Mahaa Daily Exclusive

  దేశంపై ‘ఎల్‌నినో’ పంజా….

Share

దేశంపై ‘ఎల్‌నినో’ పంజా.
* అధికారికంగా ప్రారంభమైనట్లు ఐఎండీ తీవ్ర హెచ్చరిక.
* నైరుతి రుతుపవనాలపై ప్రతికూల ప్రభావం.
* అమాంతం పెరగనున్న ఉష్ణోగ్రతలు.
ఢిల్లీ, మహా.
దేశ వాతావరణం మరింత వేడెక్కనుంది. వ్యవసాయ రంగానికి, వర్షపాతానికి తీవ్ర విఘాతం కలిగించే ‘ఎల్‌నినో’ పరిస్థితులు అధికారికంగా ప్రారంభమైనట్లు భారత వాతావరణ శాఖ (ఐఎండీ) తీవ్ర హెచ్చరికలు జారీ చేసింది. భూమధ్యరేఖా పసిఫిక్ మహాసముద్రంలో ఎల్‌నినో పరిస్థితులు ఇప్పటికే అంకురించాయని, ప్రస్తుతం కొనసాగుతున్న నైరుతి రుతుపవనాల కాలంలో ఇది ఊహించిన దానికంటే మరింత వేగంగా బలపడే ప్రమాదం ఉందని వాతావరణ శాఖ స్పష్టం చేసింది. ఈ ఆందోళనకర పరిణామంతో రానున్న రోజుల్లో దేశవ్యాప్తంగా వర్షాలు ముఖం చాటేసే ప్రమాదం ఉందని, అదే సమయంలో ఉష్ణోగ్రతలు అమాంతం పెరిగి తీవ్రమైన వేడి వాతావరణం ఏర్పడే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయని ఐఎండీ తన తాజా నివేదికలో వెల్లడించింది.
భారత వాతావరణ శాఖ తాజాగా విడుదల చేసిన ఇండియన్ ఓషన్ డైపోల్ బులెటిన్ ప్రకారం.. సముద్ర ఉపరితల ఉష్ణోగ్రతల్లో అనూహ్య మార్పులు చోటుచేసుకుంటున్నాయి. మధ్య, తూర్పు పసిఫిక్ సముద్ర ప్రాంతాల్లో సముద్ర ఉపరితల ఉష్ణోగ్రతలు ఇప్పటికే ఎల్‌నినో ప్రమాద ఘంటికల స్థాయిని దాటేశాయి. కేవలం సముద్ర ఉష్ణోగ్రతలు పెరగడమే కాకుండా, పెరిగిన వేడికి అనుగుణంగా వాతావరణ వ్యవస్థ కూడా ప్రతికూలంగా స్పందించడం ప్రారంభించిందని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎల్‌నినోను కచ్చితంగా అంచనా వేసే ప్రధాన సూచిక అయిన ‘నినో 3.4 ఇండెక్స్’ మూడు నెలల సగటు విలువ ఇప్పటికే పీక్ స్థాయికి చేరుకుంది. ఇది ప్రమాదకరంగా +0.5 డిగ్రీల సెల్సియస్‌ కంటే ఎక్కువగా నమోదు కావడంతో, వాతావరణంలో అధికారికంగా ఎల్‌నినో పరిస్థితులు పూర్తిగా ఆవరించినట్లు శాస్త్రవేత్తలు అధికారికంగా నిర్ధారించారు.
సముద్ర ఉపరితలంపైనే కాకుండా, పసిఫిక్ సముద్రం అడుగు భాగంలో కూడా పరిస్థితులు అత్యంత ఆందోళనకరంగా మారుతున్నాయి. ఉపరితలం కింద కూడా చాలా లోతు వరకు విస్తృతంగా అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయని వాతావరణ శాఖ నివేదిక హెచ్చరించింది. సముద్రం అడుగున ఉన్న ఈ వేడి నీటి ప్రవాహాలు రాబోయే నెలల్లో క్రమంగా ఉపరితలం పైకి రానున్నాయని, దీనివల్ల ఎల్‌నినో ప్రభావం మరింత ఉగ్ర రూపం దాల్చే అవకాశం ఉందని విశ్లేషించింది. ప్రస్తుత వాతావరణ నమూనాల అంచనాల ప్రకారం.. జూన్ నుంచి ఆగస్టు మధ్య కాలంలో పసిఫిక్ ప్రాంతంలో ఉష్ణోగ్రతల పెరుగుదల నిరంతరాయంగా కొనసాగనుంది. ముఖ్యంగా జూలై నెల నుంచి మధ్య, తూర్పు పసిఫిక్ ప్రాంతాల్లో ఎల్‌నినో ప్రతాపం మరింతగా విస్తరించవచ్చని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు. మొత్తంగా చూస్తే, ఈ ఏడాది కీలకమైన మాన్సూన్ సీజన్ అంతా ఎల్‌నినో నీడలోనే సాగనుందని, ఈ ప్రతికూల పరిస్థితులు దీర్ఘకాలం పాటు కొనసాగి దేశ వర్షపాతంపై తీవ్ర ప్రభావం చూపే ప్రమాదం ఉందని ఐఎండీ స్పష్టం చేసింది. వ్యవసాయంపై ప్రధానంగా ఆధారపడ్డ భారత ఆర్థిక వ్యవస్థకు ఇది రాబోయే రోజుల్లో ఒక సవాలుగా మారే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు.