Mahaa Daily Exclusive

  మాట నిలబెట్టుకున్న మంత్రి జూపల్లి..

Share

  • మాట నిలబెట్టుకున్న మంత్రి జూపల్లి
  • మినీ స్టేడియానికి త‌న‌ 4 ఎకరాల భూమి విరాళం
  • రూ.1.50 కోట్ల విలువైన సొంత స్థలం కేటాయింపు
  • తహసీల్దార్‌ కార్యాలయంలో డిజిటల్‌ సంతకం చేసిన మంత్రి
  • భూమి బదిలీ ప్రక్రియ పూర్తి

కొల్లాపూర్, మహా : రాజకీయాల్లో ఎప్పుడూ ఆదర్శంగా ఉంటూ ప్రజా సంక్షేమాన్ని, నిజాయితీని, విలువలను తమ సిద్ధాంతాలుగా మార్చుకున్న ప‌ర్యాట‌క‌, సాంస్కృతిక, పురావ‌స్తు, ఎక్సైజ్ శాఖ మంత్రి జూప‌ల్లి కృష్ణారావు నిస్వార్ధ నిర్ణ‌యం తీసుకున్నారు. గతంలో తాను స్థానిక క్రీడాకారులకు ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటూ సుమారు రూ.1.50 కోట్ల విలువైన తన 4 ఎకరాల సొంత భూమిని మినీ స్టేడియం నిర్మాణానికి విరాళంగా అందజేశారు. కొల్లాపూర్ నియోజకవర్గ పరిధిలోని వీపనగండ్ల మండల కేంద్రంలో ఉన్న తన సొంత భూమిని క్రీడా మైదానానికి బదలాయిస్తూ బుధవారం కోడేరు మండల తహసీల్దార్‌ కార్యాలయంలో మంత్రి జూపల్లి కృష్ణారావు స్వయంగా డిజిటల్ సంతకం చేశారు.

గతంలో వీపనగండ్ల మండల పర్యటనకు వచ్చిన సందర్భంలో, స్థానిక యువత, క్రీడాకారుల అభ్యర్థన మేరకు మినీ స్టేడియం ఏర్పాటు కోసం తన సొంత భూమిని ఇస్తానని మంత్రి హామీ ఇచ్చారు. ఈ మేరకు వీపనగండ్ల మండల కేంద్రంలోని సర్వే నెంబర్ 532/ఆ పరిధిలో తన పేరు మీద ఉన్న 4 ఎకరాల పట్టా భూమిని ప్రభుత్వానికి బదిలీ చేశారు. కోడేరు తహసీల్దార్ కార్యాలయంలో వీపనగండ్ల ఎంఆర్‌ఓ డిజిటల్ లాగిన్ ద్వారా ఈ భూమిని మినీ స్టేడియానికి కేటాయిస్తూ అధికారిక ప్రక్రియను పూర్తి చేశారు. ఈ చారిత్రాత్మక భూ బదలాయింపు ప్రక్రియకు సాక్షులుగా వీపనగండ్ల మండల కేంద్రానికి చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకుడు మునిగొండ గోపి, నాగర్‌కర్నూల్ జిల్లా పర్యాటక శాఖ అధికారి కల్వరాల నరసింహ అధికారికంగా డిజిటల్ సంతకాలు చేశారు. కోట్లలో విలువ చేసే భూమిని క్రీడల అభ్యున్నతి కోసం, నిరుపేద గ్రామీణ యువత భవిష్యత్తు కోసం దానం చేసిన మంత్రి జూపల్లి కృష్ణారావును మంచి మనసున్న నాయకుడని ప‌లువురు ప్ర‌శంసించారు. మంత్రికి ప్రజలు, క్రీడాకారులు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.