బెంగాల్లో పరాభవ భారం.
* దీదీకి వరుస షాక్‌లు.
* గ్రంథాలయాల నుంచి మమతా బెనర్జీ పుస్తకాల తొలగింపునకు రంగం సిద్ధం.
* మహనీయుల చరిత్రకే ఇక పెద్దపీట.
* రాష్ట్ర గ్రంథాలయ శాఖ మంత్రి గౌరీ శంకర్ ఘోష్ వెల్లడి.
కోల్‌కతా,మహా.
పశ్చిమ బెంగాల్ రాజకీయ ముఖచిత్రం సమూలంగా మారిపోయింది. ఇటీవలి ఎన్నికల్లో ఘోర పరాజయం మూటగట్టుకున్న తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) అధినేత్రి, మాజీ ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి ఏమాత్రం కోలుకోలేని విధంగా వరుస షాక్‌లు తగులుతున్నాయి. ఒకవైపు పార్టీలో అంతర్గత కలహాలు తీవ్రస్థాయికి చేరుకుని, టీఎంసీ ముక్కలయ్యే పరిస్థితి నెలకొంది. పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు, ఎంపీలు అధినేత్రి మాటను ఏమాత్రం లెక్కచేసే పరిస్థితిలో లేరు. మరోవైపు ఎన్నికల ప్రచార సమయంలో మత విద్వేషాలను రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలపై దీదీపై ఇప్పటికే కేసులు నమోదు కావడం, ఆమె మేనల్లుడు అభిషేక్ బెనర్జీ చుట్టూ అవినీతి ఉచ్చు బిగుస్తుండటం, దర్యాప్తు సంస్థల విచారణలు ముమ్మరం కావడంతో బెంగాల్ రాజకీయాలు దేశవ్యాప్తంగా తీవ్ర సంచలనంగా మారాయి.
ఈ విపత్కర రాజకీయ పరిణామాల నేపథ్యంలో, పశ్చిమ బెంగాల్లో కొత్తగా కొలువుదీరిన ప్రభుత్వం మరో సంచలన నిర్ణయానికి తెరతీసింది. రాష్ట్రంలోని ప్రభుత్వ, పాఠశాల గ్రంథాలయాల నుంచి మమతా బెనర్జీ రాసిన పుస్తకాలను పూర్తిగా తొలగించేందుకు రంగం సిద్ధం చేస్తోంది. ఈ మేరకు రాష్ట్ర గ్రంథాలయ సేవల శాఖ మంత్రి గౌరీ శంకర్ ఘోష్ సంచలన ప్రకటన చేశారు. విద్యార్థులు, యువతలో జ్ఞానాన్ని, మేధో వికాసాన్ని, జాతీయవాద భావాలను పెంపొందించే పుస్తకాలను మాత్రమే ఇకపై గ్రంథాలయాల్లో ఉంచుతామని ఆయన స్పష్టం చేశారు. కేవలం వ్యక్తిగత ప్రచారం కోసం రాసుకున్న ‘ఎపాంగ్ ఓపాంగ్ ఝపాంత్’ వంటి పుస్తకాలకు ఇకపై లైబ్రరీల్లో ఎలాంటి చోటు ఉండబోదని మంత్రి ఘోష్ కుండబద్దలు కొట్టారు.
మమత పుస్తకాల స్థానంలో దేశ చరిత్రను, సంస్కృతిని ప్రతిబింబించే మహనీయుల జీవిత చరిత్రలను అందుబాటులోకి తేనున్నారు. విశ్వకవి రవీంద్రనాథ్ టాగోర్, ప్రముఖ కవి కాజీ నజ్రుల్ ఇస్లాం, యువతకు ఆదర్శప్రాయుడైన స్వామి వివేకానంద వంటి సాహిత్య, ఆధ్యాత్మిక దిగ్గజాల రచనలకు గ్రంథాలయాల్లో పెద్దపీట వేయనున్నారు. వారితో పాటుగా దేశభక్తిని రగిలించే ఛత్రపతి శివాజీ మహారాజ్, మహారాణా ప్రతాప్ తదితర చారిత్రక యోధుల జీవిత చరిత్రలను పాఠకులకు అందుబాటులో ఉంచేలా కొత్త ప్రభుత్వం ప్రణాళికలు రచిస్తోందని మంత్రి వివరించారు.
గత మమతా బెనర్జీ ప్రభుత్వ హయాంలో వ్యక్తిగత ఇమేజ్ పెంచుకునేందుకు లైబ్రరీలను ఏ విధంగా వాడుకున్నారో ఈ సందర్భంగా మంత్రి పరోక్షంగా ఎత్తిచూపారు. సరిగ్గా ఏడాది క్రితం, అనగా 2025లో అప్పటి టీఎంసీ ప్రభుత్వం రాష్ట్రంలోని పాఠశాల గ్రంథాలయాల కోసం ఏకంగా 515 పుస్తకాలను ఆమోదించింది. అయితే, విస్తుపోయే విషయమేమిటంటే.. ఆ ఆమోదించిన జాబితాలో ఏకంగా 90 పుస్తకాలు స్వయంగా మమతా బెనర్జీ రచించినవే కావడం గమనార్హం. కేవలం రాజకీయ ఆధిపత్య ప్రదర్శన కోసం విద్యార్థులపై రుద్దిన ఈ పుస్తకాలను ఇప్పుడు పూర్తిగా తొలగించి, ఆ పాత నిర్ణయాన్ని రద్దు చేసేందుకు ప్రస్తుత బీజేపీ ప్రభుత్వం కంకణం కట్టుకుంది. దీదీ మార్క్ రాజకీయాలను, ఆమె ఆనవాళ్లను చెరిపేసే దిశగా కమలనాథులు వేస్తున్న ఈ అడుగులు రాష్ట్రవ్యాప్తంగా హాట్ టాపిక్‌గా మారాయి.







