Mahaa Daily Exclusive

  బడిబాటపై రాజకీయం…

Share

బడిబాటపై రాజకీయం.
* స్కూళ్ల కుదింపుపై రేవంత్ నిర్ణయంపై కవిత తీవ్ర ఆగ్రహం.
*27 వేల ప్రభుత్వ పాఠశాలలను 4 వేలకు తగ్గించడం దారుణం.
*పేదలు, బాలికల విద్యకు గొడ్డలిపెట్టుగా మారనున్న విద్యా విధానం.
* గురుకులాల్లో విద్యార్థుల మరణాలపై సీఎంకు కనీస పట్టింపు లేదు.
*బెంగళూరు వేదికగా సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై రాజుకున్న దుమారం.
హైదరాబాద్, మహా.
తెలంగాణలో ప్రభుత్వ పాఠశాలల హేతుబద్ధీకరణ, కుదింపు అంశం తీవ్ర రాజకీయ దుమారానికి తెరలేపింది. రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న సుమారు 27,000 ప్రభుత్వ పాఠశాలలను కేవలం 4,000కు కుదించనున్నట్లు ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి ప్రకటించడంపై ప్రతిపక్షాలు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తుతున్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వపు ఈ వివాదాస్పద నిర్ణయంపై టీఆర్‌ఎస్ (తెలంగాణ రక్షణ సేన) అధినేత్రి, మాజీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అత్యంత ఘాటుగా స్పందించారు. ప్రభుత్వ విద్యా రంగాన్ని కుప్పకూల్చేలా ఉన్న ఈ నిర్ణయం పేద విద్యార్థులకు, ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లోని బాలికలను చదువుకు పూర్తిగా దూరం చేసే ప్రమాదకరమైన గొడ్డలిపెట్టని ఆమె తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు.
సోమవారం విడుదల చేసిన ఒక ప్రత్యేక వీడియో ప్రకటనలో కల్వకుంట్ల కవిత రాష్ట్ర ప్రభుత్వ తీరును, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వైఖరిని తీవ్ర పదజాలంతో ఎండగట్టారు. రాష్ట్రంలోని ప్రభుత్వ గురుకుల పాఠశాలల్లో సరైన వసతులు లేక, కలుషిత ఆహారం తదితర కారణాలతో గత కొంతకాలంగా దాదాపు వంద మందికి పైగా అమాయక విద్యార్థులు మరణించినా.. విద్యాశాఖను తన వద్దే ఉంచుకున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కనీసం ఒక్కసారి కూడా ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించలేదని ఆమె ఆరోపించారు. విద్యార్థుల ప్రాణాలు పోతుంటే పట్టించుకోని ముఖ్యమంత్రి, ఇప్పుడు ఏకంగా పాఠశాలల మూసివేతపై దృష్టి సారించడం అత్యంత దారుణమని మండిపడ్డారు. ఈ చర్యల ద్వారా విద్యాశాఖపై మరియు రాష్ట్ర పరిపాలనపై కాంగ్రెస్ ప్రభుత్వానికి కనీస పట్టు, అవగాహన లేదనే విషయం స్పష్టమవుతోందని ఆమె ఎద్దేవా చేశారు.
ఇటీవల బెంగళూరులో జరిగిన ‘ది హిందూ హడిల్ డైలాగ్’ కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొని తెలంగాణ విద్యా వ్యవస్థపై కీలక వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో ఈ వివాదం రాజుకుంది. రాష్ట్రంలోని 27,000 ప్రభుత్వ పాఠశాలల్లో కేవలం 18 లక్షల మంది విద్యార్థులు మాత్రమే చదువుతుండగా, కేవలం 12,000 ప్రైవేట్ స్కూళ్లలో ఏకంగా 35 లక్షల మంది చదువుతున్నారని సీఎం గణాంకాలను ఉటంకించారు. గతంలో రవాణా వసతులు లేని కారణంగా తండాలు, గూడాలు, మారుమూల గ్రామాల్లో ఏక ఉపాధ్యాయ (సింగిల్ టీచర్) పాఠశాలలను ఏర్పాటు చేశారని, ప్రస్తుతం ఆ పాత నమూనా వల్ల ఆశించిన ఫలితాలు రావడం లేదని పేర్కొన్నారు. ఒకటి నుంచి ఐదో తరగతి వరకు తరగతికి ఇద్దరు, ముగ్గురు చొప్పున మొత్తం పది మంది ఉన్న పాఠశాలల్లో నాణ్యమైన విద్య అందడం లేదని అభిప్రాయపడ్డారు.
ఈ సమస్యకు శాశ్వత పరిష్కారంగానే నర్సరీ నుంచి 12వ తరగతి వరకు ఒకే ప్రాంగణంలో అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన ‘సమీకృత పాఠశాలలను’ (ఇంటిగ్రేటెడ్ స్కూల్స్) క్లస్టర్ల వారీగా ఏర్పాటు చేయాలని అధికారులు ఆదేశించినట్లు ముఖ్యమంత్రి సమర్థించుకున్నారు. ఈ సమీకృత పాఠశాలల్లో చదివే విద్యార్థులందరికీ ఉచిత విద్యా బోధనతో పాటు ఉచిత రవాణా సౌకర్యం, ఉదయం అల్పాహారం, మధ్యాహ్నం పౌష్టికాహార భోజన వసతులను ప్రభుత్వమే కల్పిస్తుందని స్పష్టం చేశారు. ప్రైవేట్ పాఠశాలల తరహాలోనే విద్యార్థులను ఇళ్ల వద్ద నుంచే వాహనాల్లో తీసుకువచ్చి, తిరిగి దింపేలా ప్రణాళికలు రూపొందిస్తున్నామని, ఈ ఆధునిక మోడల్ వల్ల విద్యా రంగంలో విప్లవాత్మక మార్పులు వస్తాయని రేవంత్ రెడ్డి ఆశాభావం వ్యక్తం చేశారు.
అయితే, పాఠశాలల హేతుబద్ధీకరణ పేరుతో రేవంత్ సర్కార్ వేస్తున్న అడుగులు, మారుమూల ప్రాంతాల్లోని పాఠశాలల ఉనికిని దెబ్బతీస్తాయని ఉపాధ్యాయ సంఘాలు, మేధావుల నుంచి కూడా అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. ఒకవైపు ప్రభుత్వం విద్యార్థుల నమోదును పెంచేందుకు ఈ ఆధునిక విద్యా విధానం దోహదపడుతుందని చెబుతుండగా, ప్రతిపక్షాలు మాత్రం ఉన్న పాఠశాలలను మూసివేసి కార్పొరేట్ శక్తులకు లబ్ధి చేకూర్చేందుకే ఈ కుదింపు ప్రక్రియ అని ఆరోపిస్తున్నాయి. కవిత చేసిన ఈ సంచలన ఆరోపణలు రాష్ట్ర రాజకీయాల్లో విద్యా రంగంపై సరికొత్త చర్చకు దారితీసినప్పటికీ, దీనిపై విద్యాశాఖ లేదా ప్రభుత్వం తరఫున ఇప్పటివరకు ఎలాంటి అధికారిక వివరణ లేదా స్పందన వెలువడలేదు.