అగ్నికి ఆహుతైన ప్రైవేట్ బస్సు.
* సమయస్ఫూర్తితో వ్యవహరించిన డ్రైవర్, క్లీనర్.
* అర్ధరాత్రి నిద్రమత్తులో భయాందోళనతో పరుగులు తీసిన 36 మంది ప్రయాణికులు.
* ప్రాణాలు దక్కాయి కానీ.. కళ్లెదుటే బూడిదైన లగేజీ.
* చిట్యాల మండలం పెద్దకాపర్తి వద్ద జాతీయ రహదారిపై ఘటన.
నల్గొండ,మహా.
జాతీయ రహదారిపై అర్ధరాత్రి పెను ప్రమాదం తృటిలో తప్పింది. హైదరాబాద్ నుంచి కాకినాడకు ప్రయాణికులతో వెళ్తున్న ఓ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులో అకస్మాత్తుగా మంటలు చెలరేగి పూర్తిగా కాలి బూడిదైంది. బస్సు సిబ్బంది సమయస్ఫూర్తి, అప్రమత్తతతో వ్యవహరించడంతో అందులో ప్రయాణిస్తున్న 36 మంది తృటిలో ప్రాణాలతో బయటపడటంతో పెను విషాదం తప్పింది. ఈ ఘటన నల్గొండ జిల్లా చిట్యాల మండలం పెద్దకాపర్తి గ్రామ సమీపంలో చోటుచేసుకుంది.
స్థానికులు, పోలీసుల వివరాల ప్రకారం.. హైదరాబాద్ నుంచి కాకినాడకు బయలుదేరిన ఈ స్లీపర్ బస్సు పెద్దకాపర్తి సమీపంలోకి రాగానే ఒక్కసారిగా ఇంజిన్ భాగం నుంచి దట్టమైన పొగలు రావడం మొదలయ్యాయి. ఏసీ క్యాబిన్ కావడంతో పొగ వేగంగా వ్యాపిస్తున్న క్రమంలో.. ప్రమాదాన్ని పసిగట్టిన డ్రైవర్, క్లీనర్ ఏమాత్రం ఆలస్యం చేయకుండా చాకచక్యంగా బస్సును రోడ్డు పక్కకు నిలిపివేశారు. అప్పటికే గాఢ నిద్రలో ఉన్న ప్రయాణికులను గట్టిగా కేకలు వేస్తూ అప్రమత్తం చేశారు. అందరినీ వెంటనే బస్సు దిగిపోవాలని హెచ్చరించారు.
సరిగ్గా నిద్రమత్తులో ఉన్న ప్రయాణికులు ఒక్కసారిగా పొగలు, మంటలను చూసి తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. ప్రాణభయంతో బస్సులో నుంచి కిందకు పరుగులు తీశారు. ప్రయాణికులంతా కిందకు దిగిన క్షణాల వ్యవధిలోనే మంటలు బస్సంతటా వేగంగా వ్యాపించాయి. కళ్లెదుటే బస్సు మొత్తం అగ్నికి ఆహుతవుతుండటంతో వారు వణికిపోయారు. అందరూ ప్రాణాలతో బయటపడినప్పటికీ.. లగేజ్ క్యాబిన్లో ఉంచిన విలువైన వస్తువులు, పత్రాలు, దుస్తులు పూర్తిగా అగ్నికి ఆహుతయ్యాయి. తమ కళ్లెదుటే సామగ్రి కాలిపోవడంతో పలువురు ప్రయాణికులు కన్నీరుమున్నీరయ్యారు.
ప్రమాద సమాచారం అందుకున్న వెంటనే స్థానిక పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేసే ప్రయత్నం చేశారు. అయితే అప్పటికే బస్సు పూర్తిగా కాలిపోయి ఇనుప అస్థిపంజరంలా మారిపోయింది. బ్యాటరీ లేదా ఇంజిన్ విభాగంలో తలెత్తిన షార్ట్ సర్క్యూట్ వల్లే ఈ ఘోర ప్రమాదం జరిగినట్లు అగ్నిమాపక అధికారులు, పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. జాతీయ రహదారిపై చోటుచేసుకున్న ఈ ఘటనతో అర్ధరాత్రి వేళ కొద్దిసేపు ట్రాఫిక్కు అంతరాయం ఏర్పడింది. సురక్షితంగా బయటపడిన ప్రయాణికులను వేరే వాహనాల్లో వారి గమ్యస్థానాలకు పంపించే ఏర్పాటు చేశారు. ఈ ప్రమాదంపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు లోతైన దర్యాప్తు జరుపుతున్నారు.








