Mahaa Daily Exclusive

  అసోం అసెంబ్లీలో ‘ఉమ్మడి పౌర స్మృతి’కి ఆమోదం….

Share

అసోం అసెంబ్లీలో ‘ఉమ్మడి పౌర స్మృతి’కి ఆమోదం.
* బహుభార్యత్వంపై సర్కారు కొరడా.
* యూసీసీ బిల్లును ఏకగ్రీవంగా ఆమోదించిన హిమంత బిశ్వ శర్మ ప్రభుత్వం.
* బహుభార్యత్వానికి ఏడేళ్లు, సహజీవనం రిజిస్ట్రేషన్ చేసుకోకుంటే మూడు నెలల జైలు.
* అసలు నెహ్రూనే యూసీసీ కావాలన్నారంటూ ప్రతిపక్ష కాంగ్రెస్‌పై సీఎం హిమంత సంచలన వ్యాఖ్యలు.
ఢిల్లీ, మహా.
దేశ రాజకీయాల్లో మరో సంచలనం చోటుచేసుకుంది. అసోం రాష్ట్ర అసెంబ్లీ బుధవారం ప్రతిష్ఠాత్మక ‘ఉమ్మడి పౌర స్మృతి (యూసీసీ) బిల్లు’కు అధికారికంగా ఆమోదముద్ర వేసింది. విపక్షాలు తీవ్ర స్థాయిలో అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ ఈ కీలక బిల్లును సెలెక్ట్ కమిటీ పరిశీలనకు పంపాలని పట్టుబట్టినా, ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ నేతృత్వంలోని బీజేపీ సర్కారు ఏమాత్రం వెనక్కి తగ్గలేదు. మతంతో ఎలాంటి సంబంధం లేకుండా రాష్ట్ర పౌరులందరికీ పెళ్లి, విడాకులు, వారసత్వం, సహజీవనం వంటి వ్యక్తిగత వ్యవహారాల్లో ఒకే రకమైన చట్టాన్ని తీసుకురావాలన్న దృఢ సంకల్పంతో సోమవారం సభలో ప్రవేశపెట్టిన ఈ బిల్లు ఎట్టకేలకు చట్టరూపం దాల్చింది.
ఈ కొత్త చట్టం ప్రకారం రాష్ట్రంలో బహుభార్యత్వాన్ని పూర్తిగా నిషేధించారు. చట్టాన్ని ఉల్లంఘించి ఎవరైనా ఒకరికంటే ఎక్కువ మందిని వివాహం చేసుకుంటే ఏకంగా ఏడేళ్ల కఠిన జైలు శిక్ష విధించేలా నిబంధనలు పొందుపరిచారు. అలాగే, నేటి సమాజంలో పెరుగుతున్న సహజీవనం (లివ్-ఇన్ రిలేషన్‌షిప్) వ్యవహారాలపైనా సర్కారు ఉక్కుపాదం మోపింది. సహజీవనం చేసే జంటలు కచ్చితంగా తమ బంధాన్ని ప్రభుత్వ రికార్డుల్లో నమోదు చేసుకోవాల్సిందేనని, రిజిస్ట్రేషన్ చేసుకోకపోతే మూడు నెలల పాటు జైలు ఊచలు లెక్కపెట్టక తప్పదని స్పష్టం చేసింది. అయితే, ఈ ఉమ్మడి పౌర స్మృతి నిబంధనలు అసోంలో నివసించే షెడ్యూల్ తెగలకు (ఎస్టీలకు) మాత్రం వర్తించవని సర్కారు మినహాయింపునివ్వడం గమనార్హం.
ఈ బిల్లు ఆమోదం పొందడానికి ముందు అసెంబ్లీలో ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ ప్రతిపక్ష కాంగ్రెస్‌పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నట్లుగా ఈ చట్టం ఏమాత్రం బీజేపీ లేదా ఆర్ఎస్ఎస్ సిద్ధాంతాల పునాదులపై రాలేదని, భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 