Mahaa Daily Exclusive

  గెలికి మరీ భంగపడ్డ యూరప్….

Share

గెలికి మరీ భంగపడ్డ యూరప్.
* రష్యా చమురుపై జైశంకర్ ఘాటు కౌంటర్!
* ఈ ప్రశ్న అడిగే నైతిక హక్కు మీకే లేదు.
* ఆనాడు అమెరికానే మమ్మల్ని ప్రోత్సహించింది.
* యూరప్ అహంకారాన్ని మరోసారి అంతర్జాతీయ వేదికపై అణిచివేసిన భారత విదేశాంగ మంత్రి.
ఢిల్లీ, మహా.
అంతర్జాతీయ వేదికలపై భారత విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ దౌత్య వ్యూహం ముందు, ఆయన సంధించే పదునైన మాటల తూటాల ముందు నోరుమెదపలేక భంగపడటం యూరప్ నాయకులకు, అక్కడి జర్నలిస్టులకు అలవాటుగా మారిపోయింది. భారత్ అంటే ఒకప్పటిలా అణగిమణిగి ఉండే దేశం కాదని, ప్రస్తుతం ప్రపంచంలోనే టాప్-5 ఆర్థిక వ్యవస్థల్లో ఒకటిగా, అత్యంత శక్తిమంతమైన అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంగా అవతరించిందన్న నిజాన్ని పశ్చిమ దేశాలు ఇంకా జీర్ణించుకోలేకపోతున్నాయి. ప్రతిసారీ భారతదేశ అంతర్గత, విదేశాంగ విధానాలపై తమ పైత్యాన్ని ప్రదర్శించాలని చూసి, జైశంకర్ ఇచ్చే గట్టి కౌంటర్లతో అంతర్జాతీయ సమాజం ముందు పరువు పోగొట్టుకుంటున్నారు. తాజాగా ఫిన్లాండ్ వేదికగా జరిగిన ఒక ప్రతిష్టాత్మక కార్యక్రమంలో రష్యా నుంచి భారత్ ముడి చమురు కొనుగోలు చేయడాన్ని ప్రశ్నించిన యూరప్ దేశాల అహంకారానికి జైశంకర్ తనదైన శైలిలో చరమగీతం పాడారు.
ఫిన్లాండ్‌లో ఏర్పాటు చేసిన ‘ఎమర్జింగ్ పవర్స్ అండ్ ది జియోపాలిటికల్ కాంపిటీషన్’ అనే ప్రత్యేక సదస్సులో పాల్గొన్న విదేశాంగ మంత్రి జైశంకర్‌కు ఒక యూరప్ విలేకరి నుంచి ఊహించిన ప్రశ్న ఎదురైంది. ఉక్రెయిన్ సంక్షోభం నేపథ్యంలో రష్యా పట్ల భారతదేశానికి ఎందుకు అంత మితిమీరిన సానుభూతి ఉందని, రష్యా నుంచి చమురు కొనుగోళ్లను ఎందుకు ఆపడం లేదని సదరు విలేకరి ప్రశ్నించారు. ఈ ప్రశ్నపై జైశంకర్ ఏమాత్రం తడుముకోకుండా అత్యంత ఘాటుగా, సూటిగా బదులిచ్చారు. రష్యా నుంచి ముడి చమురును కొనుగోలు చేయాలన్న భారతదేశ నిర్ణయం కేవలం ఆ చమురు యొక్క లభ్యత, మార్కెట్లో దాని అందుబాటు ధరలపైనే ఆధారపడి ఉందని స్పష్టం చేశారు. తమ దేశ ప్రజల ప్రయోజనాలే తమకు పరమావధి అని తేల్చిచెప్పారు. అంతేకాకుండా, అంతర్జాతీయ ఇంధన మార్కెట్లను స్థిరీకరించడంలో సహాయపడటానికి, 2022లో రష్యా నుంచి చమురు కొనుగోళ్లను కొనసాగించాల్సిందిగా అప్పట్లో అమెరికానే స్వయంగా భారతదేశాన్ని ప్రోత్సహించిందనే అసలు నిజాన్ని బయటపెట్టి పశ్చిమ దేశాల ద్వంద్వ వైఖరిని ఎండగట్టారు.
భారత్‌ను ప్రశ్నించే ముందు యూరప్ దేశాలు తమ గతాన్ని, వర్తమానాన్ని ఒకసారి చూసుకోవాలని జైశంకర్ హితవు పలికారు. రష్యా చమురు కొనుగోళ్లపై భారత్‌ను నిలదీసే కనీస నైతిక హక్కు యూరప్ దేశాలకు లేదని ఆయన ముఖం మీదే స్పష్టం చేశారు. చరిత్రను గుర్తుచేస్తూ.. గతంలో యూరప్‌లో తయారైన అత్యాధునిక ఆయుధాలను భారతదేశంపై దాడులు చేయడానికి శత్రుదేశాలు ఉపయోగించాయని, కానీ భారతదేశానికి చెందిన ఆయుధాలు ఎప్పుడూ, ఏనాడూ యూరప్‌లోని ఏ ఒక్క దేశానికి కూడా ముప్పుగా మారలేదన్న నిఖార్సైన వాస్తవాన్ని గుర్తుచేశారు. ఉక్రెయిన్ యుద్ధం ప్రారంభమైన తర్వాత భారతదేశానికి సాంప్రదాయకంగా ఇంధనాన్ని సరఫరా చేసే మిడిల్ ఈస్ట్ (మధ్యప్రాచ్య) దేశాల నుంచి యూరప్ ఒక్కసారిగా చమురు కొనుగోలు చేయడం ప్రారంభించిందని విమర్శించారు. యూరప్ దేశాలు మిడిల్ ఈస్ట్ చమురును ఎగరేసుకుపోవడంతో, తమ దేశ ఇంధన అవసరాల కోసం, ప్రజలపై భారం పడకుండా ఉండటం కోసం భారత్ ప్రత్యామ్నాయంగా రష్యా చమురు వైపు మొగ్గు చూపాల్సి వచ్చిందని తార్కికంగా వివరించారు. జైశంకర్ ఇచ్చిన ఈ సునిశిత సమాధానంతో రష్యా చమురు సాకుతో భారత్‌ను ఇరుకున పెట్టాలని చూసిన యూరప్ ప్రతినిధులకు అంతర్జాతీయ వేదికపై మరోసారి గట్టి పరాభవం ఎదురైంది.