చంద్రుడిని చుట్టి.. నేలపై మహావృక్షాలై.
* అంతరిక్ష చరిత్రకు సజీవ సాక్ష్యాలు నాసా ‘మూన్ ట్రీస్.
*ఐదు దశాబ్దాల నాటి అపోలో ప్రయోగం వెనుక ఆసక్తికర కథ.
వాషింగ్టన్,మహా.
అంతరిక్ష పరిశోధనల్లో మానవ మేధస్సుకు నిదర్శనంగా ఎన్నో అద్భుత ప్రయోగాలు జరిగాయి. కానీ, ఐదు దశాబ్దాల క్రితం అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ (నాసా) చేపట్టిన ఓ వినూత్న ప్రయోగం మాత్రం భూమిపై పచ్చని జ్ఞాపకంగా నిలిచిపోయింది. ఒకప్పుడు చంద్రుడి చుట్టూ ప్రదక్షిణలు చేసి వచ్చిన వందలాది చిన్నారి విత్తనాలు.. నేడు భూమిపై మహావృక్షాలుగా ఎదిగి అంతరిక్ష చరిత్రకు సజీవ సాక్ష్యాలుగా నిలుస్తున్నాయి. ‘చంద్రుడి వృక్షాల (మూన్ ట్రీస్)’ పేరిట నాసా చేపట్టిన ఆ ప్రయోగం గుట్టు తాజాగా మరోసారి చర్చనీయాంశంగా మారింది.
ఈ అద్భుత ప్రయోగానికి అపోలో 14 మిషన్ కమాండ్ మాడ్యూల్ పైలట్ స్టూవర్ట్ రూసా ఆలోచనలే బీజం వేశాయి. వ్యోమగామి కాకముందు ఆయన అడవుల్లో కార్చిచ్చులను ఆర్పే ‘స్మోక్‌జంపర్’గా పనిచేశారు. ఆ అనుభవంతో అమెరికా అటవీ శాఖ, నాసా సంయుక్తంగా ఈ ప్రాజెక్టును చేపట్టాయి. ఇందులో భాగంగా పైన్, సికామర్, రెడ్‌వుడ్ తదితర జాతులకు చెందిన చెట్ల విత్తనాలను నింగిలోకి పంపాయి. 1971 జనవరి 31న అపోలో 14 వ్యోమనౌక అంతరిక్షంలోకి దూసుకెళ్లింది. సహచర వ్యోమగాములు చంద్రుడి ఉపరితలంపై కాలుమోపి పరిశోధనలు చేస్తున్న సమయంలో, రూసా మాత్రం తన పర్సనల్ కిట్‌లో ఉన్న విత్తనాలతో సహా కక్ష్యలోనే ఉండిపోయారు. ఆ విత్తనాలు నేరుగా చంద్రుడి ఉపరితలాన్ని తాకనప్పటికీ, అంతరిక్షంలో వేలాది కిలోమీటర్లు ప్రయాణించి సురక్షితంగా భూమిని చేరాయి.
అయితే, భూమికి చేరిన తర్వాత ప్రయోగశాలలో విత్తనాల కంటైనర్లు ప్రమాదవశాత్తూ పేలిపోయి చెల్లాచెదురు కావడంతో శాస్త్రవేత్తలు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. ప్రయోగం విఫలమైందని కంగారుపడినప్పటికీ, ఓపికగా వాటన్నింటినీ సేకరించి నాటారు. ఆశ్చర్యకరంగా చాలా విత్తనాలు మొలకెత్తాయి. సాధారణ విత్తనాలతో పోల్చి చూసినప్పుడు అంతరిక్షానికి వెళ్లి వచ్చిన ఈ విత్తనాల ఎదుగుదలలో ఎలాంటి తేడా కనిపించకపోవడం శాస్త్రవేత్తలను సైతం విస్మయానికి గురిచేసింది.
అనంతరం 1975-76 మధ్య కాలంలో ఈ ‘మూన్ ట్రీస్’ను అమెరికా వ్యాప్తంగా నాటారు. శ్వేతసౌధం (వైట్ హౌస్), నాసా కేంద్రాలు, పలు విశ్వవిద్యాలయాలు, పాఠశాలలతో పాటు బ్రెజిల్, స్విట్జర్లాండ్, జపాన్ వంటి ఇతర దేశాలకు కూడా ఈ మొక్కలను పంపించారు. అయితే, వీటికి సంబంధించిన పూర్తి రికార్డులు అందుబాటులో లేకపోవడంతో ప్రస్తుతం ఎన్ని వృక్షాలు సజీవంగా ఉన్నాయన్న దానిపై కచ్చితమైన సమాచారం లేదు. పైగా ఇవి చూసేందుకు సాధారణ చెట్లలాగే ఉండటం, వీటి విశిష్టతను తెలిపేలా ఏర్పాటు చేసిన బోర్డులు కాలక్రమేణా పాడైపోవడంతో చాలా మందికి వీటి చరిత్ర తెలియడం లేదు. తాము సేదతీరుతున్న చెట్టు ఒకప్పుడు చంద్రుడిని చుట్టివచ్చిన విత్తనం నుంచి మొలకెత్తిందన్న రహస్యం ఎవరికీ తెలియకపోవడం గమనార్హం.
మరోవైపు, అపోలో 14 ప్రయోగం విజయవంతం కావడంతో నాసా ఈ సంప్రదాయాన్ని కొనసాగిస్తూనే ఉంది. తమ తాజా ‘ఆర్టెమిస్-1’ మిషన్‌లో కూడా మళ్లీ కొన్ని విత్తనాలను అంతరిక్షంలోకి పంపింది. చంద్రుడి అవతలి వరకు ప్రయాణించి వచ్చిన ఆ విత్తనాల మొక్కలను ఇప్పుడు అమెరికాలోని పలు పాఠశాలలు, మ్యూజియంలకు నాసా పంపిణీ చేస్తూ అంతరిక్ష ప్రయాణాన్ని భూమిపై పచ్చదనంతో ముడిపెడుతోంది.








