Mahaa Daily Exclusive

  రక్షకుడే భక్షకుడయ్యాడా..?

Share

రక్షకుడే భక్షకుడయ్యాడా..?
* కృష్ణలంక సీఐ వేధింపులకు యువకుడి బలి.
* సీఐ నాగరాజు దెబ్బలు తాళలేక శ్రీకాంత్ ఆత్మహత్య .
* పురుగుల మందు తాగి ప్రాణత్యాగం.
* మూడు నెలలుగా తీవ్రంగా కొడుతున్నారంటూ ఆవేదన.
* ఆత్మహత్యకు ముందు సెల్ఫీ వీడియోలో సంచలన ఆరోపణలు.
కృష్ణలంక,మహా.
సామాన్యులకు రక్షణ కల్పించాల్సిన ఓ పోలీస్ అధికారి ఉన్మాదిగా మారాడా అన్న విమర్శలు తీవ్రస్థాయిలో వ్యక్తమవుతున్నాయి. కృష్ణలంక సర్కిల్ ఇన్‌స్పెక్టర్ (సీఐ) నాగరాజు వేధింపులు, భౌతిక దాడులు తాళలేక శ్రీకాంత్ అనే యువకుడు పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్న ఘటన స్థానికంగా కలకలం రేపుతోంది.
మృతుడు శ్రీకాంత్ ఆత్మహత్యకు ముందు తీసుకున్న ఒక సెల్ఫీ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో సంచలనంగా మారింది. గత కొన్నాళ్లుగా కృష్ణలంక సీఐ తనను విపరీతంగా వేధిస్తున్నారని శ్రీకాంత్ ఆ వీడియోలో తీవ్ర ఆవేదన వ్యక్తం చేశాడు. ముఖ్యంగా గత మూడు నెలల నుంచి సీఐ నాగరాజు తనను అత్యంత దారుణంగా కొడుతూ చిత్రహింసలకు గురిచేస్తున్నారని వాపోయాడు. సీఐ కొట్టే దెబ్బలు ఇక భరించలేకపోతున్నానని, ఆ బాధను తట్టుకోలేకే తాను ప్రాణాలు తీసుకుంటున్నట్లు సెల్ఫీ వీడియోలో స్పష్టం చేశాడు. అనంతరం తీవ్ర మనస్తాపానికి గురైన శ్రీకాంత్, పురుగుల మందు తాగి బలవన్మరణానికి పాల్పడ్డాడు.
ఈ ఘటనతో కృష్ణలంక పోలీసుల తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సీఐ వేధింపుల వల్లే శ్రీకాంత్ ప్రాణాలు కోల్పోయాడని, ఒక యువకుడి ఉసురు తీసుకున్నారని పలువురు ఆరోపిస్తున్నారు. చనిపోయే ముందు శ్రీకాంత్ స్వయంగా రికార్డ్ చేసిన సెల్ఫీ వీడియో సాక్ష్యంగా ఉన్నతాధికారులు తక్షణమే స్పందించి, విచారణ జరిపి సదరు సీఐపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.