సమ్మక్క సాగర్ ఎన్వోసీపై పీటముడి.
* తేల్చాల్సింది ఐఐటీ రూర్కీనే!
*పరిహారానికి సిద్ధమంటున్న తెలంగాణ.
*’నివేదిక వచ్చాకే నిర్ణయమన్న ఛత్తీస్‌గఢ్ సీఎం.
*ఆరు జిల్లాల సాగునీటి భవితవ్యంపై ఉత్కంఠ.
హైదరాబాద్, మహా.
ఉత్తర తెలంగాణ రైతాంగం పాలిట వరప్రదాయినిగా భావిస్తున్న ప్రతిష్టాత్మక సమ్మక్క సాగర్ (తుపాకులగూడెం) ప్రాజెక్టుకు అనుమతుల గండం పొంచి ఉంది. ప్రాజెక్టుకు కేంద్ర జలసంఘం (సీడబ్ల్యూసీ) నుంచి తుది ఆమోదం లభించాలంటే పొరుగున ఉన్న ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం నుంచి నిరభ్యంతర పత్రం (ఎన్వోసీ) రావడం అత్యంత ఆవశ్యకం. ఇదే విషయమై తెలంగాణ రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ముమ్మర ప్రయత్నాలు సాగిస్తున్నారు. తాజాగా హైదరాబాద్ నగరంలో ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన ‘ఇన్వెస్టర్స్ కనెక్ట్’ కార్యక్రమానికి విచ్చేసిన ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి విష్ణు దేవ్ సాయ్‌ను మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిసి ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా సమ్మక్క సాగర్ ప్రాజెక్టుకు వెంటనే ఎన్వోసీ మంజూరు చేయాలని కోరుతూ తెలంగాణ ప్రభుత్వం తరపున ఆయనకు ఒక సమగ్రమైన విజ్ఞాపన పత్రాన్ని సమర్పించారు. గత ఏడాది సెప్టెంబర్ నెలలో సైతం న్యూ రాయ్‌పూర్‌లో విష్ణుదేవ్ సాయ్‌ని మంత్రి ఉత్తమ్ ప్రత్యేకంగా కలిసి ఈ ప్రాజెక్టు ఆవశ్యకతను వివరించిన విషయం విదితమే.
ఈ ప్రాజెక్టు నిర్మాణం వల్ల ఛత్తీస్‌గఢ్ రాష్ట్ర పరిధిలోని బీజాపూర్ జిల్లా భూపాలపట్నం తహసీల్ పరిధిలో కొంతమేర ముంపు ముప్పు పొంచి ఉంది. బ్యారేజి బ్యాక్ వాటర్స్ కారణంగా సుమారు 54 హెక్టార్లకు పైగా నదీ తీర ప్రాంతంతో పాటు, మరో 19 హెక్టార్లకు పైగా ఇతర భూములు జలమయం అయ్యే అవకాశం ఉంది. అయితే, ఈ ముంపునకు గురయ్యే భూములకు సంబంధించి 2013 భూసేకరణ చట్టం ప్రకారం గానీ, లేదా ఆ రాష్ట్ర ప్రభుత్వ జీవోల ఆధారంగా గానీ గంపగుత్తగా ముందస్తు పరిహారం చెల్లించేందుకు తెలంగాణ ప్రభుత్వం పూర్తిగా సిద్ధంగా ఉందని మంత్రి ఉత్తమ్ స్పష్టం చేశారు. కేవలం ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వం లేవనెత్తుతున్న అభ్యంతరాల కారణంగానే కేంద్ర జలసంఘం ఈ ప్రాజెక్టు డీపీఆర్‌ను ఆమోదించడం లేదని, ఆ రాష్ట్రం తక్షణమే నిరభ్యంతర పత్రం ఇస్తే ప్రాజెక్టుకు లైన్ క్లియర్ అవుతుందని ఆయన విజ్ఞప్తి చేశారు. తెలంగాణ, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల మధ్య సరైన సమన్వయంతో ప్రాజెక్టు అనుమతుల ప్రక్రియను వేగవంతం చేసేలా చర్యలు తీసుకుంటామని ఆయన ధీమా వ్యక్తం చేశారు.
మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చేసిన ఈ విజ్ఞప్తిపై ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి విష్ణుదేవ్ సాయ్ స్పందిస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు. ముంపు ప్రభావంపై తాము ఏకపక్షంగా నిర్ణయం తీసుకోలేమని ఆయన స్పష్టం చేశారు. తెలంగాణ ప్రభుత్వం తుపాకులగూడెం వద్ద నిర్మిస్తున్న సమ్మక్క సాగర్ బ్యారేజీ వల్ల తమ రాష్ట్రంలో తలెత్తే ముంపు ప్రభావంపై ప్రతిష్టాత్మక విద్యాసంస్థ ఐఐటీ రూర్కీ (IIT Roorkee) తో శాస్త్రీయంగా అధ్యయనం చేయిస్తున్నామని సీఎం వెల్లడించారు. ఆ నిపుణుల కమిటీ సమర్పించే సమగ్ర నివేదిక తమ చేతికి వచ్చిన తర్వాతే, అందులోని అంశాలను క్షుణ్ణంగా పరిశీలించి ఎన్వోసీ మంజూరుపై తుది నిర్ణయం తీసుకుంటామని ఆయన కుండబద్దలు కొట్టారు. దీంతో ప్రాజెక్టు అనుమతుల వ్యవహారం ఐఐటీ రూర్కీ నివేదికపైనే ఆధారపడి ఉందన్న విషయం స్పష్టమైంది.
తెలంగాణలోని బీడు భూములకు, ముఖ్యంగా ఫ్లోరైడ్ బారిన పడిన నల్గొండ లాంటి జిల్లాలకు తాగు, సాగునీరు అందించేందుకు సమ్మక్క సాగర్ ప్రాజెక్టు నిర్మాణం అత్యంత కీలకం. గోదావరి నదిపై 83 మీటర్ల ఎత్తుతో, 6.7 టీఎంసీల భారీ నీటి నిల్వ సామర్థ్యంతో ఈ ఆనకట్టను నిర్మించనున్నారు. ఈ ప్రాజెక్టు పూర్తయితే శ్రీరామసాగర్ రెండో దశ కింద ఉన్న 3.91 లక్షల ఎకరాల ఆయకట్టుకు పుష్కలంగా సాగునీరు అందుతుంది. అందులో ఉమ్మడి నల్గొండ, వరంగల్ జిల్లాల్లోనే 2.64 లక్షల ఎకరాల ఆయకట్టు స్థిరీకరణ జరుగుతుంది. అంతేకాకుండా, రామప్ప – పాకాల లింక్ కాలువ ద్వారా సుమారు 30 వేల ఎకరాలకు కొత్తగా సాగునీరు అందించాలన్నది ప్రభుత్వ ప్రధాన లక్ష్యం. మొత్తంగా వరంగల్, మహబూబాబాద్, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, జనగామ జిల్లాలకు సాగునీటి భరోసా లభిస్తుంది. ఈ భారీ ప్రాజెక్టు కింద బ్యారేజీతో పాటు మూడు పంపు హౌస్‌లు, 90 కిలోమీటర్ల మేర సొరంగాలు, కాలువల నిర్మాణం జరగాల్సి ఉంది. రైతుల ప్రయోజనాలే పరమావధిగా అడుగులు వేస్తున్న తెలంగాణ ప్రభుత్వానికి.. రూర్కీ నివేదిక సానుకూలంగా వచ్చి ఛత్తీస్‌గఢ్ నుంచి గ్రీన్ సిగ్నల్ ఎప్పుడు లభిస్తుందా అని యావత్ తెలంగాణ రైతాంగం ఆశగా ఎదురుచూస్తోంది.








