- సాలార్ జంగ్ మ్యూజియం 75వ ప్లాటినం జూబ్లీ వేడుకల్లో
- అలరించిన గజల్ సంగీత విభావరి
- సంగీతాభిమానులను అలరించిన లలిత ఆనంద్ గజల్ సంగీత విభావరి
హైదరాబాద్, మహా: సాలార్ జంగ్ మ్యూజియం 75వ ప్లాటినం జూబ్లీ వేడుకల సందర్భంగా కేంద్ర ప్రభుత్వ సాంస్కృతిక మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో సాలార్ జంగ్ మ్యూజియం ప్రాంగణంలో ప్రత్యేక సాంస్కృతిక కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. భారతీయ శాస్త్రీయ సంగీతం, గజల్ సాహిత్యం, సాంస్కృతిక వారసత్వాన్ని ప్రతిబింబించే ఈ కార్యక్రమం ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. ఈ సందర్భంగా ప్రముఖ గాయని లలిత ఆనంద్ గజల్ సంగీత విభావరిని నిర్వహించి తన మధుర గానంతో సంగీతాభిమానులను మంత్రముగ్ధులను చేశారు. ఆమె ఆలపించిన గజల్స్ సభికుల నుంచి విశేష ఆదరణ పొందాయి.
కార్యక్రమంలో భాగంగా లలిత ఆనంద్ “రంజిష్ హీ సహీ” (రాగ్ యమన్), “ఏ కుచ్ అబ్ర్” (రాగ్ బిలావల్), “ఖాతిల్ తే ఐత్బార్” (రాగ్ భూపాలి), “ఝుకీ ఝుకీ సీ నజర్” (రాగ్ కాఫీ), “ఆజ్ జానే కీ జిద్ నా కరో” (రాగ్ యమన్) వంటి ప్రసిద్ధ గజల్స్‌ను ఆలపించారు. ఆమె గానంలో శాస్త్రీయ సంగీత మాధుర్యం, గజల్ సాహిత్యంలోని భావాన్ని , రాగాల సౌందర్యం సమ్మిళితమై ప్రేక్షకులను సంగీతానుభూతిలో ముంచెత్తాయి. ఈ గజల్ సంగీత కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో సంగీత ప్రేమికులు, కళాభిమానులు, సాహిత్యాభిమానులు హాజరై ప్రతి గీతాన్ని ఆస్వాదించారు. గాయని లలిత ఆనంద్ అద్భుత గాన ప్రదర్శనకు ప్రేక్షకులు పలుమార్లు కరతాళ ధ్వనులతో అభినందనలు తెలియజేశారు.
సాలార్ జంగ్ మ్యూజియం 75 సంవత్సరాల సాంస్కృతిక, చారిత్రక వారసత్వాన్ని పురస్కరించుకొని నిర్వహిస్తున్న ప్లాటినం జూబ్లీ వేడుకల్లో భాగంగా ఏర్పాటు చేసిన ఈ సంగీత కార్యక్రమం భారతీయ సంగీత సంప్రదాయాల వైభవాన్ని ప్రతిబింబించిందని నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమానికి డీజీపీ సి.వి. ఆనంద్ తో పాటుగా ముఖ్య అతిథిగా రాష్ట్ర బి సి, రోడ్డు రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, మాజిద్ హుస్సేన్ ఎమ్మెల్యే, మీర్జా రహమత్ ఎమ్మెల్సీ, ఇతర ప్రముఖులు, ఉన్నతాధికారులు, కళా మరియు సాహిత్య రంగాలకు చెందిన ప్రముఖులు హాజరయ్యారు.
ఈ సందర్భంగా అతిథులు సాలార్ జంగ్ మ్యూజియం భారతదేశ సాంస్కృతిక వారసత్వానికి ప్రతీకగా నిలుస్తోందని, ఇటువంటి సాంస్కృతిక కార్యక్రమాలు సంగీతం, కళలు మరియు సాహిత్య పరిరక్షణకు దోహదపడటమే కాకుండా యువతలో సాంస్కృతిక చైతన్యాన్ని పెంపొందిస్తాయని అభిప్రాయపడ్డారు. కార్యక్రమం ముగింపులో నిర్వాహకులు కళాకారులను సత్కరించి, పాల్గొన్న అతిథులు మరియు ప్రేక్షకులకు కృతజ్ఞతలు తెలిపారు.








