ఓటరు జాబితా ప్రక్షాళన రాజ్యాంగబద్ధం.
* కాంగ్రెస్ ఆరోపణలు అర్థరహితం.
* ఎన్నికల సంఘం ప్రక్రియకు బీజేపీకి సంబంధం లేదు.
*ఓడిపోతే ఈవీఎంలు, ఎస్ఐఆర్పై నెపం మోపడం ప్రజాస్వామ్యానికి చేటు.
* రోహింగ్యాలు, చొరబాటుదారుల ఓట్ల తొలగింపునకు అన్ని పార్టీలూ సహకరించాలి.
* బిజెపి రాష్ట్ర అధ్యక్షులు ఎన్. రాంచందర్రావు.
హైదరాబాద్, మహా.
ఓటరు జాబితా సమగ్ర ప్రక్షాళన కోసం భారత ఎన్నికల సంఘం (ఈసీఐ) చేపట్టిన ఎస్ఐఆర్ (స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్) ప్రక్రియపై కాంగ్రెస్ పార్టీ ఉద్దేశపూర్వకంగా తప్పుడు ప్రచారం చేస్తోందని బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రాంచందర్రావు మండిపడ్డారు. ఈ ప్రక్రియకు కేంద్ర ప్రభుత్వానికి గానీ, భారతీయ జనతా పార్టీకి గానీ ఎలాంటి సంబంధం లేదని ఆయన స్పష్టం చేశారు. ఎస్ఐఆర్ అనేది చట్టబద్ధంగా, రాజ్యాంగబద్ధంగా ఈసీఐ ఆధ్వర్యంలో జరిగే ప్రక్రియ అని, దీనిని అడ్డుకోబోమని సాక్షాత్తూ సుప్రీంకోర్టు కూడా స్పష్టం చేసిన విషయాన్ని ఆయన గుర్తుచేశారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ కాంగ్రెస్, ఇతర పార్టీలు చేస్తున్న ఆరోపణలను తీవ్రంగా ఖండించారు.
గతంలోనూ పలుమార్లు ఈ తరహాలో ఓటరు జాబితా ప్రక్షాళన జరిగిందని, 2002లో జరిగిన సమగ్ర ప్రక్షాళన తర్వాత ప్రస్తుతం 2025-2026 సంవత్సరాల్లో వివిధ రాష్ట్రాల్లో ఈ ప్రక్రియను ఎన్నికల సంఘం చేపడుతోందని రాంచందర్రావు వివరించారు. ఇప్పటికే దేశవ్యాప్తంగా సుమారు 57 కోట్ల మంది ఓటర్ల వివరాల ప్రక్షాళన పూర్తయిందని, ప్రస్తుతం తెలంగాణ సహా వివిధ రాష్ట్రాల్లో మరో 37 కోట్ల మంది ఓటర్ల జాబితాను పరిశీలించే ప్రక్రియ కొనసాగుతోందని తెలిపారు. ఎన్నికల ప్రక్రియలో అన్ని రాజకీయ పార్టీలు బూత్ స్థాయి ప్రతినిధులను (బీఎల్ఏ) నియమించుకుంటాయని, ఓటరు జాబితాల పరిశీలనలో వారు కూడా ప్రత్యక్షంగా భాగస్వాములవుతారనే కనీస వాస్తవాన్ని విస్మరించి, ఈ ప్రక్రియ ఏకపక్షంగా జరుగుతోందంటూ కాంగ్రెస్ నేతలు విమర్శలు చేయడం విడ్డూరంగా ఉందన్నారు.
పశ్చిమ బెంగాల్లో బీజేపీ విజయాలకు ఎస్ఐఆర్ ప్రక్రియే కారణమంటూ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి చేసిన వ్యాఖ్యలను రాంచందర్రావు తప్పుబట్టారు. అదే ప్రాతిపదికన తీసుకుంటే ఇతర రాష్ట్రాల్లో వివిధ పార్టీలు సాధించిన విజయాలను సీఎం ఎలా సమర్థిస్తారని ప్రశ్నించారు. కేవలం రాజకీయ దురుద్దేశంతోనే కాంగ్రెస్ నేతలు ప్రజలను తప్పుదోవ పట్టించేలా ఇటువంటి వ్యాఖ్యలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. కాంగ్రెస్ పార్టీకి ఎన్నికల్లో ఓడిపోయినప్పుడల్లా ఈవీఎంలు, ఎన్నికల వ్యవస్థ లేదా ఎస్ఐఆర్ వంటి ప్రక్రియలపై నెపం మోపడం అలవాటుగా మారిందని, గెలిచినప్పుడు మాత్రం వాటి గురించి కనీసం మాట్లాడదని విమర్శించారు. ఇలాంటి బ్లేమ్ గేమ్ విధానం ప్రజాస్వామ్యానికి ఏమాత్రం మంచిది కాదని హితవు పలికారు. రాజ్యాంగబద్ధమైన ప్రక్రియ కాబట్టి ఎస్ఐఆర్ తప్పనిసరిగా జరిగి తీరుతుందని స్పష్టం చేశారు.
రాష్ట్రంలో కాంగ్రెస్, బీఆర్ఎస్, ఎంఐఎం పార్టీలు తమ రాజకీయ ప్రయోజనాల కోసం ఈ అంశాన్ని వాడుకోవడం మానుకోవాలని రాంచందర్రావు సూచించారు. అర్హులైన ప్రతి ఓటరు పేరు జాబితాలో ఉండేలా చూడటంతో పాటు, అనర్హుల ఏరివేతకు ఆయా పార్టీలు సహకరించాలని కోరారు. ముఖ్యంగా హైదరాబాద్ సహా రాష్ట్రవ్యాప్తంగా అక్రమంగా నివసిస్తున్న బంగ్లాదేశీయులు, రోహింగ్యాలు, విదేశీ చొరబాటుదారులు ఓటరు జాబితాల్లో చోటు దక్కించుకోకుండా అడ్డుకోవాల్సిన బాధ్యత అందరిపైనా ఉందన్నారు. ఇందుకు అన్ని రాజకీయ పార్టీలు, ప్రజలు అప్రమత్తంగా ఉండి ఓటరు జాబితా ప్రక్షాళనకు సహకరించాలని ఆయన పిలుపునిచ్చారు.








