Mahaa Daily Exclusive

  బెంగాల్‌లో పొలిటికల్ వార్…

Share

బెంగాల్‌లో పొలిటికల్ వార్.
* అభిషేక్ బెనర్జీ చుట్టూ బిగుస్తున్న ఉచ్చు.
* ఒకవైపు సీఐడీ విచారణ నోటీసులు.
* మరోవైపు ప్రాణాపాయం కలిగించేలా భౌతిక దాడులు.
కలకత్తా , మహా.
పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో కలకలం రేపుతున్న వరుస పరిణామాలు తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) అగ్రనేత, డైమండ్ హార్బర్ ఎంపీ అభిషేక్ బెనర్జీకి ముచ్చెమటలు పట్టిస్తున్నాయి. ఒకవైపు దర్యాప్తు సంస్థలు ఉచ్చు బిగిస్తుండగా, మరోవైపు ప్రతిపక్షాల నుంచి భౌతిక దాడులు ఎదురవుతుండటం రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర సంచలనంగా మారింది. తాజా పరిణామాలతో అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేలా పరిస్థితులు దిగజారాయి.
**ఎమ్మెల్యేల సంతకాల ఫోర్జరీ కేసులో సీఐడీ ఎంట్రీ**
ఇప్పటికే పలు కేసుల్లో ఆరోపణలు ఎదుర్కొంటున్న అభిషేక్ బెనర్జీకి, తాజాగా టీఎంసీ ఎమ్మెల్యేల సంతకాల ఫోర్జరీ కేసు రూపంలో మరో భారీ చిక్కు వచ్చిపడింది. అసెంబ్లీలో పార్టీ శాసనసభాపక్ష నేతగా సీనియర్ నేత సోవన్‌దేబ్ చటర్జీ ఎంపిక లేఖపై కొందరు ఎమ్మెల్యేల సంతకాలను వారి అనుమతి లేకుండానే ఫోర్జరీ చేశారనేది ప్రధాన ఆరోపణ. ఈ వ్యవహారంలో ఇప్పటికే టీఎంసీ ఎమ్మెల్యేలు కునాల్ ఘోష్, నయనా బందోపాధ్యాయలను విచారించిన బెంగాల్ సీఐడీ, తాజాగా అభిషేక్ బెనర్జీని విచారణకు పిలిచింది. శనివారం మధ్యాహ్నం ఆయన కార్యాలయం ‘శాంతినికేతన్’కు చేరుకున్న అధికారులు, ఆయన అక్కడ లేకపోవడంతో కాళీఘాట్‌లోని మరో కార్యాలయంలో నోటీసులు అందజేశారు. సోమవారం భవానీ భవన్‌లోని సీఐడీ కార్యాలయానికి విచారణకు రావాలని స్పష్టం చేశారు.
**నన్ను లొంగదీసుకోవాలంటే ఏడు జన్మలు ఎత్తాల్సిందే: అభిషేక్ ధ్వజం**
సీఐడీ నోటీసుల వ్యవహారంపై ఎంపీ అభిషేక్ బెనర్జీ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. కేంద్ర, రాష్ట్ర సంస్థలు తనపై ఉద్దేశపూర్వక కక్షసాధింపు చర్యలకు పాల్పడుతున్నాయని ఆరోపించారు. గతంలో కేవలం ఈడీ, సీబీఐ మాత్రమే ఉండేవని, ఇప్పుడు వాటితో పాటు బెంగాల్ పోలీసులు, కోల్‌కతా పోలీసులు, కోల్‌కతా మున్సిపల్ కార్పొరేషన్ (KMC) కూడా జతకలిశాయని ఆయన విమర్శించారు. తనపై ఐదారు దర్యాప్తు సంస్థలను ఉసిగొల్పి, బ్లాక్‌మెయిల్ చేసి భయపెట్టాలని చూస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తన గొంతు కోసినా సరే, తనను లొంగదీసుకోవాలంటే ఏడు జన్మలు ఎత్తాల్సిందేనని, తాను దేశద్రోహిని కాదని ఆయన తీవ్ర స్వరంతో హెచ్చరించారు. న్యాయవాదులతో చర్చించి తదుపరి చట్టపరమైన చర్యలు తీసుకుంటానని స్పష్టం చేశారు.
**సోనార్‌పూర్‌లో ఊహించని భౌతిక దాడి**
ఒకవైపు దర్యాప్తు సంస్థల ఉక్కిరిబిక్కిరి చేస్తుండగానే, మరోవైపు ఆయన ప్రాణాలకు ముప్పు వాటిల్లేలా దాడులు జరగడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. దక్షిణ 24 పరగణాల జిల్లా సోనార్‌పూర్‌లో ఎన్నికల అనంతరం జరిగిన హింసాకాండ బాధితులను పరామర్శించేందుకు వెళ్లిన ఆయన కాన్వాయ్‌పై కొందరు ఆందోళనకారులు, బీజేపీ శ్రేణులు రాళ్లు, గుడ్లతో దాడికి పాల్పడిన ఘటన రాష్ట్రవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టించింది. ఆందోళనకారులు ‘చోర్.. చోర్’ (దొంగ.. దొంగ) అంటూ నినాదాలు చేస్తూ ఆయనను ముట్టడించే ప్రయత్నం చేయడం, వ్యక్తిగత భద్రతా సిబ్బంది అతికష్టం మీద ఆయనను రక్షించి సురక్షిత ప్రాంతానికి తరలించడం బెంగాల్‌లో దిగజారుతున్న శాంతిభద్రతలకు నిదర్శనంగా నిలుస్తోంది.
**క్లైమాక్స్‌కు చేరుకుంటున్న పొలిటికల్ వార్**
ఈ వరుస పరిణామాలు చూస్తుంటే పశ్చిమ బెంగాల్‌లో రాజకీయ యుద్ధం తారాస్థాయికి చేరుకున్నట్లు స్పష్టమవుతోంది. సీఐడీ అధికారుల నోటీసులు, రోడ్లపై దాడులు, ప్రతిపక్షాల పోటాపోటీ నినాదాలతో బెంగాల్ వాతావరణం మరింత వేడెక్కింది. రానున్న రోజుల్లో ఈ రాజకీయ పరిణామాలు ఎలాంటి మలుపులు తీసుకుంటాయోనని సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.