నన్ను అడ్డుకోవడానికి మీరెవరు.
* తెలంగాణ మీ అయ్య జాగీరా?.
* పార్టీ పుట్టిందే తెలంగాణ నడిబొడ్డున.
* రాబోయే ఎన్నికల్లో పోటీ పక్కా.
• విభజన తీరుకే మా వ్యతిరేకత..
• పన్నెండేళ్లుగా ఇక్కడి నేతలను పల్లెత్తి మాట అనలేదు.
• * ఏపీలోనే బెదిరింపులు ఎక్కువ..
• దాడులు చేసేవాళ్లు నా ఇంటికే రావచ్చు.
• జనసేననీ పవన్ కల్యాణ్ ఫైర్.
హైదరాబాద్, మహా.
**నన్ను అడ్డుకోవడానికి మీరెవరు? తెలంగాణ ఏమైనా మీ అయ్య జాగీరా? దాడులకు భయపడే బానిస బతుకు నాది కాదు..” అంటూ జనసేన అధినేత, ఏపీ ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ఉగ్రరూపం దాల్చారు. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం నాడు సభ నిర్వహణకు పోలీసుల నుంచి, అటు కోర్టు నుంచి అనుమతి లభించకపోవడంతో జూబ్లీహిల్స్‌లోని తన నివాసం వేదికగా ఆయన విమర్శకులపై నిప్పులు చెరిగారు. జనసేన పార్టీ పుట్టిందే తెలంగాణ నడిబొడ్డున అని కుండబద్దలు కొట్టిన పవన్.. రాబోయే ఎన్నికల్లో రాష్ట్రంలో కచ్చితంగా పోటీ చేస్తామని, పార్టీని క్షేత్రస్థాయిలోకి తీసుకెళ్లేందుకు త్వరలోనే తాను స్వయంగా ఊరూరా పర్యటిస్తానని సంచలన ప్రకటన చేసి తెలంగాణ రాజకీయాల్లో ఒక్కసారిగా పెను ప్రకంపనలు సృష్టించారు**
తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ‘తెలంగాణ నవనిర్మాణ సభ’ నిర్వహణకు పోలీసులు అనుమతి నిరాకరించడం, హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్‌ను రిజిస్ట్రీ స్క్రూటినీ దశలోనే తిరస్కరించిన పరిణామాల నేపథ్యంలో జనసేన అధినేత, ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. సభ రద్దు కావడంతో మంగళవారం జూబ్లీహిల్స్‌లోని తన నివాసం నుంచి ఆయన మీడియాతో మాట్లాడారు. పదమూడవ వసంతంలోకి అడుగుపెడుతున్న తెలంగాణ ప్రజలకు, లక్షలాది మంది జనసైనికులకు ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపిన ఆయన.. తన విమర్శకులపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. తనపై వస్తున్న విమర్శలు, బెదిరింపులు, తెలంగాణతో తనకున్న అనుబంధం, భవిష్యత్ రాజకీయ కార్యాచరణపై తన అభిప్రాయాలను కుండబద్దలు కొట్టారు.
**నన్ను బెదిరించడానికి మీరెవరు?**
హైదరాబాద్‌లో ఎలా అడుగుపెడతావంటూ కొందరు చేస్తున్న వ్యాఖ్యలపై పవన్ కల్యాణ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. నన్ను బెదిరించడానికి మీరెవరు, తెలంగాణ మీ అయ్య జాగీరా అని సూటిగా ప్రశ్నించారు. తెలంగాణ రాష్ట్రం భారతదేశంలో ఒక అంతర్భాగమని, ఇక్కడికి ఎవరైనా రావొచ్చని స్పష్టం చేశారు. బాంచన్ కాల్మొక్తా అనే ఉద్దేశం ఉంటే తాను అసలు రాజకీయ పార్టీ ఎందుకు పెడతానని, భయపడే వాడిని అయితే పార్టీ ఎందుకు నడుపుతానని నిలదీశారు. తెలంగాణలో కంటే ఆంధ్రప్రదేశ్‌లోనే తనకు బెదిరింపులు ఎక్కువని, కోనసీమలో తన తల తీసేయాలని అంటుంటారని వ్యాఖ్యానించారు. తన ఇంటి ముందు ప్రెస్ మీట్ పెట్టడానికి కారణం కూడా అదేనని, ఎవరైనా దాడి చేయాలనుకుంటే సంతోషంగా తన ఇంటికే రావొచ్చని బహిరంగ సవాల్ విసిరారు. గత వైసీపీ ప్రభుత్వం తనను ఆంధ్రాలో అడుగుపెట్టనివ్వని క్లిష్ట పరిస్థితుల్లో.. తెలంగాణ జనసైనికులే తనకు అండగా నిలిచారని, వారాహి యాత్రకు అనుమతి ఇచ్చింది కూడా తెలంగాణ ప్రభుత్వమేనని ఆయన గుర్తుచేశారు.
