రూ.1500 కోట్ల ప్రభుత్వ భూమి కబ్జా కుట్ర.
* వైసీపీ మాజీ ఎమ్మెల్యేకు 14 రోజుల రిమాండ్.
హైదరాబాద్, మహా.
గండిపేట ప్రభుత్వ భూమి కబ్జా కేసులో ప్రధాన నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆంధ్రప్రదేశ్లోని వినుకొండ వైసీపీ మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడికి ఉప్పరపల్లి కోర్టు 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ విధించింది. హైదరాబాద్ శివార్లలోని అత్యంత ఖరీదైన గండిపేట పరిధిలో వెలుగుచూసిన దాదాపు రూ.1500 కోట్ల భారీ భూ కుంభకోణంలో ఆయనను సైబరాబాద్ పోలీసులు తమిళనాడులోని కాంచీపురంలో అరెస్ట్ చేశారు. పక్కా సమాచారంతో నార్సింగి, ఆర్థిక నేరాల విభాగం (ఈవోడబ్ల్యూ) పోలీసులు సంయుక్తంగా ఆపరేషన్ నిర్వహించి శుక్రవారం ఆయనను అదుపులోకి తీసుకున్నారు. శనివారం రోడ్డు మార్గం ద్వారా ఆయనను హైదరాబాద్కు తరలించి, న్యాయమూర్తి ఎదుట హాజరుపరచగా.. జూన్ 20వ తేదీ వరకు చంచల్గూడ కేంద్ర కారాగారంలో రిమాండ్కు ఆదేశించారు.
రంగారెడ్డి జిల్లా గండిపేట సర్వే నంబర్ 18లో ఉన్న సుమారు 10 ఎకరాల ప్రభుత్వ భూమిని కాజేసేందుకు బ్రహ్మనాయుడు మరికొందరితో కలిసి భారీ కుట్ర పన్నారు. ఈ భూమి తమదేనంటూ గండిపేటకు చెందిన నిమ్మల కుటుంబ సభ్యులు గతంలో కోర్టును ఆశ్రయించగా, అది ప్రభుత్వ పోరంబోకు భూమేనని 2025 అక్టోబర్లో హైకోర్టు స్పష్టం చేసింది. కోర్టు తీర్పు ప్రభుత్వానికి అనుకూలంగా వచ్చినప్పటికీ, ఆ భూమిని ఎలాగైనా సొంతం చేసుకోవాలనే దురుద్దేశంతో నిమ్మల కుటుంబం బ్రహ్మనాయుడుతో ఒప్పందం కుదుర్చుకుంది. ఏకంగా ప్రభుత్వం తమకే ఆ భూమిని కేటాయించినట్లు ఐదు నకిలీ జీవోలు, తప్పుడు రెవెన్యూ రికార్డులను సృష్టించారు. ఈ భారీ కుంభకోణానికి సంబంధించి రూ.12 కోట్ల మేర ఆర్థిక లావాదేవీలు జరిగినట్లు దర్యాప్తులో తేలింది. ఇందులో నిమ్మల కుటుంబ సభ్యులకు రూ.4 కోట్లు, మధ్యవర్తిగా వ్యవహరించిన రాధాకృష్ణకు రూ.4 కోట్లు, ఇతర వ్యక్తులకు మరో రూ.4 కోట్లు చేతులు మారినట్లు పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది.
ఈ నకిలీ పత్రాల వ్యవహారంపై రెవెన్యూ అధికారుల ఫిర్యాదుతో నార్సింగి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు వేగవంతం చేశారు. విషయం తెలిసిన వెంటనే ముందస్తు బెయిల్ కోసం బ్రహ్మనాయుడు హైకోర్టును ఆశ్రయించినప్పటికీ, ప్రాథమిక ఆధారాలను పరిగణనలోకి తీసుకున్న న్యాయస్థానం ఆ పిటిషన్ను కొట్టివేసింది. దీంతో అరెస్టు నుంచి తప్పించుకునేందుకు ఆయన బెంగళూరు, కేరళ మీదుగా తమిళనాడుకు పారిపోయి తలదాచుకున్నారు. తమిళనాడులో అరెస్టు అనంతరం ఆయనను నార్సింగి పోలీస్ స్టేషన్కు తరలించగా, పెద్ద సంఖ్యలో వైసీపీ కార్యకర్తలు, అనుచరులు అక్కడికి చేరుకుని లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించడంతో కాసేపు తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఈ హై ప్రొఫైల్ కబ్జా కేసులో పోలీసులు ఇప్పటివరకు బ్రహ్మనాయుడితో కలిపి మొత్తం ఆరుగురిని అరెస్ట్ చేశారు.








