Mahaa Daily Exclusive

  స్కామ్‌’రేణిగా సింగరేణి….

Share

స్కామ్‌’రేణిగా సింగరేణి.
* రేవంత్ సర్కారు నిలువు దోపిడీ!
*రూ.1,600 కోట్ల విలువైన 40 లక్షల టన్నుల బొగ్గు మాయం.
*బంగారు బాతు లాంటి సంస్థను అప్పుల కుప్పగా మార్చిన వైనం.
* సింగరేణి డబ్బులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఫుట్‌బాల్ సోకులు.
* కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి విచారణ నివేదికను వెంటనే బయటపెట్టాలి.
*కాంగ్రెస్ హటావో- సింగరేణి బచావో’ కార్మికుల నినాదం కావాలి.
* తెలంగాణ భవన్‌లో టీబీజీకేఎస్ సమావేశంలో మాజీ మంత్రి హరీశ్‌రావు తీవ్ర ధ్వజం.
హైదరాబాద్,మహా.
ఒకప్పుడు తెలంగాణకు సిరులగనిగా వెలుగొందిన సింగరేణి సంస్థ, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కేవలం స్కామ్‌ల గనిగా మారిపోయిందని మాజీ మంత్రి, బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ తన్నీరు హరీశ్‌రావు తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. పాలకుల దోపిడీ కారణంగా సింగరేణి పరిస్థితి అత్యంత ఆందోళనకరంగా తయారైందని, బయట నుంచి చూసేందుకు మేడిపండులా కనిపిస్తున్నా లోపల మాత్రం కుంభకోణాలతో గుల్లవుతోందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. మంగళవారం తెలంగాణ భవన్‌లో జరిగిన తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం (టీబీజీకేఎస్) రాష్ట్ర కార్యవర్గ సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. గతంలో ఉమ్మడి రాష్ట్రంలో అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సింగరేణిలో ఉద్యోగాలను తొలగిస్తే.. స్వరాష్ట్రంలో కేసీఆర్ ఏకంగా 19 వేల మందికి కొత్తగా ఉద్యోగాలు ఇచ్చి సంస్థకు జీవం పోశారని గుర్తు చేశారు. ఉద్యోగాలు ఇవ్వడం బీఆర్ఎస్ విధానమైతే, ఉన్న ఉద్యోగాలను ఊడగొట్టి కార్మికుల పొట్టకొట్టడం కాంగ్రెస్ నైజంగా మారిందని ఆయన తీవ్రస్థాయిలో మండిపడ్డారు.
**అప్పుల కుప్పగా.. ఓడీల మయంగా మారిన వైనం**
కాంగ్రెస్ ప్రభుత్వం అందినకాడికి సింగరేణిని దోచుకుంటోందని హరీశ్‌రావు ఆరోపించారు. గతంలో ఫిక్స్‌డ్ డిపాజిట్లతో లాభాల బాటలో నడిచిన సంస్థ, నేడు ఓవర్‌డ్రాఫ్ట్ (ఓడీ) తెచ్చుకునే దయనీయ స్థితికి దిగజారిపోయిందని విమర్శించారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఓడీ కేవలం రూ. 3,200 కోట్లు ఉంటే, ఒక్క సింగరేణి ఓడీనే రూ. 4 వేల కోట్లకు చేరుకుందంటే పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో అర్థం చేసుకోవచ్చన్నారు. 2014 నాటికి సింగరేణికి రావాల్సిన బకాయిలు కేవలం రూ. 2 వేల కోట్లు మాత్రమే ఉండేవని, ఆ తర్వాత తెలంగాణ జెన్‌కో నుంచి రూ. 7 వేల కోట్ల బకాయిలు ఉండేవని వివరించారు. కానీ ప్రస్తుత కాంగ్రెస్ రెండున్నరేళ్ల పాలనలోనే సింగరేణికి రావాల్సిన బకాయిలు అడ్డగోలుగా పెరిగిపోయి ఏకంగా రూ. 21 వేల కోట్లకు చేరుకున్నాయని, ఇందులో రూ. 14 వేల కోట్ల బకాయిలు కాంగ్రెస్ హయాంలో పెరిగినవేనని ఆధారాలతో సహా వివరించారు. ముఖ్యంగా కరెంటు వ్యవహారాలకు సంబంధించి సంస్థకు కేటాయించాల్సిన రూ. 20 వేల కోట్ల బకాయిలు ఇంకా పెండింగ్‌లోనే మూలుగుతున్నాయని ఆయన ప్రభుత్వ తీరును ఎండగట్టారు.
