జూన్ 1 నుంచి సీఎం రేవంత్ రెడ్డి జిల్లాల పర్యటన.
* అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు.
* జూన్ 1న ఆదిలాబాద్‌లో రెండో విడత ‘ఇందిరమ్మ ఇళ్లకు’ శ్రీకారం.
* జూన్ 3న కోహెడలో అత్యాధునిక ఇంటిగ్రేటెడ్ మార్కెట్ నిర్మాణానికి భూమిపూజ.
* జూన్ 4న పాలమూరు పెండింగ్ ప్రాజెక్టులపై క్షేత్రస్థాయి సమీక్ష, సోమశిలలో బస.
* జూన్ 5న పరేడ్ గ్రౌండ్‌లో మహిళా సంఘాలకు 553 బస్సుల పంపిణీ.
హైదరాబాద్, మహా.
తెలంగాణ ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి వచ్చే నెల (జూన్) ఒకటో తేదీ నుంచి రాష్ట్రవ్యాప్తంగా విస్తృతంగా పర్యటించనున్నారు. పలు జిల్లాల్లో పర్యటించనున్న ఆయన.. ప్రభుత్వ ప్రతిష్టాత్మక పథకాలకు శ్రీకారం చుట్టడంతో పాటు, వివిధ భారీ అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్నారు. ఈ పర్యటనల్లో భాగంగా నిర్వహించే పలు బహిరంగ సభల్లోనూ సీఎం పాల్గొని ప్రసంగించనున్నారు.
**ఆదిలాబాద్ నుంచి ప్రస్థానం.. కోహెడలో మెగా మార్కెట్**
షెడ్యూల్ ప్రకారం జూన్ 1వ తేదీన సీఎం రేవంత్ రెడ్డి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో పర్యటిస్తారు. అక్కడ అధికారికంగా రెండో విడత ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ కార్యక్రమానికి ఆయన శ్రీకారం చుట్టనున్నారు. అనంతరం అక్కడ ఏర్పాటు చేసే భారీ బహిరంగ సభలో పాల్గొంటారు. ఆ తర్వాత జూన్ 3న రంగారెడ్డి జిల్లా కోహెడ గ్రామంలో సీఎం పర్యటన ఉంటుంది. అక్కడ తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా 239 ఎకరాల విస్తీర్ణంలో రూపుదిద్దనున్న అత్యాధునిక ‘ఇంటిగ్రేటెడ్ మార్కెట్’ నిర్మాణ పనులకు ఆయన శంకుస్థాపన చేయనున్నారు.
**పాలమూరు ప్రాజెక్టులపై సమీక్ష.. సోమశిలలో బస**
కోహెడ కార్యక్రమం ముగిసిన అనంతరం జూన్ 3వ తేదీ మధ్యాహ్నం సీఎం రేవంత్ రెడ్డి ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాకు చేరుకుంటారు. ఆ రోజు రాత్రికి ఆయన కృష్ణా నదీతీరంలోని సోమశిలలోనే బస చేయనున్నారు. మరుసటి రోజు (జూన్ 4న) ఉదయం నుంచి జిల్లాలోని కీలక నీటిపారుదల ప్రాజెక్టులపై క్షేత్రస్థాయి పరిశీలన చేయనున్నారు. జూరాల ప్రాజెక్టుతో పాటు అత్యంత ప్రాధాన్యత కలిగిన నారాయణపేట-కొడంగల్ ఎత్తిపోతల పథకం పనులను స్వయంగా పరిశీలిస్తారు. అలాగే నార్లాపూర్, వట్టేం, ఏదుల రిజర్వాయర్లను సందర్శించి, ఉమ్మడి జిల్లాలోని పెండింగ్ ప్రాజెక్టులను త్వరితగతిన పూర్తి చేయడంపై ఉన్నతాధికారులతో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించనున్నారు.
**మహిళా సంఘాలకు ఆర్ధిక చేయూత.. బస్సుల పంపిణీ**
పర్యటన ముగింపు రోజైన జూన్ 5వ తేదీన సికింద్రాబాద్ లోని పరేడ్ గ్రౌండ్స్‌లో నిర్వహించే భారీ మహిళా సదస్సుకు ముఖ్యమంత్రి ముఖ్యఅతిథిగా హాజరవుతారు. మహిళా స్వశక్తి సంఘాల ఆర్థిక పురోభివృద్ధి కోసం ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా కొనుగోలు చేసిన బస్సులను ఈ సందర్భంగా ఆయన పంపిణీ చేయనున్నారు. రూ.199 కోట్ల వ్యయంతో సేకరించిన మొత్తం 553 బస్సులను మహిళా సంఘాలకు అందజేస్తారు. ఈ బస్సులను మహిళా సంఘాల ద్వారానే తెలంగాణ ఆర్టీసీ కి అద్దెకు ఇచ్చి, తద్వారా వారు స్థిరమైన ఉపాధి, ఆదాయం పొందేలా రాష్ట్ర ప్రభుత్వం ఈ వినూత్న అవకాశాన్ని కల్పిస్తోంది. సీఎం జిల్లాల పర్యటనల నేపథ్యంలో ఆయా జిల్లాల యంత్రాంగాలు ముందస్తు ఏర్పాట్లలో నిమగ్నమయ్యాయి.








