జంతర్ మంతర్లో ‘బొద్దింకల’ ఆందోళన.
* నీట్, సీబీఎస్ఈ అవకతవకలపై భగ్గుమన్న కాక్రోచ్ జనతా పార్టీ.
* కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాకు డిమాండ్.
ఢిల్లీ, మహా.
దేశవ్యాప్త విద్యా వ్యవస్థలో నెలకొన్న లోపాలు, నీట్-యూజీ పేపర్ లీక్ వంటి వరుస వివాదాలపై యువత గళమెత్తింది. సోషల్ మీడియా వేదికగా అనతికాలంలోనే సంచలనం సృష్టించిన ‘కాక్రోచ్ జనతా పార్టీ’ (సీజేపీ) తొలిసారిగా ప్రత్యక్ష ఆందోళనకు దిగింది. శనివారం దిల్లీలోని జంతర్ మంతర్ వద్ద భారీ నిరసన కార్యక్రమం చేపట్టింది. ఈ సందర్భంగా కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తక్షణమే తన పదవికి రాజీనామా చేయాలని ఆ పార్టీ వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కే డిమాండ్ చేశారు. “బొద్దింకలు రోడ్డెక్కలేవన్న వారికి సమాధానంగానే మేము ఇక్కడికి వచ్చాం” అని ఆయన ప్రభుత్వ తీరును ఎండగట్టారు.
నీట్ పేపర్ లీకేజీతో పాటు సీబీఎస్ఈ 12వ తరగతి ఫలితాల్లో దొర్లిన అవకతవకలపై నిరసనకారులు తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. పరీక్షల నిర్వహణలో పారదర్శకత లోపించడం వల్లే విద్యార్థుల భవిష్యత్తు అంధకారంలో పడుతోందని ఆవేదన చెందారు. విద్యారంగంలో డిజిటలైజేషన్ లోపాలను తక్షణమే సరిదిద్దాలని, విద్యార్థులపై మానసిక ఒత్తిడిని తగ్గించేందుకు పటిష్టమైన చర్యలు చేపట్టాలని వారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ నిరసన కార్యక్రమంలో విద్యార్థులు, వివిధ పోటీ పరీక్షలకు సన్నద్ధమవుతున్న అభ్యర్థులు, వారి తల్లిదండ్రులతో పాటు ప్రముఖ సామాజిక కార్యకర్త సోనమ్ వాంగ్చుక్ సైతం పాల్గొని యువతకు బాసటగా నిలిచారు.
కొద్దిరోజుల క్రితం సుప్రీంకోర్టు న్యాయమూర్తి యువతలో కొందరిని ఉద్దేశించి ‘బొద్దింకలు’, ‘పరాన్నజీవులు’ అని చేసిన వ్యాఖ్యలకు వ్యంగ్య నిరసనగానే ఈ ‘కాక్రోచ్ జనతా పార్టీ’ ఆవిర్భవించడం గమనార్హం. బోస్టన్ యూనివర్సిటీలో ఉన్నత విద్యనభ్యసించిన అభిజిత్ దీప్కే.. యువత ఎదుర్కొంటున్న నిరుద్యోగం, నైరాశ్యానికి ఈ అవమానకర వ్యాఖ్యలను ప్రతీకగా తీసుకుని ఆన్లైన్లో వినూత్న ఉద్యమానికి శ్రీకారం చుట్టారు. లక్షలాది మంది మద్దతుదారులతో వెల్లువెత్తిన ఈ ఆన్లైన్ ఉద్యమం ఇప్పుడు క్షేత్రస్థాయి పోరాటంగా రూపాంతరం చెంది అందరి దృష్టినీ ఆకర్షిస్తోంది.
జంతర్ మంతర్ వద్దకు యువత పెద్ద ఎత్తున చేరుకోవడంతో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. ఎటువంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా దిల్లీ పోలీసులు వెయ్యి మందికి పైగా సిబ్బందితో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. నిరసనకారులను నియంత్రించే క్రమంలో భాగంగా ముందుజాగ్రత్త చర్యగా ఆరుగురిని అదుపులోకి తీసుకున్నారు.