**ఆ 1600 కోట్ల బొగ్గు ఎటు పోయింది?**
సింగరేణిలో జరుగుతున్న భారీ బొగ్గు కుంభకోణాన్ని హరీశ్‌రావు ఈ సందర్భంగా బట్టబయలు చేశారు. సింగరేణి అధికారిక వెబ్‌సైట్‌లో సుమారు 40 లక్షల మెట్రిక్ టన్నుల బొగ్గు నిల్వలు (స్టాక్) ఉన్నట్లు చూపిస్తున్నారని, ఆ బొగ్గుపై ఆదాయం వచ్చినట్లుగా లెక్కలు చూపి పన్నులు (ఇన్‌కమ్ ట్యాక్స్) కూడా చెల్లించారని వెల్లడించారు. మార్కెట్లో ఈ 40 లక్షల మెట్రిక్ టన్నుల బొగ్గు విలువ సుమారు రూ. 1,600 కోట్లు ఉంటుందని, కానీ క్షేత్రస్థాయిలో ఆ బొగ్గు ఎక్కడా లేదని బాంబు పేల్చారు. కాగితాలపై ఉన్న ఆ 1,600 కోట్ల విలువైన బొగ్గు వాస్తవానికి ఎక్కడికి పోయిందో యాజమాన్యాన్ని టీబీజీకేఎస్ నాయకులు గట్టిగా నిలదీయాలని ఆయన పిలుపునిచ్చారు.
**కమిషన్ల కోసమే అడ్డగోలు టెండర్లు**
సింగరేణి నిధులను దారి మళ్లించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన ఫుట్‌బాల్ సోకుల కోసం వాడుకుంటున్నారని హరీశ్‌రావు తీవ్ర ఆరోపణలు చేశారు. నైనీ బ్లాక్ బొగ్గు గనుల టెండర్ వ్యవహారం కాంగ్రెస్ ప్రభుత్వ అవినీతిని బట్టబయలు చేసిందని, ఈ కుంభకోణాన్ని బయటపెట్టిన పాపానికి కొందరు జర్నలిస్టులు జైలుకు వెళ్లాల్సిన దుస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు. మరోవైపు, రాజస్థాన్ ప్రభుత్వంతో కుమ్మక్కై పాకిస్థాన్ సరిహద్దులోని జైసల్మేర్‌లో సింగరేణి నిధులతో సోలార్ పవర్ ప్లాంట్ ఏర్పాటు చేసేందుకు కుట్రలు పన్నుతున్నారని ధ్వజమెత్తారు. ఎన్టీపీసీ సంస్థ అత్యంత చౌకగా విద్యుత్ ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నా ఈ ప్రభుత్వం ఒప్పుకోవడం లేదన్నారు. పీపీఏ, డీపీఆర్ అప్రూవల్ కాకుండానే థర్మల్ పవర్ ప్లాంట్ సివిల్ వర్క్స్ ప్రారంభించేశారని, ప్లాంట్ నిర్మాణం ఆలస్యమవుతున్న కొద్దీ సంస్థకు కోట్ల రూపాయల్లో నష్టం వాటిల్లుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. కాంట్రాక్టర్లకు పనులు కట్టబెట్టి కమీషన్ల కోసం మొబిలైజేషన్ అడ్వాన్సులు చెల్లించి, ఆ డబ్బును ప్రభుత్వ పెద్దలు తమ జేబుల్లో వేసుకుంటున్నారని ఆరోపించారు.
**కిషన్‌రెడ్డి నివేదిక ఎందుకు బయటపెట్టరు?**
సింగరేణిలో జరుగుతున్న ఈ నిలువు దోపిడీపై కేంద్ర ప్రభుత్వం కూడా స్పందించాలని హరీశ్‌రావు డిమాండ్ చేశారు. తెలంగాణలో మాయమైన 40 వేల మెట్రిక్ టన్నుల బొగ్గు ఎక్కడ ఉందో ఆధారాలతో సహా చూపించాల్సిన బాధ్యత కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డిపై ఉందన్నారు. బొగ్గు గనుల్లో జరుగుతున్న అవినీతిపై బీఆర్ఎస్ పదేపదే గళమెత్తడంతో కేంద్ర ప్రభుత్వం ఒక విచారణ కమిటీని వేసిందని, ఆ కమిటీ ఏం తేల్చిందో తక్షణమే పబ్లిక్ డొమైన్‌లో పెట్టాలని డిమాండ్ చేశారు. ఒకవేళ ఆ నివేదికను బయటపెట్టకపోతే కాంగ్రెస్, బీజేపీలు రెండు ఒక్కటేనని ప్రజలకు స్పష్టంగా చెప్పాల్సి వస్తుందని హెచ్చరించారు. సంస్థలో పరిస్థితి ఇలాగే కొనసాగితే భవిష్యత్తులో కార్మికులకు కనీసం జీతాలు కూడా ఇవ్వలేని దుస్థితి వస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. రాబోయే రోజుల్లో సింగరేణికి సంబంధించి కాంగ్రెస్ ప్రభుత్వ అక్రమాలను మరింతగా బయటపెడతామని, ఇప్పటికైనా కార్మికులంతా ఏకమై ‘కాంగ్రెస్ హటావో – సింగరేణి బచావో’ అనే నినాదంతో ముందుకు సాగాలని హరీశ్‌రావు పిలుపునిచ్చారు.