Mahaa Daily Exclusive

  సైబర్ నేరాల దర్యాప్తులో అవినీతి….

Share

సైబర్ నేరాల దర్యాప్తులో అవినీతి.
* రూ. 9 లక్షలు తీసుకుంటూ కటకటాల పాలైన ఇన్‌స్పెక్టర్.
* కేసు మాఫీ కోసం భారీ డిమాండ్.
* లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడిన సీఐ.
హైదరాబాద్, మహా.
సైబర్ నేరాలను అరికట్టి బాధితులకు న్యాయం చేయాల్సిన ఓ బాధ్యతాయుతమైన పోలీసు అధికారి అవినీతికి పాల్పడుతూ అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులకు చిక్కారు. ఓ కేసు విచారణలో భాగంగా బాధితుడికి అనుకూలంగా వ్యవహరించేందుకు ఏకంగా రూ. 9 లక్షల లంచం డిమాండ్ చేసి, ఆ మొత్తాన్ని తీసుకుంటుండగా తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో సీఐ మహేందర్‌ను ఏసీబీ అధికారులు పక్కా ప్లాన్‌తో రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకుని అరెస్ట్ చేశారు. ఈ సంఘటన పోలీసు వర్గాల్లో తీవ్ర కలకలం రేపింది.
వివరాల్లోకి వెళితే.. సైబర్ సెక్యూరిటీ బ్యూరోలో నమోదైన ఒక కేసుకు సంబంధించి నిందితుడికి అనుకూలంగా వ్యవహరించేందుకు, అలాగే ఫ్రీజ్ అయిన బ్యాంకు ఖాతాలను డీ-ఫ్రీజ్ చేసే ప్రక్రియలో సీఐ మహేందర్ భారీ మొత్తంలో లంచం డిమాండ్ చేసినట్లు ప్రాథమిక సమాచారం. సంబంధిత వ్యక్తిని బెదిరించి, తనకు రూ. 9 లక్షలు ఇస్తేనే కేసు నుంచి ఉపశమనం కల్పిస్తానని ఆయన తేల్చిచెప్పారు. అంత పెద్ద మొత్తంలో లంచం ఇచ్చుకోలేని సదరు బాధితుడు, సీఐ వేధింపులు భరించలేక నేరుగా ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. బాధితుడి ఫిర్యాదు మేరకు పూర్తి వివరాలు సేకరించి రంగంలోకి దిగిన ఏసీబీ అధికారులు పక్కా వ్యూహం రచించారు.
పథకం ప్రకారం బాధితుడికి రసాయనాలు పూసిన కరెన్సీ నోట్లను ఇచ్చి సీఐ మహేందర్ వద్దకు పంపించారు. ముందుగా కుదుర్చుకున్న ఒప్పందం మేరకు బాధితుడి వద్ద నుంచి రూ. 9 లక్షల నగదును సీఐ మహేందర్ తీసుకుంటుండగా.. అప్పటికే అక్కడ మాటువేసిన ఏసీబీ అధికారులు ఒక్కసారిగా దాడి చేసి ఆయన్ను పట్టుకున్నారు. వెంటనే ఆయన చేతులకు రసాయన పరీక్షలు (ఫినాల్ఫ్తలీన్ టెస్ట్) నిర్వహించగా, లంచం తీసుకున్నట్లు నిర్ధారణ అయింది. లంచంగా తీసుకున్న నగదును స్వాధీనం చేసుకున్న అధికారులు, మహేందర్‌ను అరెస్ట్ చేసి తదుపరి విచారణ చేపట్టారు.
అనంతరం సీఐ మహేందర్ కార్యాలయంతో పాటు ఆయన నివాసంలోనూ ఏసీబీ బృందాలు ఏకకాలంలో సోదాలు నిర్వహించాయి. ఈ సోదాల్లో కేసులకు సంబంధించిన పలు కీలక దస్త్రాలతో పాటు, ఇతర ఆస్తుల వివరాలను కూడా అధికారులు సేకరించినట్లు తెలుస్తోంది. సైబర్ నేరాల విచారణ పేరిట ఆయన ఇంకా ఎవరి వద్దనైనా ఇలాగే వసూళ్లకు పాల్పడ్డారా, ఈ అవినీతిలో ఇంకెవరి పాత్ర అయినా ఉందా అనే కోణంలోనూ ఏసీబీ అధికారులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. పట్టుబడిన సీఐ మహేందర్‌పై అవినీతి నిరోధక చట్టం కింద కేసు నమోదు చేసి, నాంపల్లిలోని ఏసీబీ ప్రత్యేక న్యాయస్థానంలో హాజరుపరిచేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. రక్షక భటులే ఇలా భక్షకులుగా మారి అందినకాడికి దండుకుంటుండటం పట్ల సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.