Mahaa Daily Exclusive

  నన్ను జైల్లో పెట్టి పైశాచిక ఆనందం పొందుతున్నారు.:బాల్క సుమన్.

Share

 

హైదరాబాద్, మహా.
హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్ వద్ద శనివారం తీవ్ర ఉద్రిక్త పరిస్థితుల నడుమ బీఆర్ఎస్ నేత, మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్‌ను పోలీసులు అరెస్టు చేశారు. ఆయన తెలంగాణ భవన్‌లో ఉన్నారన్న సమాచారంతో పోలీసులు అక్కడికి చేరుకోగా.. బీఆర్ఎస్ శ్రేణులు వారిని లోపలికి వెళ్లకుండా అడ్డుకోవడంతో తీవ్ర గందరగోళం నెలకొంది. కార్యకర్తలు కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ పోలీసులతో వాగ్వాదానికి దిగారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో, బీఆర్ఎస్ న్యాయవాదులతో చర్చలు జరిపిన పోలీసులు ఎట్టకేలకు సుమన్‌ను అదుపులోకి తీసుకుంటున్నట్లు ప్రకటించారు.
అరెస్టుకు ముందు బాల్క సుమన్ మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. తనను జైల్లో పెట్టి పైశాచిక ఆనందం పొందాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రి వివేక్ నిర్ణయించుకున్నారని, ఇదంతా కాంగ్రెస్ ప్రభుత్వ రాజకీయ కక్ష సాధింపు చర్యల్లో భాగమేనని ఆయన ఆరోపించారు. రాష్ట్రంలో ప్రస్తుతం ఎమర్జెన్సీ తరహా పాలన సాగుతోందని మండిపడ్డారు. తెలంగాణ మలిదశ ఉద్యమ సమయంలో తనపై 250కి పైగా కేసులు పెట్టారని గుర్తుచేసిన ఆయన, ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూడా సరిగ్గా అదే తరహాలో అక్రమ కేసులతో వేధింపులకు గురిచేస్తోందని విమర్శించారు.
సింగరేణి సంస్థలో వందల కోట్ల రూపాయల మేర భారీ అవినీతి జరుగుతోందని సుమన్ ఈ సందర్భంగా ఆరోపించారు. తాను అరెస్టుకు భయపడి ఎక్కడికీ పారిపోలేదని, పార్టీ కార్యక్రమాల్లో భాగంగానే భవన్‌లో ఉన్నానని ఆయన స్పష్టం చేశారు. ప్రతిపక్ష నేతలను విచారణ పేరుతో వేధించడం కాంగ్రెస్ ప్రభుత్వానికి పరిపాటిగా మారిందని దుయ్యబట్టారు. ఎన్ని కేసులు బనాయించినా తాను చట్టాన్ని గౌరవిస్తానని, పోలీసుల విచారణకు పూర్తి స్థాయిలో సహకరిస్తానని బాల్క సుమన్ స్పష్టం చేశారు.