- నేటి నుంచి మహానాడు.
- మంగళగిరి కేంద్ర కార్యాలయం నుంచి 1,848 క్లస్టర్లకు అనుసంధానం.
- ‘స్త్రీశక్తి’ ప్రధాన ఇతివృత్తంగా దేశ రాజకీయాల్లోనే వినూత్న ప్రయోగం: పల్లా శ్రీనివాసరావు .
మంగళగిరి, మహా.
తెలుగుదేశం పార్టీ ప్రతి ఏటా అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించే ‘మహానాడు’ కార్యక్రమం ఈసారి సరికొత్త హంగులతో, దేశ రాజకీయ చరిత్రలోనే ఒక వినూత్న ప్రయోగానికి శ్రీకారం చుట్టబోతోంది. మే 27, 28 తేదీల్లో ఈ ఏడాది మహానాడును భౌతిక, డిజిటల్ పద్ధతుల మేళవింపుతో ‘హైబ్రిడ్’ విధానంలో నిర్వహించనున్నట్లు పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు ప్రకటించారు. మంగళగిరిలోని ఎన్టీఆర్ భవన్ కేంద్ర కార్యాలయం వేదికగా సాగే ఈ పండుగను, రాష్ట్రవ్యాప్తంగా క్షేత్రస్థాయిలో ఏర్పాటు చేసిన 1,848 క్లస్టర్లకు అత్యాధునిక సాంకేతికత ద్వారా అనుసంధానించనున్నారు. తద్వారా లక్షలాది మంది కార్యకర్తలను ఏకకాలంలో భాగస్వాములను చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నామని, ఈ సారి మహానాడుకు ‘స్త్రీశక్తి’ ప్రధాన ఇతివృత్తంగా నిలవనుందని ఆయన వివరించారు.ప్రధాని పిలుపుతో ప్రణాళికలో మార్పు
నిజానికి ఈ విడత మహానాడును నెల్లూరు వేదికగా మూడు రోజుల పాటు అత్యంత వైభవంగా నిర్వహించాలని పార్టీ తొలుత ప్రణాళిక రచించింది. అయితే, పశ్చిమాసియాలో నెలకొన్న అంతర్జాతీయ యుద్ధ పరిస్థితులు, ఆర్థిక అనిశ్చితి నేపథ్యంలో దేశ పౌరులంతా అనవసర ఖర్చులను తగ్గించుకోవాలంటూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇచ్చిన పిలుపును టీడీపీ స్ఫూర్తిగా తీసుకుంది. దేశ ప్రయోజనాలు, దేశ యోగక్షేమాలను దృష్టిలో ఉంచుకుని భారీ వ్యయంతో కూడిన భౌతిక కార్యక్రమ ప్రణాళికను మార్చుకున్నట్లు పల్లా తెలిపారు. పొదుపు మంత్రాన్ని పాటిస్తూ హైబ్రిడ్ విధానాన్ని ఎంచుకున్నామని, దీని ద్వారా ఆదా అయ్యే నిధులను పార్టీ క్షేత్రస్థాయి అభివృద్ధి కార్యక్రమాలకే పూర్తిస్థాయిలో వినియోగిస్తామని స్పష్టం చేశారు. ఈ నిర్ణయం దేశం కోసం టీడీపీ వేస్తున్న డిజిటల్ అడుగులకు నిదర్శనమని ఆయన అభివర్ణించారు.
