Mahaa Daily Exclusive

  కేసీఆర్‌కు పట్టిన గతే రేవంత్‌కూ పడుతుంది…

Share

కేసీఆర్‌కు పట్టిన గతే రేవంత్‌కూ పడుతుంది.
*పాలమూరు ప్రాజెక్టులపై ముఖ్యమంత్రికి చిత్తశుద్ధి లేదు.
* తెలంగాణ ఏమైనా రేవంత్ రెడ్డి జాగీరా? కిషన్ రెడ్డిపై వ్యాఖ్యలపై తీవ్ర ధ్వజం.
*కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి రెండేళ్లు దాటినా అభివృద్ధి శూన్యం.
* బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ.

హైదరాబాద్, మహా.

తెలంగాణ ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి వ్యవహరిస్తున్న తీరుపై భారతీయ జనతా పార్టీ (బీజేపీ) జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. రేవంత్ రెడ్డి పాలన చూస్తుంటే గతంలో మాజీ ముఖ్యమంత్రి, బీఆర్‌ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు అనుసరించిన ఏకపక్ష పంథానే గుర్తుకు వస్తోందని ఆమె ఎద్దేవా చేశారు. కేసీఆర్ నడిచిన దారిలోనే రేవంత్ సైతం పయనిస్తున్నారని.. ఆ కారణంగా నాడు కేసీఆర్‌కు పట్టిన గతే రేపు రేవంత్ రెడ్డికి కూడా పడుతుందని ఆమె హెచ్చరించారు. పాలమూరు ప్రాంత సాగునీటి ప్రాజెక్టులపై ముఖ్యమంత్రికి ఏమాత్రం చిత్తశుద్ధి లేదని, ఆయన ఎన్నడూ ఈ ప్రాంత ప్రాజెక్టుల పురోగతి కోసం పోరాడిన దాఖలాలు లేవని తీవ్రంగా విమర్శించారు.
**ప్రచార ఆర్భాటాలే తప్ప ప్రగతి ఎక్కడ?**
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కేవలం ప్రచార ఆర్భాటాల మీద ఉన్న శ్రద్ధ.. రాష్ట్ర అభివృద్ధిపై లేదని డీకే అరుణ ఆరోపించారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి రెండున్నరేళ్లు కావస్తున్నప్పటికీ, నేటికీ పాలమూరు ప్రాజెక్టులను ఎందుకు పూర్తి చేయలేకపోయారని ఆమె నిలదీశారు. పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి జాతీయ హోదా ఇవ్వకుండా కేంద్ర ప్రభుత్వం అడ్డుపడుతోందంటూ కాంగ్రెస్ నేతలు చేస్తున్న ఆరోపణలను ఆమె పూర్తిగా కొట్టిపారేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన సమయంలో, కేంద్రంలోనూ రాష్ట్రంలోనూ కాంగ్రెస్ పార్టీయే అధికారంలో ఉందని గుర్తుచేసిన ఆమె.. మరి ఆనాడే విభజన చట్టంలో ఈ ప్రాజెక్టుకు జాతీయ హోదా అంశాన్ని ఎందుకు పొందుపరచలేదని గట్టిగా ప్రశ్నించారు. తమ వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికే కేంద్రంపై బురద చల్లుతున్నారని మండిపడ్డారు.
**పొలిమేర దాటనీయకపోవడానికి తెలంగాణ రేవంత్ జాగీరా?**
రాష్ట్ర బీజేపీ నేతలు బాధ్యతల నుంచి తప్పించుకు తిరుగుతున్నారని, కేంద్ర మంత్రి జి. కిషన్ రెడ్డిని తెలంగాణ పొలిమేర కూడా దాటనివ్వబోమంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై డీకే అరుణ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. “పొలిమేర దాటనీయకపోవడానికి తెలంగాణ ఏమైనా రేవంత్ రెడ్డి జాగీరా?” అంటూ ఆమె ఘాటుగా ప్రశ్నించారు. రేవంత్ రెడ్డి ప్రజల మధ్యకు వెళ్లే ధైర్యం లేకనే తన చుట్టూ భారీగా పోలీసు సెక్యూరిటీ పెట్టుకుని తిరుగుతున్నారని విమర్శించారు. ఒకరిని పొలిమేర దాటనివ్వబోనని అంటున్న రేవంత్ రెడ్డినే రానున్న రోజుల్లో తెలంగాణ పొలిమేరల్లోకి రాకుండా చేయడానికి రాష్ట్ర ప్రజలు సిద్ధంగా ఉన్నారని వ్యాఖ్యానించారు.
**కాంగ్రెస్‌పై పెరుగుతున్న ప్రజా వ్యతిరేకత**
తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ పార్టీ నిత్యం చెబుతున్న అబద్ధాలను, వైఫల్యాలను నిశితంగా గమనిస్తున్నారని అరుణ పేర్కొన్నారు. ఇచ్చిన హామీలను అమలు చేయకుండా కాలయాపన చేస్తుండటంతో రాష్ట్రవ్యాప్తంగా కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోందని తెలిపారు. అదే సమయంలో దేశంలో, రాష్ట్రంలో బీజేపీకి ప్రజా మద్దతు క్రమంగా పెరుగుతోందని స్పష్టం చేశారు. కాంగ్రెస్ వైఫల్యాలతో విసిగిపోయిన తెలంగాణ ప్రజలు.. రాబోయే రోజుల్లో తమ పార్టీనే అధికారంలోకి తీసుకురావాలని బలంగా కోరుకుంటున్నారని డీకే అరుణ ధీమా వ్యక్తం చేశారు.