Mahaa Daily Exclusive

  రాయదుర్గం భూముల వేలంపై హైకోర్టు స్టే…

Share

  • రాయదుర్గం భూముల వేలంపై హైకోర్టు స్టే
  • ఎస్‌బీఐ పిటిషన్‌ ను విచారించిన కోర్టు
  • టీజీఐఐసీకి, గౌర వెంచర్స్ కు నోటీసులు

హైదరాబాద్‌: రాయదుర్గంలోని టీజీఐఐసీ భూముల వేలంపై హైకోర్టు స్టే ఇచ్చింది. సర్వే నంబర్‌ 83/1లో ఇటీవల నిర్వహించిన భూముల వేలంపై 3 వారాలు స్టే విధించింది. దీనిపై కౌంటర్‌ దాఖలు చేయాలని ఎస్‌బీఐ, టీజీఐఐసీ, గౌర వెంచర్స్‌కు నోటీసులు జారీ చేసింది. రాయదుర్గంలోని పన్మక్తలో టీజీఐఐసీ జరిపిన భూముల వేలంపై ఇటీవల ఎస్‌బీఐ హైకోర్టును ఆశ్రయించింది. ఆ భూములు తమవేనంటూ పిటిషన్‌ దాఖలు చేసింది. దీంతో విచారణ చేపట్టిన ఉన్నత న్యాయస్థానం వేలంపై స్టే విధించింది. ఇటీవల జరిగిన వేలంలో అక్కడ ఎకరం రూ.237 కోట్లు పలికిన సంగతి తెలిసందే. సర్వే నం.83/1లో ఐదు ఎకరాల భూమిపై హక్కులు కోరుతూ ఎస్‌బీఐ హైకోర్టును ఆశ్రయించింది. మే 6న జారీ చేసిన వేలం నోటిఫికేషన్‌తోపాటు తదనంతరం జరిగిన భూ విక్రయాన్ని, తమ వినతిపత్రాన్ని తిరస్కరిస్తూ మే 20న జారీ చేసిన ప్రొసీడింగ్స్‌ను సవాల్‌ చేస్తూ ఎస్‌బీఐ రెండు వేర్వేరు పిటిషన్లు దాఖలు చేసింది. రాయదుర్గంలో ఎస్‌బీహెచ్‌కు 2010లో ఐదెకరాల భూమిని ప్రభుత్వం కేటాయించగా ఇందుకోసం రూ. 13.33 కోట్లను చెల్లించింది. ఎస్‌బీఐలో ఎస్‌బీహెచ్‌ విలీనం కాగా, గతంలో ఈ స్థలంలో ఉన్న రెండు ఏటీఎంలను ఎస్‌బీఐ నిర్వహిస్తోంది. 2020లో గత ప్రభుత్వం భూకేటాయింపును రద్దు చేయగా ఎస్‌బీఐ హైకోర్టును ఆశ్రయించింది. కేటాయింపు ఉత్తర్వులను రద్దు చేస్తూ.. ఎస్‌బీఐ అభ్యర్థనను పునఃపరిశీలించాలని హైకోర్టు ఆదేశించింది. అనంతరం 2024లో ప్రస్తుత ప్రభుత్వం కూడా ఈ కేటాయింపును రద్దు చేయడంతో ఎస్‌బీఐ మరోసారి హైకోర్టును ఆశ్రయించింది.