Mahaa Daily Exclusive

  ఆస్ట్రేలియాలో భారీ ఆపరేషన్…

Share

ఆస్ట్రేలియాలో భారీ ఆపరేషన్.
*పట్టుబడ్డ లక్షకు పైగా అక్రమ బొద్దింకలు!
* సరీసృపాలకు ఆహారంగా విక్రయించేందుకు యత్నం.
* దేశ జీవవైవిధ్యానికి ముప్పుగా పరిగణిస్తూ కారుణ్య మరణం.
బాథర్స్ట్ (ఆస్ట్రేలియా) ,మహా.
ఆస్ట్రేలియాలో అధికారులు నిర్వహించిన ఒక భారీ ఆపరేషన్‌లో విస్తుపోయే వాస్తవాలు వెలుగుచూశాయి. దేశంలోకి దిగుమతి చేసుకోవడం లేదా పెంచడంపై పూర్తి నిషేధం ఉన్న ఏకంగా లక్షకు పైగా విదేశీ బొద్దింకలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఒకే బ్రీడర్ వద్ద ఇంత భారీ సంఖ్యలో అక్రమ బొద్దింకలు పట్టుబడటం తీవ్ర సంచలనం సృష్టిస్తోంది. దేశ చరిత్రలో అకశేరుకాలకు (వెన్నెముక లేని జీవులు) సంబంధించి ఇదే అతిపెద్ద ఆపరేషన్ అని పర్యావరణ విభాగం అధికారులు వెల్లడించారు.
**రూ.కోటిన్నర విలువైన బొద్దింకలు**
న్యూసౌత్ వేల్స్‌ రాష్ట్రంలోని బాథర్స్ట్ నగరంలో మే నెలలో ఈ భారీ సోదాలు చోటుచేసుకున్నాయి. ఒక కమర్షియల్ బ్రీడర్ స్థావరంలో అధికారులు తనిఖీలు నిర్వహించగా.. మడగాస్కర్ హిస్సింగ్, డూబియా జాతులకు చెందిన లక్షకు పైగా బొద్దింకలను గుర్తించారు. అక్రమ మార్గంలో పెంచుతున్న వీటి విలువ మార్కెట్లో సుమారు 2,00,000 ఆస్ట్రేలియన్ డాలర్లు (భారత కరెన్సీలో సుమారు రూ. 1.35 కోట్లు) ఉంటుందని అధికారులు అంచనా వేశారు.
**పెంపుడు సరీసృపాల కోసమే..**
ప్రపంచంలోనే అతిపెద్ద బొద్దింక జాతులలో మడగాస్కర్ హిస్సింగ్ ఒకటి. ఇవి ఏకంగా 5 నుంచి 8 సెంటీమీటర్ల పొడవు పెరుగుతాయి. సాధారణ ఆస్ట్రేలియన్ బొద్దింకల కన్నా ఇవి పరిమాణంలో చాలా పెద్దవిగా ఉంటాయి. వీటిని ప్రధానంగా పెంపుడు సరీసృపాలకు (పాములు, బల్లులు తదితర) తక్కువ ఖర్చుతో కూడిన ఆహారంగా అందించేందుకే బ్రీడర్లు పెంచుతూ, అక్రమంగా విక్రయిస్తున్నారని స్థానికంగా పాములను పట్టే నిపుణురాలు స్టెఫానీ లెస్సర్ అభిప్రాయపడ్డారు.
**కఠినంగా ఆస్ట్రేలియా బయోసెక్యూరిటీ చట్టాలు**
దేశీయ వృక్ష, జంతుజాలాన్ని కాపాడేందుకు ఆస్ట్రేలియాలో అత్యంత కఠినమైన బయోసెక్యూరిటీ నిబంధనలు అమల్లో ఉన్నాయి. ఇలాంటి విదేశీ జీవులను పెంచడం లేదా విక్రయించడం అక్కడ పూర్తిగా చట్టవిరుద్ధం. ఈ విదేశీ బొద్దింకలు పర్యావరణానికి తీవ్ర ప్రమాదకరమని, స్థానిక జీవవైవిధ్యానికి హాని కలిగించడంతో పాటు కొత్త రకం వ్యాధులను వ్యాప్తి చేసే ముప్పు ఉందని పర్యావరణ అధికారులు హెచ్చరించారు. ఈ కఠిన నిబంధనలను ఉల్లంఘించిన వారిపై చట్టపరమైన చర్యలు తప్పవని స్పష్టం చేశారు. అయితే, బాథర్స్ట్‌కు చెందిన సదరు బ్రీడర్‌పై ప్రస్తుతానికి ఎలాంటి అభియోగాలు నమోదు చేయలేదని అధికారులు తెలిపారు. కాగా, నిబంధనల ప్రకారం.. స్వాధీనం చేసుకున్న లక్షకు పైగా బొద్దింకలన్నింటికీ కారుణ్య మరణం విధించనున్నట్లు స్పష్టం చేశారు.