Mahaa Daily Exclusive

  ఉద్యమకారులను విస్మరించిన కాంగ్రెస్ సర్కార్….

Share

*ఉద్యమకారులను విస్మరించిన కాంగ్రెస్ సర్కార్*

*వరంగల్ కలెక్టరెట్ లో ఉద్రిక్తత*

*ఉద్యమకారులకు,పోలీసులకు మధ్య వాగ్వివాదం*

*జిల్లా పౌరులుగా కలెక్టర్ ను బరాబర్ కలుస్తాం*

*ఉద్యమ నేత, మాజీ ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్*

*ఉద్యమకారులతో కలిసి నరేందర్ కలెక్టర్ కు వినతిపత్రం అందజేత*

*మహా వరంగల్ బ్యూరో*

తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ప్రాణత్యాగాలు చేసిన అమరవీరులు, తమ జీవితాలను అంకితం చేసిన ఉద్యమకారుల త్యాగాలను కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విస్మరించిందని దీనిని బిఆర్ ఎస్ పార్టీ తరపున తీవ్రంగా ఖండిస్తున్నామని మాజీ ఎమ్మెల్యే ఉద్యమ నేత నన్నపునేని నరేందర్ కాంగ్రెస్ ప్రభుత్వం పై నిప్పులు చేరిగారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఉద్యమకారులకు ఇచ్చిన హామీలను విస్మరించారని పెద్ద ఎత్తున వరంగల్ జిల్లా ఉద్యమకారులతో కలిసి నన్నపునేని నరేందర్ సోమవారం ప్రజావాణి కార్యక్రమంలో కలెక్టర్ ను కలిసి వినతిపత్రం అందజేసేందుకు వెళ్లగా పోలీసులు అడ్డుకోగా ఉద్యమకారులకు పోలీసులకు మధ్య వాగ్వివాదం చోటుచేసుకుంది. చివరకు కలెక్టర్ అనుమతించడం తో వారు కలెక్టర్ ను కలిసి ఉద్యమకారుల సమస్యల పై వినతి పత్రం అందజేశారు.
అనంతరం నన్నపునేని నరేందర్ మాట్లాడుతూ
ఆరు దశాబ్దాల పాటు సాగిన తెలంగాణ ఉద్యమంలో విద్యార్థులు, ఉద్యోగులు, రచయితలు, కవులు, కళాకారులు, జర్నలిస్టులు, రైతులు, మహిళలు, మేధావులు ప్రాణాలను సైతం లెక్కచేయకుండా పోరాడారని
అలాంటి ఉద్యమకారులకు గౌరవం, గుర్తింపు, సంక్షేమం కల్పిస్తామని 2023 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ తన మేనిఫెస్టోలో గొప్ప హామీలు ఇచ్చింది.
కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో పేర్కొన్న ప్రధాన హామీలు:
• తెలంగాణ ఉద్యమకారులకు ప్రత్యేక గుర్తింపు కార్డులు
• ఉద్యమకారులకు నెలసరి ఆర్థిక సహాయం, పెన్షన్
• అమరవీరుల కుటుంబాలకు ప్రభుత్వ పరంగా పూర్తి అండ
• ఉద్యమకారుల పిల్లలకు విద్య, ఉద్యోగ అవకాశాల్లో ప్రాధాన్యత
• ఉద్యమంలో పాల్గొన్న నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు
• ఉద్యమకారులపై నమోదైన కేసుల ఉపసంహరణ
• అమరవీరుల కుటుంబాలకు ప్రత్యేక సంక్షేమ పథకాలు
• ఉద్యమంలో పాల్గొన్న కళాకారులు, జర్నలిస్టులు, ఉద్యోగ సంఘాల నేతలకు గుర్తింపు
ఎన్నికల సమయంలో ఉద్యమకారుల త్యాగాలను గొప్పగా చెప్పుకున్న కాంగ్రెస్ పార్టీ, అధికారంలోకి వచ్చాక వారిని పూర్తిగా విస్మరించారని తీవ్ర స్థాయిలో విమర్శించారు. కాంగ్రెస్ గెలిచినప్పటి నుండి ఇప్పటి వరకు ఉద్యమకారులకు ప్రత్యేక గుర్తింపు కార్డులు ఇవ్వలేదు.
హామీ ఇచ్చిన ఆర్థిక సహాయం అమలు కాలేదు.
ఉద్యమకారుల సమస్యల పరిష్కారానికి ప్రత్యేక వ్యవస్థ కూడా ఏర్పాటు చేయలేదు.

