మౌలిక వసతుల కల్పనకు భారీ సాయం!
* రేకొండ ‘టిఫిన్ బైఠక్’లో పాల్గొన్న కేంద్ర మంత్రి బండి సంజయ్.
* ప్రాథమిక పాఠశాలలో తరగతి గదుల నిర్మాణానికి రూ.20 లక్షలు.
* భోజన వసతికి రూ.5 లక్షల విరాళం.
* పదో తరగతి విద్యార్థులకు ఉచితంగా సైకిళ్లు అందజేస్తామని ప్రకటన.
హుస్నాబాద్,మహా.
పార్లమెంటు సభ్యుడిగా ఎన్నికైన నాటి నుంచి సామాజిక సేవ, ప్రజా సంక్షేమ కార్యక్రమాలకే తాను అత్యధిక ప్రాధాన్యం ఇస్తున్నానని కేంద్ర మంత్రి బండి సంజయ్ స్పష్టం చేశారు. హుస్నాబాద్ నియోజకవర్గం పరిధిలోని రేకొండ గ్రామంలో నిర్వహించిన ‘టిఫిన్ బైఠక్’ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. స్థానిక ప్రజలతో కలిసి అల్పాహారం చేసిన ఆయన, గ్రామంలోని పరిస్థితులు, ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై వారితో ఆత్మీయంగా ముచ్చటించారు. అనంతరం రేకొండ పాఠశాలలో కొనసాగుతున్న ‘మన బడి-మన బాధ్యత’ పారిశుద్ధ్య, అభివృద్ధి కార్యక్రమాలను కేంద్ర మంత్రి స్వయంగా పరిశీలించారు. పాఠశాలల పునఃప్రారంభానికి ముందే బడి వాతావరణాన్ని మెరుగుపరిచేందుకు రాజకీయాలకు అతీతంగా గ్రామస్థులంతా ఈ కార్యక్రమంలో భాగస్వాములు కావాలని, సమిష్టిగా కృషి చేయాలని ఆయన పిలుపునిచ్చారు.
ఈ సందర్భంగా పాఠశాలలో మౌలిక వసతుల లేమిని ఉపాధ్యాయులు, గ్రామస్థులు మంత్రి దృష్టికి తీసుకువెళ్లారు. ఉన్నత పాఠశాలలోని విద్యార్థులకు సరైన భోజన వసతి లేదని, అలాగే ప్రాథమిక పాఠశాలలో తరగతి గదుల కొరత తీవ్రంగా ఉందని వారు వివరించారు. గ్రామస్థుల విజ్ఞప్తిపై కేంద్ర మంత్రి బండి సంజయ్ తక్షణమే సానుకూలంగా స్పందించారు. పాఠశాలలో మౌలిక సదుపాయాల కల్పనకు తన వంతుగా భారీ ఆర్థిక సాయాన్ని ప్రకటించారు. విద్యార్థుల భోజన వసతి (డైనింగ్ సదుపాయం) ఏర్పాటు కోసం ఉన్నత పాఠశాలకు రూ.5 లక్షలు, ప్రాథమిక పాఠశాలలో నూతన తరగతి గదుల నిర్మాణం కోసం రూ.20 లక్షల ఆర్థిక సాయం అందజేస్తానని హామీ ఇచ్చారు. పనులను వీలైనంత త్వరగా ప్రారంభించేందుకు తొలి దశ కింద రూ.10 లక్షల నిధులను తక్షణమే విడుదల చేస్తానని ఆయన భరోసా ఇచ్చారు.
అనంతరం, ఇటీవల వెలువడిన పదో తరగతి పరీక్షా ఫలితాల్లో అత్యుత్తమ మార్కులు సాధించిన విద్యార్థులను మంత్రి బండి సంజయ్ ప్రత్యేకంగా అభినందించారు. విద్యార్థులను ప్రోత్సహించే దిశగా, ఈ విద్యాసంవత్సరం కూడా పదో తరగతి చదువుతున్న విద్యార్థులందరికీ ఉచితంగా సైకిళ్లు పంపిణీ చేస్తామని ఆయన సంతోషకరమైన వార్తను పంచుకున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం గత 12 ఏళ్ల పాలనలో సాధించిన అద్భుత విజయాలను, అభివృద్ధి కార్యక్రమాలను ప్రతి గడపకూ తీసుకెళ్లాలని, ప్రజల్లో విస్తృతంగా అవగాహన కల్పించాలని స్థానికులను ఆయన కోరారు. ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వ విజయాలు, పథకాలతో కూడిన ప్రత్యేక పుస్తకాలను (బుక్లెట్స్) రేకొండ పాఠశాల ప్రధానోపాధ్యాయుడికి మంత్రి బండి సంజయ్ అందజేశారు.