**కొత్తగా వచ్చిన ప్రేమ కాదు.. పార్టీ పుట్టిందే ఇక్కడ**
తెలంగాణపై తనకున్న ప్రేమ రాజకీయాలకు అతీతమైనదని, అది ఈరోజు కొత్తగా తెచ్చుకున్న ప్రేమ కాదని పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు. రాష్ట్ర విభజన సమయంలో పుట్టుకొచ్చింది అంతకంటే కాదన్నారు. జనసేన పార్టీ పుట్టిందే తెలంగాణ నడిబొడ్డున అని ఆయన గుర్తుచేశారు. 2007-08 అప్పటి యువరాజ్యం కాలం నుంచి ఉన్న నాయకులే ఇప్పుడు తన చుట్టూ ఉన్నారని తెలిపారు. తాను తెలంగాణ నలుమూలలా తిరిగానని, ఒకప్పుడు ఓట్లు పడతాయో లేదో తెలియని నక్సల్స్ ప్రభావిత ప్రాంతాలతో పాటు ఆదిలాబాద్ గోండు తండాల్లో పర్యటించి వారి దాహార్తి తీర్చిన వాడినని వెల్లడించారు. ఇప్పుడు తనను వద్దంటున్న నాయకులు ఏనాడైనా ఆయా ప్రాంతాల్లో తిరిగారా అని ప్రశ్నించారు. గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో అన్ని కార్పొరేషన్లలో జనసేన జెండా ఎగురవేశామని ఆయన గుర్తుచేశారు.
**విభజన తీరుకే వ్యతిరేకం.. సీఎం రేవంత్ అంటే ఇష్టం**
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు జనసేన ఎప్పుడూ వ్యతిరేకం కాదని, ఈ విషయాన్ని స్పష్టంగా తెలియజేస్తున్నానని పవన్ కల్యాణ్ ప్రకటించారు. నాడు పార్లమెంట్ తలుపులు మూసి రాష్ట్రాన్ని విభజించిన తీరును మాత్రమే తాను వ్యతిరేకించానని వివరించారు. సామాజిక తెలంగాణలో అన్ని కులాలు బాగుండాలన్నదే తన ఆకాంక్ష అని తెలిపారు. రాష్ట్రం ఏర్పడిన గడచిన పన్నెండేళ్ల కాలంలో తెలంగాణ నాయకులను తాను ఒక్క మాట కూడా అనలేదని, కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా ఎవరినీ పల్లెత్తి మాట అనలేదని స్పష్టం చేశారు. తనకు రెచ్చగొట్టడం ఇష్టం లేదని, ఎన్ని తిట్టినా పట్టించుకోనని తెలిపారు. ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అంటే తనకు ఇష్టమని, తాను చెరువు భూమి కబ్జా చేసినట్లు తేలితే ఆ భూమిని ప్రభుత్వానికే రాసిచ్చేస్తానని ఆయన వ్యాఖ్యానించారు.
**పోటీ కచ్చితం.. ప్రతి ఊరూ తిరుగుతా**
రాబోయే ఎన్నికల్లో జనసేన పార్టీ తెలంగాణలో కచ్చితంగా పోటీ చేస్తుందని పవన్ కల్యాణ్ అత్యంత కీలక ప్రకటన చేశారు. కేవలం పోటీ చేయడమే కాకుండా, పార్టీని బలోపేతం చేయడానికి తాను స్వయంగా తెలంగాణలోని ప్రతి ఊరూ తిరుగుతానని స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్‌లోనే తాను అధికారం కోరుకోలేదని, ఇక తెలంగాణలో ఎలా కోరుకుంటానని అన్నారు. ఇక్కడ జనసేనకు కేవలం ఒక మార్పు మాత్రమే కావాలని, యువతకు మంచి అవకాశాలు రావాలని కోరుకుంటున్నాను తప్ప తనకు కొత్తగా దక్కేది ఏమీ లేదన్నారు. కార్యకర్తలు సమస్యల మీద పోరాడాలని తాను పిలుపునిస్తే, ఆంధ్రా వాళ్లు ఇక్కడకు ఎందుకు వచ్చారని అంటున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ ఏర్పాటును వ్యతిరేకించిన వారు ఇక్కడే పెద్ద పదవులు అనుభవిస్తుంటే, తెలంగాణ అంటే ప్రేమ ఉన్న జనసేన ఇక్కడ ఎందుకు ఉండకూడదని ప్రశ్నించారు. పార్టీ స్థాపించి 13 ఏళ్లు గడుస్తున్నా ఇంకా నోరు మూసుకుని కూర్చోవాలా అని ఆయన అసహనం వ్యక్తం చేశారు.
**ఉపాధికి నేను కారణమా?**
తెలంగాణలో ఉపాధి లేకపోవడానికి తాను ఏమైనా కారణమా అని ప్రశ్నించిన పవన్ కల్యాణ్, ఒకప్పుడు మద్రాసులో ఉన్న చిత్ర పరిశ్రమ హైదరాబాద్‌కు ఎలా వచ్చిందో గుర్తుచేసుకోవాలన్నారు. ఆంధ్రా వాళ్లను పదే పదే తిడితే వారు ఇక్కడ ఎలా ఉండగలరని, దేశవ్యాప్తంగా స్థిరపడిన తెలుగువారిని అక్కడి నుంచి వెళ్లిపోమనడం కరెక్టేనా అని ఆయన ప్రశ్నించారు. తెలంగాణ ప్రజలకు, నాయకులకు ఆంధ్రప్రదేశ్‌పై ఎలాంటి విద్వేషం లేదని, అలా ఉండి ఉంటే ఆ రాష్ట్ర ప్రజలు ఇక్కడ తిరిగేవారు కాదని అన్నారు. ఒక రాజకీయ విశ్లేషకుడు తన గురించి తప్పుగా మాట్లాడటం వల్లే ఈ వివాదం మొదలైందని, సైనికులు స్పందించిన చోట నమోదైన కేసుల్లో తన ప్రమేయం ఏమీ లేదని పవన్ కల్యాణ్ ఈ సందర్భంగా స్పష్టం చేశారు.








