ఒమన్‌ను పేల్చేస్తాం!”.
* మిత్రదేశంపై ట్రంప్ సంచలన హెచ్చరిక.
* అంతర్జాతీయ జలమార్గం హోర్ముజ్ పై ఆధిపత్యం చెలాయిస్తే సహించేది లేదు.
* ఇరాన్ సైనిక స్థావరాలపై మరోసారి అమెరికా వైమానిక దాడులు.
వాషింగ్టన్, మహా.
అమెరికా, ఇరాన్ దేశాల మధ్య రగులుతున్న యుద్ధం మరింత ప్రమాదకర స్థాయికి చేరుకుంది. గత మూడు నెలలుగా ఇరు దేశాల మధ్య నెలకొన్న ఉద్రిక్తతలు ఇప్పుడు పశ్చిమాసియా భద్రతను, ప్రపంచ ఆర్థిక వ్యవస్థను తీవ్ర ఆందోళనకు గురిచేస్తున్నాయి. ఫిబ్రవరి 28న అమెరికా, ఇజ్రాయెల్ సంయుక్తంగా ఇరాన్‌పై ప్రారంభించిన దాడులు తీవ్రతరమవుతున్న వేళ, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అత్యంత కీలకమైన హోర్ముజ్ జలసంధి ప్రాంతంలో ఇరాన్‌తో చేతులు కలిపి తమకు వ్యతిరేకంగా వ్యవహరిస్తే.. దశాబ్దాల కాలంగా తమకు అత్యంత సన్నిహిత మిత్రదేశంగా ఉన్న ‘ఒమన్’ దేశాన్ని సైతం బాంబులతో పేల్చేస్తామని ఆయన తీవ్రస్థాయిలో హెచ్చరించారు. వైట్ హౌస్‌లో జరిగిన క్యాబినెట్ సమావేశంలో ట్రంప్ చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు అంతర్జాతీయంగా పెను ప్రకంపనలు సృష్టిస్తున్నాయి.
అసలు వివాదం ఎక్కడ మొదలైందంటే.. ప్రపంచ చమురు రవాణాలో దాదాపు 20 శాతానికి పైగా వాణిజ్యం హోర్ముజ్ జలసంధి గుండానే జరుగుతుంది. అయితే, అమెరికా-ఇజ్రాయెల్ దాడుల నేపథ్యంలో ఈ మార్గంలో వాణిజ్యం దాదాపుగా నిలిచిపోయింది. ఈ తరుణంలో ఇరాన్ ఒక కొత్త ప్రతిపాదనను తెరపైకి తెచ్చింది. హోర్ముజ్ జలసంధి గుండా వెళ్లే వాణిజ్య నౌకల రవాణాను నియంత్రించేలా లేదా టోల్ వసూలు చేసేలా ఇరాన్, ఒమన్ దేశాలు ఉమ్మడిగా ఒక ఒప్పందం కుదుర్చుకోబోతున్నాయంటూ ఇరాన్ ప్రభుత్వ మీడియా సంచలన ప్రకటన చేసింది. ఈ వార్తలపై డొనాల్డ్ ట్రంప్ తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. “హోర్ముజ్ అనేది అంతర్జాతీయ జలమార్గం. దానిపై పెత్తనం చెలాయించడానికి లేదా నియంత్రించడానికి ఎవరికీ హక్కు లేదు. ఒమన్ అందరిలాగే బుద్ధిగా ప్రవర్తించాలి. అలా కాకుండా ఇరాన్‌తో చేతులు కలిపితే మాత్రం ఆ దేశాన్ని పేల్చేయాల్సి వస్తుంది” అని ఆయన బహిరంగంగానే హెచ్చరించారు.
