Mahaa Daily Exclusive

  కొనుగోలు కేంద్రాల్లో ‘రైతు గోస’….

Share

కొనుగోలు కేంద్రాల్లో ‘రైతు గోస’.
• 46 డిగ్రీల ఎండలో అన్నదాతల అగచాట్లు.
• కల్లాల్లో ధాన్యం కుప్పలు.
• లారీలు రావు.. సంచులు లేవు.
• బీజేపీ వస్తోందనే భయంతో రాత్రికి రాత్రే నాటకాలు.
• చివరి గింజ కొనేవరకు వదిలేదే లేదు.
• మద్దతు ధర దక్కకుండా మిల్లర్ల కుట్ర.
• రైతుల ఆత్మహత్యలు లేని తెలంగాణే బీజేపీ లక్ష్యం!
• బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రాంచందర్ రావు.

పరిగి/గజ్వేల్,మహా.
తెలంగాణ రాష్ట్రంలో వరి ధాన్యం కొనుగోళ్లలో నెలకొన్న తీవ్ర ఆలస్యం, కొనుగోలు కేంద్రాల్లో మౌలిక వసతుల లేమితో అన్నదాతలు ఎదుర్కొంటున్న నరకయాతనపై భారతీయ జనతా పార్టీ అగ్రనాయకత్వం క్షేత్రస్థాయిలో సమరశంఖం పూరించింది. రాష్ట్రవ్యాప్తంగా కళ్లాల్లో కుప్పలు పోసి కళ్లల్లో ఒత్తులు వేసుకుని ఎదురుచూస్తున్న రైతాంగానికి ధైర్యం కల్పించేందుకు బీజేపీ చేపట్టిన “రైతు గోస – బీజేపీ భరోసా” యాత్ర సోమవారం వికారాబాద్ జిల్లా పరిగి మండల కేంద్రంతో పాటు సిద్దిపేట జిల్లా గజ్వేల్ వ్యవసాయ మార్కెట్ యార్డుల్లో ఉధృతంగా సాగింది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రాంచందర్ రావు నేతృత్వంలోని ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో కూడిన ఉన్నత స్థాయి ప్రతినిధి బృందం కొనుగోలు కేంద్రాలను స్వయంగా సందర్శించి, ఎండ తీవ్రతకు అల్లాడుతున్న రైతులతో ముఖాముఖి మాట్లాడి వారి ఆవేదనను ఆలకించింది.
ఈ సందర్భంగా పరిగి, గజ్వేల్ కల్లాల్లో నిలబడి మీడియాతో మాట్లాడిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రాంచందర్ రావు కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో నిప్పులు చెరిగారు. రెండు నెలల క్రితమే బీజేపీ కిసాన్ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు బస్వ లక్ష్మీనర్సయ్య ఆధ్వర్యంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని, వ్యవసాయ శాఖ మంత్రిని కలిసి ముందస్తు ఏర్పాట్లు చేయాలని కోరినప్పటికీ, ప్రభుత్వం ప్రదర్శించిన ఘోర నిర్లక్ష్యమే నేటి రైతాంగ దుస్థితికి కారణమని దుయ్యబట్టారు. రాష్ట్రంలోని దాదాపు ప్రతి కొనుగోలు కేంద్రంలోనూ ధాన్యం కుప్పలు పేరుకుపోయాయని, గత 15 రోజులుగా లారీలు రాక, గోనెసంచులు లేక రైతులు అల్లాడిపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. విచిత్రంగా, బీజేపీ బృందం వస్తోందనే భయంతో రాత్రికి రాత్రే, తెల్లవారుజామున 4 గంటలకే అధికారులు హడావుడిగా గోనెసంచులు తెచ్చి, రైతులను బెదిరిస్తూ అడ్డగోలుగా మిల్లులకు తరలించే డ్రామాలకు తెరలేపారని ధ్వజమెత్తారు. ప్రభుత్వం ఎన్ని కళ్లుగప్పే నాటకాలు ఆడినా క్షేత్రస్థాయిలో రవాణా సౌకర్యాలు లేని మాట వాస్తవమని, చివరి గింజ కొనేవరకు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని వదిలిపెట్టేదే లేదని హెచ్చరించారు.
మరోవైపు, 46 డిగ్రీల అసాధారణ ఉష్ణోగ్రతల్లో అన్నదాతలు పడుతున్న అగచాట్లపై బీజేపీ శాసనమండలి పక్ష నేత ఏవీఎన్ రెడ్డి అత్యంత తీవ్రంగా స్పందించారు. సమాజంలో అత్యున్నత స్థానంలో గౌరవించాల్సిన రైతును పండించిన పాపానికి కాంగ్రెస్ ప్రభుత్వం నరకకూపంలోకి నెట్టిందని ఆరోపించారు. భానుడి భగభగలకు కనీస నీడ, తాగునీరు లేని కల్లాల్లో రైతులు 25 రోజులుగా పడిగాపులు కాస్తున్నారని, దేశంలోనే అత్యధికంగా వరి పండించే తెలంగాణలో గన్నీ బ్యాగులు, లారీల ముందస్తు ప్రణాళికలు చేయకపోవడం ప్రభుత్వ దివాలాకోరుతనానికి నిదర్శనమన్నారు. వారాల తరబడి ధాన్యం నిల్వ ఉండటం వల్ల అకాల వర్షాలకు పంట తడిసి ముద్దవుతోందని, ఆ నెపంతో అధికారులు మిల్లర్లతో కుమ్మక్కై కొనుగోళ్లు నిలిపివేస్తూ దళారులకు దోచిపెడుతున్నారని మండిపడ్డారు. కనీస మద్దతు ధర రాక రైతులు వందల రూపాయలు నష్టపోతూ ప్రైవేట్ వ్యాపారులను ఆశ్రయిస్తున్న కుట్ర వెనుక ప్రభుత్వ హస్తం ఉందన్నారు.
రైతుల ఆత్మహత్యలు లేని ప్రగతిశీల తెలంగాణను ఆవిష్కరించడమే బీజేపీ ఏకైక లక్ష్యమని ఎన్. రాంచందర్ రావు ఈ సందర్భంగా పునరుద్ఘాటించారు. తాము భువనగిరి, నల్గొండ ప్రాంతాల్లో పర్యటించినప్పుడు రైతుల ఆత్మహత్యాయత్నాల ఉదంతాలు కలచివేసాయన్నారు. కేవలం వరి ధాన్యమే కాకుండా మార్కెట్లకు వచ్చిన మక్కలు, జొన్నలు వంటి ఇతర పంటలను కూడా కొనే నాథుడు లేక రైతాంగం తీవ్ర మానసిక ఒత్తిడికి లోనవుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. మూడు రోజుల పాటు సాగిన ఈ “రైతు గోస – బీజేపీ భరోసా” యాత్రతో తమ పోరాటం ముగిసిపోదని, ప్రతీ గింజా కొనుగోలు చేసి అన్నదాతకు పూర్తి న్యాయం జరిగే వరకు రాష్ట్రవ్యాప్తంగా ప్రజావ్యతిరేక కాంగ్రెస్ ప్రభుత్వంపై బీజేపీ పోరాటం నిరంతరాయంగా కొనసాగుతుందని వారు స్పష్టం చేశారు.