నాగోల్‌లో ఘనంగా బీజేపీ ప్రశిక్షణ శిబిరం ప్రారంభం.
* కార్యకర్తలకు దిశానిర్దేశం చేసిన రాష్ట్ర నేతలు.
బండ్లగూడ (నాగోల్)మహా.
రంగారెడ్డి అర్బన్ జిల్లా భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో పండిట్ దీన్‌దయాళ్ ఉపాధ్యాయ ప్రశిక్షణ శిబిరం శనివారం ఘనంగా ప్రారంభమైంది. బండ్లగూడ నాగోల్‌లోని శ్రేయస్ ఇంజినీరింగ్ కళాశాల వేదికగా జిల్లా అధ్యక్షులు వనిపల్లి శ్రీనివాస్ రెడ్డి నేతృత్వంలో ఈ కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నారు. మే 30, 31 తేదీలలో రెండు రోజుల పాటు కొనసాగనున్న ఈ శిక్షణా తరగతుల్లో జిల్లా నలుమూలల నుంచి సుమారు 300 మంది ప్రతినిధులు, పార్టీ కార్యకర్తలు ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి తెలంగాణ రాష్ట్ర మహా సంఘటన మంత్రి చంద్రశేఖర్ తివారి ముఖ్య అతిథిగా హాజరై, శిబిరాన్ని లాంఛనంగా ప్రారంభించారు. తన ప్రారంభోపన్యాసంలో పార్టీ సిద్ధాంతాలు, ఆశయాలను క్షేత్రస్థాయిలోకి తీసుకెళ్లాల్సిన బాధ్యత కార్యకర్తలదేనని ఆయన దిశానిర్దేశం చేశారు.
**సైద్ధాంతిక వికాసం.. సంక్షేమ పథకాలపై అవగాహన..**
ఈ రెండు రోజుల శిక్షణా శిబిరంలో ప్రధానంగా బీజేపీ సైద్ధాంతిక పునాదులు, పార్టీ ఆవిర్భావ చరిత్ర, అంచెలంచెలుగా సాధించిన వికాసం తదితర అంశాలపై నాయకులు కార్యకర్తలకు సమగ్ర అవగాహన కల్పిస్తున్నారు. అలాగే ప్రస్తుతం దేశం ఎదుర్కొంటున్న సామాజిక, రాజకీయ సవాళ్లు, వాటిని సమర్థవంతంగా ఎదుర్కోవడంలో అనుసరించాల్సిన వ్యూహాలపై లోతుగా చర్చిస్తున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న విభిన్న సంక్షేమ పథకాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లడం, ప్రస్తుత డిజిటల్ యుగంలో సోషల్ మీడియా ప్రాముఖ్యత, దానిని పార్టీ బలోపేతానికి, ప్రభుత్వ కార్యక్రమాల ప్రచారానికి వినియోగించుకునే విధానాలపై ప్రత్యేక శిక్షణ అందిస్తున్నారు.
ఈ ప్రశిక్షణ శిబిరంలో బీజేపీ సహా సంఘటన మంత్రి శివ ప్రకాశ్ జీ, శిబిర ప్రముఖ్ గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎన్. గౌతమ్ రావు, పార్టీ సీనియర్ నాయకులు సామ రంగారెడ్డి, రవికుమార్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు. వీరితో పాటు రాష్ట్ర, జిల్లా స్థాయి పదాధికారులు, మాజీ కార్పొరేటర్లు, వివిధ డివిజన్ల కమిటీ సభ్యులు, పెద్ద ఎత్తున పార్టీ నాయకులు, కార్యకర్తలు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.