అమెరికాకు దశాబ్దాలుగా నమ్మకమైన మిత్రదేశంగా, ఇరు దేశాల మధ్య శాంతి చర్చల్లో మధ్యవర్తిగా వ్యవహరిస్తున్న ఒమన్ పై ట్రంప్ ఇలాంటి తీవ్ర వ్యాఖ్యలు చేయడం దౌత్య వర్గాలను విస్మయానికి గురిచేసింది. 1790వ సంవత్సరం నుండి అమెరికా, ఒమన్ మధ్య సత్సంబంధాలు ఉన్నాయి. అమెరికా నౌకాదళానికి ఒమన్‌లోని దుక్మ్ పోర్టులో సైనిక ప్రవేశం కూడా ఉంది. అయినప్పటికీ కేవలం వాణిజ్యపరమైన ఆధిపత్యం కోసం ఒక సార్వభౌమ దేశాన్ని నామరూపాల్లేకుండా చేస్తామంటూ ట్రంప్ బెదిరించడాన్ని అంతర్జాతీయ విశ్లేషకులు ‘గన్‌బోట్ డిప్లొమసీ’గా అభివర్ణిస్తూ తీవ్రంగా తప్పుబడుతున్నారు. బహుశా ట్రంప్ పొరపాటున ఇరాన్ అనబోయి ఒమన్ అన్నారేమోనని వైట్ హౌస్ వర్గాల్లో తొలుత చర్చ జరిగినప్పటికీ, అమెరికా విదేశాంగ శాఖ అధికారికంగా విడుదల చేసిన ట్రాన్స్క్రిప్ట్‌లోనూ ‘ఒమన్’ అనే ఉండటంతో ఆయన ఉద్దేశపూర్వకంగానే ఈ వ్యాఖ్యలు చేసినట్లు అంతర్జాతీయ మీడియా సంస్థలు వెల్లడించాయి.
మరోవైపు హోర్ముజ్ జలసంధి సమీపంలో ఇరాన్ సైనిక స్థావరాలే లక్ష్యంగా అమెరికా బలగాలు బాంబుల వర్షం కురిపించాయి. అక్కడ ఉన్న డ్రోన్ కంట్రోల్ సెంటర్లను నేలమట్టం చేయడంతో పాటు పలు ఇరానియన్ డ్రోన్లను అమెరికా సైన్యం కూల్చివేసింది. ఒక అమెరికా వాణిజ్య నౌకను లక్ష్యంగా చేసుకుని ఇరాన్ నాలుగు డ్రోన్లను ప్రయోగించిందని, వాటిని సమర్థవంతంగా అడ్డుకున్నామని అమెరికా రక్షణ శాఖ అధికారులు వెల్లడించారు. భవిష్యత్తులో ఇరాన్ మరింత దారుణమైన దాడులకు పాల్పడకముందే, ముందస్తు ఆత్మరక్షణ చర్యల్లో భాగంగానే ఈ ఆపరేషన్ చేపట్టామని అమెరికా సైన్యం సమర్థించుకుంది. కానీ, ఈ చర్యల ద్వారా అమెరికా ఉద్దేశపూర్వకంగానే కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించిందని ఇరాన్ తీవ్రంగా మండిపడింది.
పాకిస్థాన్ ఆర్మీ చీఫ్, ప్రధాని అభ్యర్థన మేరకు తాము ఇరాన్‌కు శాంతి చర్చల కోసం ఒక చిన్న అవకాశం ఇచ్చామని, ఆ దేశ ఆర్థిక వ్యవస్థ ఇప్పటికే పూర్తిగా పతనమైందని ట్రంప్ పేర్కొన్నారు. ఈ పరిణామాలన్నీ మూడో ప్రపంచ యుద్ధానికి దారితీస్తాయా అన్న భయాందోళనలు ప్రస్తుతం సర్వత్రా వ్యక్తమవుతున్నాయి. ప్రపంచ చమురు సరఫరాకు అత్యంత కీలకమైన హోర్ముజ్ జలసంధి వద్ద రగులుతున్న ఈ చిన్న నిప్పురవ్వ.. ఏ క్షణమైనా ప్రపంచ ఆర్థిక వ్యవస్థను దహించివేసే దావానలంగా మారే ప్రమాదం ఉందని ఆర్థిక నిపుణులు హెచ్చరిస్తున్నారు. పరిస్థితి ఇలాగే కొనసాగితే అంతర్జాతీయంగా ముడిచమురు ధరలు ఆకాశాన్ని తాకడం ఖాయమని ఆందోళన వ్యక్తంచేస్తున్నారు.








