Mahaa Daily Exclusive

  ప్రపంచ వేదికపై భారత్ తిరుగులేని శక్తి…

Share

ప్రపంచ వేదికపై భారత్ తిరుగులేని శక్తి.
* 12 ఏళ్ల మోదీ పాలనపై ప్రశంసల జల్లు.
* సికింద్రాబాద్‌లో ఘనంగా ‘మేధావుల సమ్మేళనం’.
* ముఖ్య అతిథిగా పాల్గొన్న కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్.
* 2047 నాటికి ‘వికసిత్ భారత్’ లక్ష్య సాధనే ధ్యేయం.
హైదరాబాద్, మహా
గత 12 ఏళ్ల ప్రధాని నరేంద్ర మోదీ సుపరిపాలనలో భారతదేశం అంతర్జాతీయ వేదికలపై తిరుగులేని గౌరవాన్ని, శక్తివంతమైన గుర్తింపును సాధించిందని కేంద్ర రక్షణ శాఖ మంత్రి శ్రీ రాజ్‌నాథ్ సింగ్ కొనియాడారు. శుక్రవారం సికింద్రాబాద్‌లో నిర్వహించిన ‘మేధావుల సమ్మేళనం’లో ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. “12 ఏళ్ల సుపరిపాలన – అభివృద్ధి – ప్రజా సంక్షేమం” అనే అంశంపై జరిగిన ఈ సదస్సులో ఆయన మాట్లాడుతూ, దేశంలో అంతర్జాతీయంగా భారతదేశం సాధించిన అపూర్వ ప్రగతిని వివరించారు. తన ప్రసంగం ప్రారంభంలో, హైదరాబాద్‌ను భారతదేశంలో అంతర్భాగంగా మార్చి, దేశ ఐక్యతను, సమగ్రతను కాపాడటంలో ఉక్కుమనిషి సర్దార్ వల్లభభాయ్ పటేల్ గారు చేసిన అసాధారణమైన కృషిని ఆయన స్మరించుకుని ఘన నివాళులు అర్పించారు.
రాజకీయాల్లో నాయకుడికి లేదా పార్టీకి అతిపెద్ద పెట్టుబడి ‘విశ్వసనీయత’ అని, చెప్పేదానికి చేసేదానికి తేడా ఉన్నప్పుడు విశ్వసనీయత సంక్షోభం ఏర్పడుతుందని శ్రీ రాజ్‌నాథ్ సింగ్ అభిప్రాయపడ్డారు. కాంగ్రెస్ హయాంలో ఈ సంక్షోభం ఉండేదని, కానీ బీజేపీ ఇచ్చిన ప్రతి మాటను నిలబెట్టుకుంటూ ప్రజల్లో నమ్మకాన్ని పెంచిందని ఆయన చెప్పారు. ఒక నమ్మకమైన నాయకుడికి ఉండాల్సిన పారదర్శకత, నిజాయితీ, పని చేసే సామర్థ్యం, ఇచ్చిన హామీలను ఫలితాలుగా మార్చే నైపుణ్యం వంటి గుణాలు ప్రధాని మోదీ గారిలో సంపూర్ణంగా ఉన్నాయని ఆయన స్పష్టం చేశారు.
ప్రధాని మోదీ గారు బాధ్యతలు చేపట్టిన కొత్తలోనే, మంత్రి అయినా, సామాన్యుడైనా ఎవరైనా సరే అవినీతిని సహించేది లేదని స్పష్టం చేశారని గుర్తుచేశారు. గత కాంగ్రెస్ పాలనలో జరిగిన 2G, కామన్వెల్త్, ఆగస్టా వెస్ట్‌ల్యాండ్ వంటి లక్షల కోట్ల అవినీతి వల్ల దేశ ప్రతిష్ట మసకబారిందని ఆయన విమర్శించారు. తాము అధికారంలోకి వచ్చాక రక్షణ బడ్జెట్‌ను రూ. 2.5 లక్షల కోట్ల నుండి దాదాపు రూ. 8 లక్షల కోట్లకు పెంచామని, రక్షణ రంగానికి కేటాయించే ప్రతి పైసా అత్యంత పారదర్శకంగా, దేశ భద్రత కోసమే ఖర్చవుతోందని రక్షణ మంత్రిగా ఆయన హామీ ఇచ్చారు.