ఆనాడు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రిగా కేసీఆర్ ఉద్యమకారులను ప్రభుత్వంలో భాగస్వాములను చేసి చరిత్ర సృష్టించారు.
ప్రపంచ ఉద్యమాల చరిత్రలోనే అరుదుగా జరిగే విధంగా ఉద్యమంలో పాల్గొన్న రచయితలు, కవులు, విద్యార్థి నాయకులు, ఉద్యోగ సంఘాల నేతలు, జర్నలిస్టులు, కళాకారులు, మేధావులకు కార్పొరేషన్లు, కమిషన్లు, అకాడమీలు, ప్రభుత్వ సంస్థల్లో కీలక పదవులు ఇచ్చి గౌరవించారు.

“నీళ్లు-నిజాలు” ద్వారా తెలంగాణ జలహక్కుల కోసం పోరాడిన ఆర్. విద్యాసాగర్ రావు గారిని నీటిపారుదల సలహాదారుగా, ప్రొఫెసర్ ఘంటా చక్రపాణి గారిని టీఎస్‌పీఎస్సీ చైర్మన్‌గా, దేశపతి శ్రీనివాస్ గారిని ఓఎస్డీగా, అల్లం నారాయణ ను ప్రెస్ అకాడమీ చైర్మన్‌గా, దేవీప్రసాద్ కు బెవరేజెస్ కార్పొరేషన్ చైర్మన్ పదవి, కె. స్వామిగౌడ్ కు శాసనమండలి చైర్మన్ పదవి, గోరేటి వెంకన్న కు ఎమ్మెల్సీ అవకాశం వంటి ఎన్నో గౌరవాలు కల్పించారని గుర్తు చేశారు.
అంతేకాకుండా తెలంగాణ ఉద్యమంలో అమరులైన కుటుంబాలకు జీవొ నెంబర్ 36 ద్వారా 459 అమరవీరుల కుటుంబాలను గుర్తించి ప్రతి కుటుంబానికి రూ.10 లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు.
కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం, పిల్లలకు ఉచిత విద్య, వైద్య సహాయం, భూమిలేని కుటుంబాలకు భూమి వంటి పలు సంక్షేమ కార్యక్రమాలను అమలు చేశారు.
తెలంగాణ తొలి బడ్జెట్‌లోనే అమరవీరుల కుటుంబాల కోసం రూ.100 కోట్లు కేటాయించడం
ఉద్యమ త్యాగాల పట్ల కేసీఆర్ ప్రభుత్వ నిబద్ధతకు నిదర్శనమని అన్నారు.
కాగా నేడు రేవంత్ రెడ్డి ప్రభుత్వం మాత్రం ఉద్యమకారుల పేరును కేవలం రాజకీయ ప్రయోజనాల కోసం మాత్రమే ఉపయోగించుకుంటోంది. ఎన్నికల హామీలు అమలు చేయకుండా ఉద్యమకారులను మోసం చేస్తోంది. తెలంగాణ కోసం పోరాడిన కుటుంబాల కన్నీళ్లు తుడవాల్సిన ప్రభుత్వం నేడు వారిని కార్యాలయాల చుట్టూ తిరిగే పరిస్థితికి నెట్టింది.
తెలంగాణ కోసం పోరాడిన ఉద్యమకారుల గౌరవాన్ని కాపాడాల్సిన బాధ్యత ప్రతి ప్రభుత్వానిదే. వెంటనే కాంగ్రెస్ ప్రభుత్వం తన మేనిఫెస్టోలో ఇచ్చిన హామీల అమలుపై శ్వేతపత్రం విడుదల చేయాలి. ఉద్యమకారులు, అమరవీరుల కుటుంబాలకు ఇచ్చిన హామీలను తక్షణమే అమలు చేయాలని ఈ సందర్భంగా వారు డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో వరంగల్ తూర్పు నియోజకవర్గం ఉద్యమకారులు మరియు బీ ఆర్ఎస్ పార్టీ ముఖ్య నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.