మేము మీటర్లు పెడితే ఎన్నికల్లో పోటీ చేయం.
* పెట్టకపోతే మీరు తప్పుకుంటారా?
* బీఆర్ఎస్కు సీఎం రేవంత్ సూటి ప్రశ్న.
* రైతాంగానికి ఉచిత విద్యుత్‌పై ఎటువంటి అనుమానాలు వద్దు.
* మీడియాతో ఇష్టాగోష్టిలో సీఎం రేవంత్ రెడ్డి
హైదరాబాద్, మహా.
వ్యవసాయ మోటార్లకు మీటర్లు పెట్టినా, రైతులకు ఇస్తున్న ఉచిత విద్యుత్ సరఫరాను నిలిపివేసినా భవిష్యత్తులో తమ పార్టీ ఎన్నికల్లో పోటీ చేయబోదని
ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి సవాల్ విసిరారు. ఒకవేళ తమ ప్రభుత్వం మోటార్లకు మీటర్లు పెట్టకపోయినా, ఉచిత విద్యుత్‌ను నిరంతరాయంగా కొనసాగించినా బీఆర్ఎస్ పార్టీ ఎన్నికల బరి నుంచి తప్పుకుంటుందా అని ఆయన ప్రతిపక్షాన్ని సూటిగా ప్రశ్నించారు. శనివారం హైదరాబాద్‌లో మీడియాతో జరిగిన ఇష్టాగోష్టిలో ముఖ్యమంత్రి ఈ సంచలన వ్యాఖ్యలు చేశారు.
రాష్ట్రంలో వ్యవసాయ విద్యుత్ సరఫరా, కొత్తగా ప్రతిపాదించిన ‘రైతు డిస్కం’ ఏర్పాటు తదితర అంశాలపై ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీ చేస్తున్న విమర్శలపై ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి తీవ్ర స్థాయిలో స్పందించారు. రాష్ట్ర రాజకీయాలు, వ్యవసాయ రంగం, ప్రభుత్వ విధానాలపై సుదీర్ఘంగా చర్చించారు. ఈ సందర్భంగా వ్యవసాయ మోటార్లకు మీటర్ల అంశంపై బీఆర్ఎస్కు ఆయన ఒక బలమైన సవాల్ విసిరారు.
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించిన రైతు డిస్కంపై తెలంగాణ విద్యుత్ నియంత్రణ మండలి (ఈఆర్సీ) వద్ద జరిగిన ప్రజాభిప్రాయ సేకరణలో బీఆర్ఎస్ నేతలు చేసిన ఆరోపణలను ముఖ్యమంత్రి కొట్టిపారేశారు. రైతు డిస్కం ముసుగులో వ్యవసాయ మోటార్లకు మీటర్లు పెట్టేందుకు ప్రభుత్వం కుట్ర చేస్తోందని ప్రతిపక్షం చేస్తున్న విమర్శల్లో ఎలాంటి వాస్తవం లేదన్నారు. రైతులకు వ్యవసాయం కోసం 24 గంటల పాటు నాణ్యమైన ఉచిత విద్యుత్‌ను ఎటువంటి ఆటంకాలు లేకుండా అందించాలన్న ఏకైక లక్ష్యంతోనే దేశంలోనే తొలిసారిగా ఈ ప్రత్యేక డిస్కంను ఏర్పాటు చేస్తున్నట్లు ముఖ్యమంత్రి వివరించారు. దీని ద్వారా విద్యుత్ పంపిణీ వ్యవస్థలో జవాబుదారీతనం, పారదర్శకత పెరుగుతాయని ఆయన తెలిపారు. కేవలం రైతుల కోసమే ప్రత్యేకంగా ఒక వ్యవస్థ ఉంటే, విద్యుత్ కొనుగోళ్లలో ప్రభుత్వానికి మరింత వెసులుబాటు కలుగుతుందని, తక్కువ ధరకే విద్యుత్‌ను సమీకరించి రైతులకు నిరంతరాయంగా అందించే అవకాశం ఏర్పడుతుందని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.
రైతుల సమస్యలను అడ్డుపెట్టుకుని రాజకీయ ఉనికిని కాపాడుకునేందుకు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ప్రయత్నిస్తున్నారని ముఖ్యమంత్రి విమర్శించారు. రైతు డిస్కం ఏర్పాటుపై ఈఆర్సీ వద్ద ప్రాథమిక స్థాయిలో విచారణ జరుగుతున్న సమయంలోనే, ఆ సంస్థలో ఉద్యోగులు లేరని ప్రతిపక్ష నేతలు విమర్శించడం వారి అవగాహనా లోపానికి నిదర్శనమన్నారు. అసలు రైతు డిస్కం ఏర్పాటునే పూర్తిగా వ్యతిరేకిస్తున్న నాయకులు, దానికి సంబంధించిన పరిపాలనాపరమైన అంశాల గురించి మాట్లాడటం విడ్డూరంగా ఉందని ఎద్దేవా చేశారు. రైతాంగానికి ఉచిత విద్యుత్ అందించే విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందని, ఈ విధానంలో ఎట్టి పరిస్థితుల్లోనూ వెనక్కి తగ్గే ప్రసక్తే లేదని ముఖ్యమంత్రి రైతులకు భరోసా ఇచ్చారు.
ఈ మీడియా సమావేశంలో ముఖ్యమంత్రి వ్యవసాయ విద్యుత్ అంశంతో పాటు రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఇతర కీలక పథకాలపై కూడా మాట్లాడారు. రాష్ట్రంలో యాసంగి ధాన్యం కొనుగోలు ప్రక్రియ పారదర్శకంగా కొనసాగుతోందని, ప్రతి గింజనూ కొనుగోలు చేసి రైతులకు మద్దతు ధర దక్కేలా ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని స్పష్టం చేశారు. గత ప్రభుత్వం మిగిల్చిన ఆర్థిక లోటును అధిగమిస్తూనే, కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ఇచ్చిన హామీల అమలుకు నిధులు సమీకరిస్తున్నామని తెలిపారు. ముఖ్యంగా రైతాంగానికి ఇచ్చిన మాట ప్రకారం రుణమాఫీ ప్రక్రియను ఒక ప్రణాళికాబద్ధంగా పూర్తి చేసే దిశగా అడుగులు వేస్తున్నామని, వ్యవసాయాన్ని పండుగ చేయాలన్నదే తమ ప్రభుత్వ ప్రధాన ధ్యేయమని వివరించారు. ప్రతిపక్షాలు కేవలం రాజకీయ లబ్ధి కోసమే ప్రతి మంచి పనిపై బురదజల్లే ప్రయత్నం చేస్తున్నాయని, వాస్తవాలను గమనిస్తున్న ప్రజలు సరైన సమయంలో తగిన బుద్ధి చెబుతారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు.