అయోధ్యలో భవ్య రామమందిర నిర్మాణాన్ని పూర్తి చేసి, అక్రమ చొరబాటుదారులను సరిహద్దుల వెలుపలికి పంపే ప్రక్రియను బీజేపీ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో వేగవంతం చేశామని చెప్పారు. ముస్లిం మహిళల జీవితాల్లో శాపంగా మారిన ‘తీన్ తలాక్’ సామాజిక దురాచారాన్ని చట్టబద్ధంగా రద్దు చేశామని, వక్ఫ్ చట్టాల్లో సంస్కరణలు తీసుకువచ్చామని తెలిపారు. కొత్త పార్లమెంట్ భవనంలో చట్టసభల్లో మహిళలకు 33% రిజర్వేషన్ కల్పించే చారిత్రక బిల్లును తీసుకువచ్చామని, ఇది మోదీ ప్రభుత్వ గ్యారెంటీ అని స్పష్టం చేశారు. దేశంలో సమయం, వృధా ఖర్చులను తగ్గించడానికి లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికలను ఒకేసారి నిర్వహించాలని తమ ప్రభుత్వం యోచిస్తోందని ఆయన తెలిపారు. జమ్మూ కాశ్మీర్‌లో ఆర్టికల్ 370ని రద్దు చేసి, “ఒకే దేశంలో రెండు రాజ్యాంగాలు, ఇద్దరు ప్రధానులు, రెండు జెండాలు చెల్లవు” అన్న పండిత్ శ్యామాప్రసాద్ ముఖర్జీ కలని నిజం చేశామని పేర్కొన్నారు.
కోవిడ్ సంక్షోభ సమయంలో ‘వ్యాక్సిన్ మైత్రి’ ద్వారా 100కు పైగా దేశాలకు 30 కోట్లకు పైగా వ్యాక్సిన్లను పంపిణీ చేసి, భారత్ ప్రపంచానికి ఆపద్బాంధవుడిగా, విశ్వబంధువుగా నిలిచిందని మంత్రి చెప్పారు. ‘మేక్ ఇన్ ఇండియా’ ద్వారా సూది నుండి ఓడల వరకు, మొబైల్స్ నుండి మిసైల్స్ వరకు అన్నీ భారత్ గడ్డపైనే తయారవుతున్నాయని, రక్షణ రంగ ఎగుమతులు గతంలో రూ. 1000 కోట్లుగా ఉంటే, నేడు దాదాపు రూ. 39,000 కోట్లకు చేరాయని సగర్వంగా ప్రకటించారు. తెలంగాణ అభివృద్ధి విషయంలో తమ ప్రభుత్వం ఎన్నడూ వివక్ష చూపలేదని, గతంలో ఉమ్మడి రాష్ట్రంలో రూ. 1000 కోట్ల కంటే తక్కువగా ఉన్న రైల్వే బడ్జెట్, నేడు కేవలం తెలంగాణ కోసమే దాదాపు రూ. 5,000 నుండి రూ. 5,500 కోట్లకు పెంచామని స్పష్టం చేశారు. రాష్ట్రంలో రూ. 32,000 కోట్ల విలువైన రైల్వే ప్రాజెక్టులు, పీఎం మిత్రా టెక్స్ టైల్ పార్క్ వంటి ప్రాజెక్టులతో తెలంగాణలో భారీగా ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. చివరగా, దేశాన్ని మరింత శక్తివంతంగా మార్చేందుకు, వికసిత భారత్ నిర్మాణంలో మోదీ గారి నాయకత్వానికి తెలంగాణ ప్రజల సంపూర్ణ ఆశీస్సులు ఉండాలని కోరారు.