిక పరిశీలనకు ఈ కేసును సెప్టెంబర్ 1వ తేదీకి వాయిదా వేసింది.
**ఆగస్టు 15లోగా నివేదికలు ఇవ్వాలి**
రాష్ట్రాలన్నీ తమ తాజా నివేదికలను ఆగస్టు 15లోగా కేంద్ర ప్రభుత్వానికి సమర్పించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. స్టేటస్ రిపోర్టులు సమర్పించడంలో ఏ రాష్ట్రం కూడా ఎలాంటి నిర్లక్ష్యం, ఆలస్యం చేయకూడదని స్పష్టం చేసింది. తదుపరి అమలు నివేదికను దాఖలు చేయడానికి కేంద్ర విద్యామంత్రిత్వశాఖ నోడల్ మంత్రిత్వశాఖగా వ్యవహరిస్తుందని పేర్కొంది.
**జీవించే హక్కులో భాగమే..**
రాజ్యాంగంలోని ఆర్టికల్ 21 ప్రకారం జీవించే హక్కులో ‘రుతుక్రమ ఆరోగ్యం’ కూడా ఒక భాగమని జనవరి 30నాటి తీర్పులో సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. సురక్షితమైన, సరసమైన రుతుక్రమ పరిశుభ్రత పద్ధతులు అందుబాటులో ఉంచడం వల్ల ఒక బాలిక అత్యుత్తమ లైంగిక, పునరుత్పత్తి ఆరోగ్యాన్ని పొందగలుగుతుందని పేర్కొంది. సరైన మౌలిక సదుపాయాలు లేకపోవడం వల్ల బాలికలు విద్యకు దూరమై భవిష్యత్తులో వెనుకబడిపోయే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేసింది. పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లోని అన్ని పాఠశాలల్లో ఏఎస్టీఎం డీ-6954 ప్రమాణాలకు అనుగుణంగా తయారు చేసిన ఆక్సో-బయోడిగ్రేడబుల్ శానిటరీ న్యాప్కిన్లను ఉచితంగా అందించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించింది.