Mahaa Daily Exclusive

  ‘వియ్ ది లీడర్స్’ పేరిట సరికొత్త రాజకీయ ఉద్యమం…

Share

‘వియ్ ది లీడర్స్’ పేరిట సరికొత్త రాజకీయ ఉద్యమం.
* పది గంటల్లోనే పది లక్షల మంది నమోదు.
* అన్నామలై ఉద్యమానికి అనూహ్య స్పందన.
* కమలం పార్టీలో ప్రకంపనలు..
* రాష్ట్ర ఉపాధ్యక్షుడు సహా పలువురు నేతల రాజీనామా.
* అబ్దుల్ కలాం స్ఫూర్తితో ముందుకెళ్తాం.
* వ్యక్తిపూజ రాజకీయాలకు స్వస్తి పలికిన నేత.
చెన్నై, మహా.
తమిళనాడు రాజకీయాల్లో పెను సంచలనం చోటుచేసుకుంది. రాష్ట్ర భారతీయ జనతా పార్టీ మాజీ అధ్యక్షుడు, మాజీ ఐపీఎస్ అధికారి కె. అన్నామలై కమలం పార్టీకి అధికారికంగా రాజీనామా చేశారు. ఆయన తన భవిష్యత్ కార్యాచరణను ప్రకటిస్తూ ‘వియ్ ది లీడర్స్’ పేరిట సరికొత్త రాజకీయ ఉద్యమానికి శ్రీకారం చుట్టారు. జూన్ 2వ తేదీన ఆయన తన రాజీనామా లేఖను సమర్పించగా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబిన్ జూన్ 5న లాంఛనంగా ఆమోదించారు. కొత్త రాజకీయ ప్రయాణానికి సిద్ధమైన అన్నామలైకి చెన్నై విమానాశ్రయంలో మద్దతుదారులు, అనుచరులు ఘన స్వాగతం పలికారు. ఈ పరిణామంతో అటు జాతీయ రాజకీయాల్లో, ఇటు రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర చర్చ మొదలైంది.
రాష్ట్ర రాజకీయాల భవిష్యత్ వ్యూహాలపై గత కొంతకాలంగా పార్టీ అధిష్ఠానంతో అన్నామలైకి భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. పార్టీ జాతీయ నాయకత్వాన్ని తన నిర్ణయాలతో ఇబ్బంది పెట్టడం ఇష్టం లేకనే తాను తప్పుకుంటున్నట్లు రాజీనామా లేఖలో అన్నామలై స్పష్టం చేశారు. రాజీనామాకు ముందు ఆయన కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా, పార్టీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబిన్, జాతీయ ప్రధాన కార్యదర్శి బి.ఎల్. సంతోష్‌లతో ప్రత్యేకంగా సమావేశమై తన నిర్ణయాన్ని తేల్చిచెప్పారు. ఒకప్పుడు ఒంటరిగా పోరాడి పార్టీకి పది శాతానికి పైగా ఓటు బ్యాంకును సాధించిపెట్టిన అన్నామలై నిష్క్రమణ రాష్ట్రంలో పార్టీకి గట్టి ఎదురుదెబ్బే అయినప్పటికీ, ప్రస్తుత బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు నైనార్ నాగేంద్రన్ మాత్రం ఈ వాదనను తోసిపుచ్చారు. ఆయన రాజీనామా వల్ల పార్టీకి ఎటువంటి నష్టం వాటిల్లదని నాగేంద్రన్ వ్యాఖ్యానించారు. మాజీ ఐపీఎస్ అధికారి అయిన అన్నామలై 2020లో సివిల్ సర్వీసెస్‌కు రాజీనామా చేసి బీజేపీలో చేరారు. 2021లో అరవకురిచ్చి నుంచి, 2024 లోక్‌సభ ఎన్నికల్లో కోయంబత్తూరు నుంచి పోటీ చేసి ఓటమి పాలైన ఆయన, ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉన్నారు.
అన్నామలై స్థాపించిన ‘వియ్ ది లీడర్స్’ ఉద్యమానికి ప్రజల నుంచి, ముఖ్యంగా యువత నుంచి అనూహ్య స్పందన లభిస్తోంది. ఈ ఉద్యమాన్ని ప్రకటించిన కేవలం పది గంటల వ్యవధిలోనే పది లక్షల మందికి పైగా వాలంటీర్లు ఆన్‌లైన్ పోర్టల్ ద్వారా ఇందులో నమోదు చేసుకోవడం విశేషం. ప్రారంభించిన కొద్ది గంటల్లోనే ఎనిమిదిన్నర లక్షల మంది వాలంటీర్లతో పాటు యాభైకి పైగా క్షేత్రస్థాయి నాయకులు ఇందులో భాగస్వాములయ్యారు. విద్య, ఆరోగ్యం, యువ నాయకత్వం, సుస్థిర అభివృద్ధి తదితర సామాజిక అంశాలపై ఆసక్తి ఉన్నవారు తమతో కలిసి రావాలని ఆయన పిలుపునిచ్చారు. ఆధునిక టెక్నాలజీ ఆధారిత పరిపాలన, క్షేత్రస్థాయి ప్రజల భాగస్వామ్యంతో కూడిన ‘కాన్షియస్ కాన్స్టిట్యుయెన్సీ అప్రోచ్’ అనే వినూత్న విధానంతో ఈ ఉద్యమం పనిచేస్తుందని ఆయన ప్రకటించారు. మాజీ రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్ కలాం ఆశయాలు, స్ఫూర్తితో ఈ ఉద్యమాన్ని నిర్మిస్తున్నట్లు అన్నామలై వెల్లడించారు. కోయంబత్తూరులోని అబ్దుల్ కలాం సెంటర్ ఫర్ ఎథిక్స్ అండ్ పాలిటిక్స్ సంస్థ కూడా ఈ ఉద్యమంలో అంతర్భాగంగా పనిచేస్తుందని ఆయన స్పష్టం చేశారు. అయితే, తాము ఏ రాజకీయ పార్టీకి పోటీ కాదని, అధికార, ప్రతిపక్ష పార్టీలు తమ విధానాలతో ముందుకు వెళ్తాయని, తాము తమ సిద్ధాంతాలను ప్రజల ముందుకు తీసుకెళ్తామని అన్నామలై స్పష్టం చేశారు.
అన్నామలై నిర్ణయం తమిళనాడు బీజేపీలో ప్రకంపనలు సృష్టిస్తోంది. ఆయనకు మద్దతుగా పలువురు కీలక నేతలు కమలం పార్టీని వీడుతున్నారు. రాష్ట్ర ఉపాధ్యక్షుడు కరు నాగరాజన్ తన పదవికి, పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేసి అన్నామలై వెంటే నడుస్తానని ప్రకటించారు. ఆయనతో పాటు రాష్ట్ర కార్యదర్శి సుమతి వెంకటేష్, యువమోర్చా లీగల్ కన్వీనర్ అభిలాష్ గోపీనాథ్ సహా పలువురు ముఖ్య నాయకులు కూడా కమలం పార్టీకి రాజీనామా చేశారు. వ్యక్తిపూజ రాజకీయాలకు దూరంగా ఉంటూ, ప్రతి ఒక్కరినీ నాయకులుగా తీర్చిదిద్దే లక్ష్యంతో అన్నామలై ప్రారంభించిన ఈ ఉద్యమం భవిష్యత్తులో తమిళనాడు రాజకీయ ముఖచిత్రాన్ని ఏ విధంగా మార్చబోతోందన్న ఉత్కంఠ సర్వత్రా నెలకొంది.