44 ఆధారంగానే దీన్ని ఎంతో పకడ్బందీగా రూపొందించామని ఆయన కుండబద్దలు కొట్టారు. వాస్తవానికి ఈ యూసీసీ అనేది 1925లో తొలిసారిగా కాంగ్రెస్ పార్టీయే డిమాండ్ చేసిందని, 1937లో సాక్షాత్తూ జవహర్లాల్ నెహ్రూ సైతం దీన్ని తీసుకురావాలని సూచించారని ఆయన సభకు గుర్తుచేశారు. కానీ, ఆనాటి కాంగ్రెస్ ఇప్పుడు సెక్యులర్ పార్టీగా లేదని, కేవలం ముస్లిం సమాజానికి మాత్రమే ప్రతినిధిగా మారిపోయిందని ఎద్దేవా చేశారు. 126 మంది సభ్యులున్న అసెంబ్లీలో కాంగ్రెస్ పార్టీకి 19 మంది ఎమ్మెల్యేలు ఉంటే, అందులో 18 మంది ముస్లిం వర్గానికే చెందినవారని, కేవలం ఒక్కరు మాత్రమే హిందువు ఉన్నారని లెక్కలతో సహా వివరిస్తూ కాంగ్రెస్ అన్ని కులాలు, వర్గాలకు ప్రాతినిధ్యం వహించడం లేదని తీవ్ర విమర్శలు గుప్పించారు. ఆ పార్టీ ఇప్పుడు యూసీసీని హిందూ, క్రైస్తవ, గిరిజనుల కోణం నుంచి కాకుండా కేవలం షరియా, ఖురాన్ కోణంలో చూస్తూ వ్యతిరేకిస్తోందని ఆయన ఆరోపించారు. మరోవైపు అసోం ప్రభుత్వం యూసీసీ బిల్లును ఆమోదించడంపై కేంద్ర హోం మంత్రి అమిత్ షా హర్షం వ్యక్తం చేశారు. ప్రధాని మోదీ నాయకత్వంలో బీజేపీ రాష్ట్ర ప్రభుత్వాలు పౌరులందరికీ ఒకే చట్టం తెస్తున్నాయని, ఉత్తరాఖండ్, గుజరాత్ తర్వాత ఇప్పుడు అసోం ప్రజలకు ఆయన అభినందనలు తెలిపారు.
ఇదిలా ఉంటే, ఈ బిల్లుపై ప్రతిపక్షాలు అగ్గిమీద గుగ్గిలమవుతున్నాయి. ఇది కేవలం ఎన్నికల వేళ బీజేపీ ఆడుతున్న రాజకీయ ఎజెండా అని కాంగ్రెస్ ఎమ్మెల్యే వాజెద్ అలీ చౌదరి మండిపడ్డారు. బాల్యవివాహాలు, బహుభార్యత్వం, విడాకుల రిజిస్ట్రేషన్, భరణం వంటి వాటికి ఇప్పటికే దేశంలో వేర్వేరు చట్టాలు అమల్లో ఉన్నప్పుడు, కొత్తగా ఈ యూసీసీ నాటకం ఎందుకని ఆయన నిలదీశారు. రాష్ట్రంలో నిరుద్యోగం, వరదలు, ప్రభుత్వ బడుల దుస్థితి వంటి అసలైన సమస్యల నుంచి ప్రజల దృష్టిని మళ్లించడానికే సర్కారు ఈ ఎత్తుగడ వేసిందని దుయ్యబట్టారు. ఒకవైపు గిరిజనులకు మినహాయింపు ఇచ్చినప్పుడు దీన్ని ‘ఉమ్మడి’ చట్టం అని ఎలా పిలుస్తారని ఆయన లాజికల్ పాయింట్ లేవనెత్తారు. 2018 నాటి లా కమిషన్ సైతం ఇలాంటి బిల్లును వ్యతిరేకించిందని మరో కాంగ్రెస్ ఎమ్మెల్యే జాకీర్ హుస్సేన్ గుర్తు చేయగా.. ఎన్డీఏ సర్కారు మైనారిటీల హక్కులను కాలరాసే దురుద్దేశంతో ఈ బిల్లు తెచ్చిందంటూ అసెంబ్లీలోని ఏకైక టీఎంసీ ఎమ్మెల్యే షెర్మన్ అలీ అహ్మద్ సభ నుంచి వాకౌట్ చేసి తమ తీవ్ర నిరసనను వ్యక్తం చేశారు.