Mahaa Daily Exclusive

  పోలీసుల ఎన్‌కౌంటర్‌లో బాలుడి హత్య కేసు ప్రధాన నిందితుడు హతం….

Share

గాజియాబాద్ (ఉత్తరప్రదేశ్):మహా.

ఉత్తరప్రదేశ్‌లో తీవ్ర సంచలనం సృష్టించిన 17 ఏళ్ల బాలుడు సూర్య ప్రతాప్ చౌహాన్ దారుణ హత్య కేసులో ప్రధాన నిందితుడిని పోలీసులు ఎన్‌కౌంటర్‌లో మట్టుబెట్టారు. గాజియాబాద్‌లోని ఖోడా కాలనీ పరిధిలో ఆదివారం వేకువజామున జరిగిన ఎదురుకాల్పుల్లో రూ. 50 వేల రివార్డు ఉన్న నిందితుడు అసద్ (17) హతమయ్యాడు. తనిఖీలు చేస్తున్న పోలీసులపైకి కాల్పులకు తెగబడటంతో ఆత్మరక్షణ కోసం పోలీసులు జరిపిన కాల్పుల్లో అతడు ప్రాణాలు విడిచాడు. బక్రీద్ రోజున తోటి మిత్రుడిని అత్యంత కిరాతకంగా కత్తితో పొడిచి చంపిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర ప్రకంపనలు సృష్టించగా, నిందితుడి ఎన్‌కౌంటర్‌తో బాధితుడి కుటుంబానికి కొంత ఊరట లభించినట్లయింది.
**హత్య ఎలా జరిగిందంటే..**
ఖోడా కాలనీలోని నవనీత్ విహార్‌కు చెందిన 11వ తరగతి విద్యార్థి సూర్య ప్రతాప్ చౌహాన్ (17), నిందితుడు అసద్ ఇద్దరూ స్నేహితులు. గత గురువారం (మే 28న) బక్రీద్ పండుగ సందర్భంగా సూర్య ప్రతాప్‌ను అసద్ తన ఇంటి సమీపానికి పిలిపించాడు. ఇద్దరి మధ్య బైక్ నడపడం తదితర అంశాలపై కొంతకాలంగా ఉన్న పాత వివాదాల నేపథ్యంలో వాగ్వాదం జరిగింది. ఈ క్రమంలో “మేకను కోయడం ఎప్పుడైనా చూశావా? రా చూపిస్తా” అంటూ సూర్యపై అసద్ కవ్వింపులకు దిగాడు. అక్కడి నుంచి వెళ్లేందుకు సూర్య ప్రయత్నించగా, అసద్ తన తండ్రి నవాబ్, ఇతర స్నేహితుల ప్రోద్బలంతో సూర్య కడుపులో కత్తితో విచక్షణారహితంగా పొడిచాడు. తీవ్ర రక్తస్రావంతో మే 29న నోయిడాలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ సూర్య మృతి చెందాడు. ఈ ఘటనపై హిందూ సంఘాలు, స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేయడంతో రంగంలోకి దిగిన పోలీసులు అసద్ తండ్రి నవాబ్ సహా ముగ్గురిని శనివారం అరెస్టు చేశారు. పరారీలో ఉన్న అసద్‌పై రూ. 50 వేల రివార్డు ప్రకటించారు.
**ఎన్‌కౌంటర్ ఎక్కడ, ఎప్పుడు జరిగిందంటే..**
పరారీలో ఉన్న అసద్ ఆదివారం తన స్నేహితులతో కలిసి కొంత డబ్బు తీసుకుని రాష్ట్రం విడిచి పారిపోయేందుకు ఖోడా ప్రాంతానికి వస్తున్నట్లు పోలీసులకు పక్కా సమాచారం అందింది. దీంతో ఖోడా, ఇందిరాపురం పోలీసులు అప్రమత్తమై వసుంధర టీ-పాయింట్ వద్ద ముమ్మరంగా వాహన తనిఖీలు చేపట్టారు. ఓ బైక్‌పై ఇద్దరు అనుమానితులు రావడాన్ని గమనించి ఆపే ప్రయత్నం చేశారు. అయితే, వారు బైక్‌ను వసుంధర సెక్టార్ 1 లోని ఓ ఖాళీ మైదానం వైపు వేగంగా పోనిచ్చారు. పోలీసులు వారిని వెంబడించగా, బైక్ అదుపుతప్పి కిందపడిన నిందితులు.. తప్పించుకునేందుకు పోలీసులపైకి నేరుగా కాల్పులు ప్రారంభించారు. ఈ క్రమంలో అనురాగ్ రావత్ అనే కానిస్టేబుల్ బుల్లెట్ గాయానికి గురయ్యారు. దీంతో అప్రమత్తమైన పోలీసులు ఆత్మరక్షణ కోసం జరిపిన ఎదురుకాల్పుల్లో ప్రధాన నిందితుడు అసద్‌కు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే అతడిని ఆస్పత్రికి తరలించగా, అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. చీకటిని ఆసరా చేసుకుని తప్పించుకున్న మరో నిందితుడి కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.
ఈ ఎన్‌కౌంటర్ తర్వాత సూర్య ప్రతాప్ తల్లి సరోజ్ దేవి కన్నీటిపర్యంతమయ్యారు. తన కుమారుడిని కిరాతకంగా చంపిన నిందితులందరి ఇళ్లపైకి బుల్డోజర్లు పంపాలని, అసద్ మృతదేహాన్ని తాను స్వయంగా చూస్తే కానీ తనకు శాంతి కలగదని ఆమె విలపించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు తదుపరి దర్యాప్తును ముమ్మరంగా కొనసాగిస్తున్నారు.