Mahaa Daily Exclusive

  కారాగారంలో ప్రసవం.. కారుణ్యంతో ఇంటికి…

Share

కారాగారంలో ప్రసవం.. కారుణ్యంతో ఇంటికి.
* బెయిల్ వచ్చినా వెళ్లలేని దీనస్థితిలో వలస మహిళ.
* న్యాయ సేవా సంస్థ, జైలు అధికారుల చొరవతో స్వగ్రామానికి.
అహ్మదాబాద్,మహా.
ఉపాధి కోసం వలస వచ్చి అనుకోని పరిస్థితుల్లో జైలు పాలైంది. నిండు గర్భిణిగా ఉన్నప్పుడే కారాగారంలో అడుగుపెట్టి, అక్కడే ఓ పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. కోర్టు బెయిల్ మంజూరు చేసినా, విడిపించుకెళ్లేందుకు ఎవరూ లేక పసిబిడ్డలతో జైలుకే పరిమితమైన ఆ అభాగ్యురాలికి న్యాయ సేవా సంస్థ, పోలీస్ అధికారులు అండగా నిలిచారు. గుజరాత్‌లోని నడియాడ్ జిల్లా జైలు అధికారులు, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ (డీఎల్‌ఎస్‌ఏ) చొరవతో ఆ మహిళను ఆమె స్వరాష్ట్రమైన మధ్యప్రదేశ్‌లోని సొంత గ్రామానికి సురక్షితంగా చేర్చారు. మానవత్వం పరిమళించిన ఈ ఘటన స్థానికంగా అందరి దృష్టిని ఆకర్షించింది.
మధ్యప్రదేశ్‌లోని అలీరాజ్‌పూర్ జిల్లాకు చెందిన ఓ మహిళ తన కుటుంబంతో కలిసి ఉపాధి నిమిత్తం గుజరాత్‌కు వలస వచ్చింది. అయితే, ఆనంద్ జిల్లాలోని ఖంభాత్‌లో నమోదైన ఓ మైనర్ బాలిక అపహరణ (పోక్సో) కేసులో ఆమెను సహ నిందితురాలిగా పోలీసులు అరెస్టు చేశారు. భర్త, మరిదితో పాటు ఆమెను కూడా నడియాడ్ జిల్లా జైలుకు తరలించారు. జైలుకు వచ్చే సమయానికే ఆమె గర్భవతి కాగా, ఆమె వెంట రెండేళ్ల కుమారుడు కూడా ఉన్నాడు.
ఈ నెల 21న ఆమెకు పురిటినొప్పులు రావడంతో జైలు అధికారులు మొదట నడియాడ్ సివిల్ ఆసుపత్రికి, అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం అహ్మదాబాద్ సివిల్ ఆసుపత్రికి తరలించారు. అక్కడ ఆమె ఓ మగబిడ్డకు జన్మనిచ్చింది. అనంతరం నవజాత శిశువు, రెండేళ్ల కుమారుడితో కలిసి ఆమె తిరిగి జైలుకు చేరుకుంది. ఆ తర్వాత విచారణ జరిపిన స్థానిక కోర్టు ఆమెకు బెయిల్ మంజూరు చేసింది. కానీ, భర్త జైల్లోనే ఉండటం, ఆర్థిక పరిస్థితి అత్యంత దయనీయంగా ఉండటంతో ఆమెను ఇంటికి తీసుకెళ్లేందుకు కుటుంబ సభ్యులెవరూ ముందుకు రాలేదు.
బెయిల్ వచ్చినా జైలులోనే మగ్గుతున్న ఆ వలస మహిళ దీనస్థితిని డీఎల్‌ఎస్‌ఏ అధికారులు గమనించారు. వెంటనే ఆమెను పసిబిడ్డలతో సహా సురక్షితంగా ఇంటికి పంపించేలా చర్యలు తీసుకోవాలని జైలు అధికారులను కోరారు. ఈ మేరకు డీజీపీ కేఎల్‌ఎన్ రావు ఆదేశాలతో నడియాడ్ జైలు పోలీసులు ఓ స్వచ్ఛంద సంస్థ సహకారంతో ప్రత్యేక వాహనాన్ని ఏర్పాటు చేశారు. ఇద్దరు పోలీస్ కానిస్టేబుళ్ల భద్రత నడుమ ఆ మహిళను, ఆమె ఇద్దరు పిల్లలను మధ్యప్రదేశ్‌లోని స్వగ్రామానికి తరలించారు. స్థానిక పోలీసుల సమక్షంలో ఆమెను కుటుంబ సభ్యులకు సురక్షితంగా అప్పగించారు. తమ బిడ్డను క్షేమంగా ఇంటికి చేర్చిన గుజరాత్ పోలీసులకు, అధికారులకు మహిళ కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలియజేశారు.