**చొరబాటుదారులపై ఉక్కుపాదం.. మీ అంతట మీరే వెళ్లిపోండి!**
**వాళ్లేమైనా మన అల్లుళ్లా.. జైళ్లలో పెట్టి పోషించలేం: బెంగాల్ సీఎం సువేందు అధికారి**
**ప్రభుత్వ హెచ్చరికలతో సరిహద్దుల గుండా బంగ్లాదేశ్‌కు తిరుగుముఖం పడుతున్న వలసదారులు**
**కోల్‌కతా, మహా.**
పశ్చిమ బెంగాల్లో కొత్తగా కొలువుదీరిన భారతీయ జనతా పార్టీ (బీజేపీ) ప్రభుత్వం అక్రమ వలసదారులపై ఉక్కుపాదం మోపుతోంది. రాష్ట్రంలో అక్రమంగా నివసిస్తున్న చొరబాటుదారులకు ముఖ్యమంత్రి సువేందు అధికారి అత్యంత తీవ్ర స్థాయిలో హెచ్చరికలు జారీ చేశారు. ప్రభుత్వం కఠిన చర్యలు చేపట్టకముందే, ఎవరికి వారే ఇక్కడి నుంచి పారిపోవాలని ఆయన అల్టిమేటం ఇచ్చారు. ప్రస్తుతం దేశంలో అమలులో ఉన్న విదేశీయుల చట్టం (ఫారినర్స్ యాక్ట్) నిబంధనలకు లోబడే తాము ఈ కఠిన చర్యలకు ఉపక్రమించామని, ఇందులో కొత్తగా తీసుకొచ్చిన చట్టమేమీ లేదని ఆయన స్పష్టం చేశారు.
**వాళ్లేమైనా మన అల్లుళ్లా?**
అక్రమ చొరబాటుదారుల వ్యవహారంపై ముఖ్యమంత్రి సువేందు అధికారి ఘాటుగా స్పందించారు. తమ దేశ పౌరులను తిరిగి వెనక్కి తీసుకునేందుకు బంగ్లాదేశ్ ప్రభుత్వం ఇప్పటికే సంసిద్ధత వ్యక్తం చేసిన నేపథ్యంలో, ఇక్కడున్న అక్రమ వలసదారులు తక్షణమే బెంగాల్‌ను విడిచిపెట్టాలని తేల్చిచెప్పారు. అక్రమంగా దేశంలోకి ప్రవేశించిన వారిని పట్టుకుని జైళ్లలో బంధించవద్దని తాను పోలీసు యంత్రాంగానికి స్పష్టమైన ఆదేశాలు జారీ చేసినట్లు వెల్లడించారు. “వారిని జైళ్లలో ఉంచి మన దేశ వనరులను, ప్రజల కష్టార్జితాన్ని ఎందుకు వృథా చేయాలి? ఈ చొరబాటుదారులు ఏమైనా మనకు అల్లుళ్లా?” అని సీఎం సువేందు ప్రశ్నించారు. ఎవరైనా స్వచ్ఛందంగా వెళ్లకుంటే, మున్ముందు ప్రభుత్వ చర్యల వల్ల తీవ్ర పరిణామాలను ఎదుర్కోవాల్సి వస్తుందని ఆయన హెచ్చరించారు.
**సరిహద్దుల్లో వలసదారుల పడిగాపులు**
రాష్ట్ర ప్రభుత్వ తాజా హెచ్చరికలు, క్షేత్రస్థాయిలో పోలీసుల తనిఖీలు ముమ్మరం కావడంతో అక్రమ వలసదారుల్లో తీవ్ర వణుకు మొదలైంది. ప్రభుత్వ కఠిన చర్యల భయంతో వారంతా స్వచ్ఛందంగా బంగ్లాదేశ్ వెళ్లిపోయేందుకు సరిహద్దులకు క్యూ కడుతున్నారు. ఈ క్రమంలోనే ఉత్తర 24 పరగణాల జిల్లాలోని హకీంపూర్ సరిహద్దు ప్రాంతంలో మంగళవారం ఉదయం భారీ సంఖ్యలో అక్రమ వలసదారులు గుమిగూడారు. తనిఖీల నేపథ్యంలో వారు బంగ్లాదేశ్ వెళ్లిపోవడానికే అక్కడికి చేరుకున్నట్లు తెలుస్తోంది. గతంలో ‘స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్’ (ఎస్ఐఆర్) ప్రక్రియ చేపట్టిన సమయంలో సరిహద్దుల్లో ఎలాంటి ఉద్రిక్త దృశ్యాలు కనిపించాయో, అచ్చం అలాంటి పరిస్థితులే ఇప్పుడు మళ్లీ కనిపిస్తుండటం గమనార్హం.







