Mahaa Daily Exclusive

  15 ఏళ్ల వయసులో ఐపీఎల్‌ను శాసిస్తున్న వైభవ్….

Share

15 ఏళ్ల వయసులో ఐపీఎల్‌ను శాసిస్తున్న వైభవ్.
* ఫిదా అయిన లలిత్ మోడీ బంపర్ ఆఫర్.
* మ్యాచ్ ఓడినా అభిమానుల హృదయాలు గెలుచుకున్న రాజస్థాన్ యువకెరటం.
*ఐపీఎల్ చరిత్రలోనే అత్యుత్తమ కొనుగోలు అంటూ లలిత్ మోడీ ప్రశంసలు.
*ప్రపంచంలో ఎక్కడైనా చదువుకునేలా జీవితకాల స్కాలర్‌షిప్ ప్రకటన.
ముల్లన్‌పూర్,మహా.
ముల్లన్‌పూర్ వేదికగా గుజరాత్ టైటాన్స్‌తో శుక్రవారం జరిగిన ఉత్కంఠ పోరులో రాజస్థాన్ రాయల్స్ యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ విశ్వరూపం ప్రదర్శించాడు. కేవలం 15 ఏళ్ల వయసులో క్రీజులోకి దిగిన ఈ ఎడమచేతి వాటం బ్యాటర్.. ప్రపంచ స్థాయి బౌలర్లను ఉతికి ఆరేశాడు. 47 బంతుల్లోనే 8 బౌండరీలు, 7 భారీ సిక్సర్లతో 96 పరుగులు సాధించి, కేవలం నాలుగు పరుగుల తేడాతో సెంచరీ చేజార్చుకున్నాడు. అంతిమంగా ఈ మ్యాచ్‌లో రాజస్థాన్ ఓటమి పాలైనప్పటికీ, వైభవ్ ఆడిన నిర్భయమైన ఇన్నింగ్స్ క్రీడా పండితులను, అభిమానులను ఉర్రూతలూగిస్తోంది.
**మెరిసిన లలిత్ మోడీ.. చదువుకయ్యే ఖర్చంతా నాదే!**
ఈ యువ క్రీడాకారుడి బ్యాటింగ్ విధ్వంసానికి ఐపీఎల్ వ్యవస్థాపకుడు, మాజీ చైర్మన్ లలిత్ మోడీ ముగ్ధుడయ్యారు. ఐపీఎల్ చరిత్రలోనే రాజస్థాన్ రాయల్స్ చేసిన అత్యుత్తమ కొనుగోలు ఇదేనని అభివర్ణించిన ఆయన.. సూర్యవంశీకి ఎవరూ ఊహించని బంపర్ ఆఫర్ ప్రకటించారు. ప్రపంచంలోని ఏ మూలన ఉన్నా, ఏ ప్రతిష్టాత్మక విశ్వవిద్యాలయంలోనైనా ఉన్నత విద్యనభ్యసించడానికి అవసరమయ్యే పూర్తి ఖర్చును స్కాలర్‌షిప్ రూపంలో తానె భరిస్తానని సోషల్ మీడియా వేదికగా భావోద్వేగభరితమైన పోస్ట్ చేశారు.
“ఈ రోజు సెంచరీకి నాలుగు పరుగుల దూరంలో ఆగిపోయి ఉండవచ్చు.. కానీ నా దృష్టిలో అతడు సాధించింది అంతకంటే గొప్పది. నిర్భయమైన యువ ప్రతిభ అంటే ఏమిటో దేశానికి చాటిచెప్పాడు. క్రీడలు కేవలం వినోదం కోసమే కాకుండా, అవకాశాలను సృష్టించాలని నమ్మే వ్యక్తిగా నేను ఈ నిర్ణయం తీసుకున్నాను. ప్రపంచంలో అతడు ఎక్కడ చదువుకోవాలనుకున్నా పూర్తి ఆర్థిక సహాయం అందిస్తాను. ఇది అతడు చేసిన పరుగుల కోసం కాదు.. లక్షలాది మంది యువతకు అందించిన ధైర్యం, స్ఫూర్తి కోసం ఇస్తున్న బహుమతి. ప్రతిభ ఉన్నవారు విద్యకు దూరం కాకూడదు. నా ఈ ఆఫర్ జీవితకాలం పాటు ఎప్పుడైనా అతడు వాడుకోవచ్చు” అంటూ మోడీ ప్రశంసల జల్లు కురిపించారు.
**కలల సీజన్ ‘ఐపీఎల్ 2026’**
వైభవ్ సూర్యవంశీకి ఐపీఎల్ 2026 సీజన్ నిజంగా ఒక అద్భుత కల లాంటిది. కేవలం 15 ఏళ్ల వయసులో ఈ కుర్రాడు సాధించిన గణంకాలు సీనియర్లను సైతం విస్మయానికి గురిచేస్తున్నాయి. ఈ సీజన్‌లో ఏకంగా 16 మ్యాచ్‌లు ఆడిన వైభవ్.. 48.50 సగటుతో, కనీవినీ ఎరుగని **237.31** స్ట్రైక్ రేట్‌తో మొత్తం **776 పరుగులు** రాబట్టాడు. ఇందులో ఒక సెంచరీతో పాటు ఐదు హాఫ్ సెంచరీలు ఉండటం విశేషం. ఐపీఎల్ యుగంలో పుట్టుకొచ్చిన అత్యుత్తమ క్రీడాకారుడిగా వైభవ్ చరిత్ర సృష్టిస్తున్నాడని విశ్లేషకులు కితాబిస్తున్నారు.