లోకేష్ మార్క్.. సాంకేతిక విప్లవం
ఈ సరికొత్త హైబ్రిడ్ మహానాడు రూపకల్పన వెనుక పార్టీ యువనేత నారా లోకేష్ సాంకేతిక దార్శనికత ఉందని పల్లా శ్రీనివాసరావు కొనియాడారు. హార్వర్డ్ విశ్వవిద్యాలయ పూర్వ విద్యార్థి అయిన లోకేష్ తన అనుభవాన్ని, పరిజ్ఞానాన్ని జోడించి తెలుగుదేశం పార్టీని డిజిటల్ యుగంలో అగ్రభాగాన నిలుపుతున్నారన్నారు. సుమారు రెండు వేల క్లస్టర్ల ద్వారా ఏకకాలంలో లక్షలాది మంది కార్యకర్తలను అనుసంధానించడం ఒక ప్రాంతీయ పార్టీ పరంగా దేశ చరిత్రలోనే అరుదైన రికార్డు అని, ఇది ఒక విప్లవాత్మక ఘట్టంగా నిలిచిపోతుందని ధీమా వ్యక్తం చేశారు. టీడీపీ తీసుకున్న ఈ వినూత్న నిర్ణయంపై ప్రస్తుతం జాతీయ స్థాయిలో ఇతర రాజకీయ పార్టీలోనూ తీవ్ర ఆసక్తి నెలకొందని వ్యాఖ్యానించారు.
మహానాడు నిర్వహణ ఇలా..
రెండు రోజుల పాటు సాగే ఈ మహానాడు నిర్వహణ తీరును వివరిస్తూ.. మంగళగిరి కేంద్ర కార్యాలయంలో పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు, నారా లోకేష్ సహా ముఖ్య నేతలు మాత్రమే పరిమిత సంఖ్యలో భౌతికంగా హాజరవుతారని తెలిపారు. నియోజకవర్గాలు, మండల కేంద్రాల్లోని 1,848 క్లస్టర్ల వద్ద భారీ ఎల్ఈడీ స్క్రీన్లను ఏర్పాటు చేసి అక్కడి నుంచే ప్రత్యక్ష ప్రసారాలను వీక్షించేలా ఏర్పాట్లు పూర్తి చేశారు. కేవలం వీక్షించడమే కాకుండా, ఎంపిక చేసిన క్లస్టర్ల నుంచి కార్యకర్తలు, స్థానిక నాయకులు నేరుగా చంద్రబాబు, లోకేష్‌లతో సంభాషించేలా ద్విమార్గాంతర (టూ-వే) సాంకేతికతను వాడుతున్నారు. గతంలో వేలాది మందికి మాత్రమే పరిమితమైన మహానాడు, ఈ డిజిటల్ విప్లవంతో లక్షలాది మందికి నేరుగా చేరువ కానుంది.
స్త్రీశక్తి, ఇతర అంశాలపై విస్తృత చర్చ
ఈ పాని పసుపు పండుగలో మహిళా అభ్యున్నతి, సంక్షేమం కోసం టీడీపీ చేసిన, చేయబోయే కార్యక్రమాలపై ‘స్త్రీశక్తి’ పేరిట ప్రధాన తీర్మానం ప్రవేశపెట్టి చర్చించనున్నారు. దీనితో పాటు ప్రస్తుత రాజకీయ పరిణామాలు, ‘కాక్రోచ్ జనతాపార్టీ’ వైఖరి, ఆరోగ్యకరమైన సోషల్ మీడియా వినియోగం వంటి కీలక అంశాలపై విస్తృత చర్చలు, రాజకీయ తీర్మానాలు ఉంటాయని పల్లా వెల్లడించారు. మే 27, 28 తేదీల్లో ప్రతిరోజూ ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు కార్యక్రమాలు జరుగుతాయి. ప్రతి క్లస్టర్ వద్ద స్వర్గీయ నందమూరి తారకరామారావు విగ్రహానికి నివాళులర్పించి, ‘మా తెలుగుతల్లికి మల్లెపూదండ’ గీతాలాపనతో మహానాడు లాంఛనంగా ప్రారంభమవుతుంది. ఎలాంటి సాంకేతిక లోపాలు తలెత్తకుండా గత పది రోజులుగా తానే స్వయంగా కేంద్ర కార్యాలయం నుండి ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నానని, తెలుగు జాతి గర్వించే ఈ మహోత్సవాన్ని శ్రేణులంతా సమన్వయంతో విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.








