Mahaa Daily Exclusive

  బ్రిటన్ రాజకీయాల్లో పెను సంచలనం…

Share

బ్రిటన్ రాజకీయాల్లో పెను సంచలనం.
* ప్రధాని పదవికి కీర్ స్టార్మర్ రాజీనామా!
* లేబర్ పార్టీ పగ్గాలను సైతం వదులుకున్న వైనం.
* ఇచ్చిన హామీలు నిలబెట్టుకోవడంలో వైఫల్యమే ప్రధాన కారణం.
* సొంత పార్టీ నుంచే తీవ్ర స్థాయికి చేరిన ఒత్తిళ్లు.
* తెరపైకి మరో సీనియర్ నేత ఆండీ బర్న్‌హామ్ పేరు.
ఢిల్లీ, మహా.
యునైటెడ్ కింగ్‌డమ్ (యూకే) రాజకీయాల్లో ఊహించని కీలక పరిణామం చోటుచేసుకుంది. బ్రిటన్ ప్రధానమంత్రి కీర్ స్టార్మర్ తన పదవికి అనూహ్యంగా రాజీనామా చేశారు. కేవలం ప్రధాని పదవికే కాకుండా అధికార లేబర్ పార్టీ నాయకత్వ బాధ్యతల నుంచి కూడా తాను పూర్తిగా తప్పుకుంటున్నట్లు ఆయన అధికారికంగా ప్రకటించారు. పాలనలో ఆయన తీరుపై సొంత పార్టీ నుంచే తీవ్ర స్థాయిలో ఒత్తిడి, అసమ్మతి పెరగడంతోనే కీర్ స్టార్మర్ ఈ సంచలన నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
లేబర్ పార్టీలో కొంతకాలంగా స్టార్మర్ నాయకత్వంపై తీవ్ర అసంతృప్తి రాజుకుంటోంది. ఆయన సారథ్యంలో ప్రభుత్వానికి ప్రజల్లో ఆదరణ నానాటికీ పడిపోతోందన్న ఆందోళన పార్టీ శ్రేణుల్లో తీవ్రంగా నెలకొంది. ప్రజా సేవలను మరింత మెరుగుపరుస్తామని, సామాన్యుల జీవన వ్యయాలను తగ్గిస్తామని హామీలు ఇచ్చి 2024లో కీర్ స్టార్మర్ ప్రధాని పీఠం అధిష్టించారు. దేశ ఆర్థికాభివృద్ధిని పరుగులు పెట్టిస్తానని ప్రజలకు ఎన్నో ప్రగల్భాలు పలికారు. కానీ, ఆచరణలో ఆశించిన స్థాయిలో ఫలితాలు రాకపోవడం, ప్రజల కష్టాలు తీరకపోవడంతో ప్రభుత్వంపై విముఖత తీవ్రమవుతోందని లేబర్ పార్టీ నేతలు ఆందోళన చెందుతున్నారు.
సరిగ్గా ఇలాంటి విపత్కర పరిస్థితుల్లోనే లేబర్ పార్టీకి చెందిన మరో సీనియర్ నేత ఆండీ బర్న్‌హామ్ రూపంలో స్టార్మర్ నాయకత్వానికి బలమైన సవాలు ఎదురైంది. గతంలో గ్రేటర్ మాంచెస్టర్ మేయర్‌గా బాధ్యతలు నిర్వర్తించిన ఆయన.. ఇటీవల కాలంలో కీర్ స్టార్మర్ విధానాలపై బహిరంగంగానే తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు. కొద్దిరోజుల క్రితం జరిగిన ఎంపీ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన ఆండీ బర్న్‌హామ్.. స్టార్మర్‌కు సవాలు విసురుతూ పార్లమెంటులో అడుగుపెట్టేందుకు సిద్ధమయ్యారు. ఈ పరిణామాల నేపథ్యంలోనే స్టార్మర్ తప్పుకోవాలన్న ఒత్తిడి పార్టీలో తారాస్థాయికి చేరడంతో ఆయన రాజీనామా చేసినట్లు అంతర్జాతీయ మీడియా కోడై కూస్తోంది.
ప్రస్తుతం యూకేలో అధికార లేబర్ పార్టీతో పాటు ప్రతిపక్ష కన్జర్వేటివ్ పార్టీపై కూడా ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోందని స్థానిక పత్రికలు విశ్లేషిస్తున్నాయి. ఈ రెండు ప్రధాన పార్టీలపై విసుగు చెందిన బ్రిటన్ ప్రజలు.. ప్రత్యామ్నాయాల వైపు చూస్తున్నారు. ఈ క్రమంలోనే రైజింగ్ రీఫార్మ్ పార్టీ, గ్రీన్ పార్టీ వంటి వాటికి ప్రజాదరణ అంతకంతకూ పెరుగుతోంది. ఈ ప్రమాదకర పరిస్థితులను పసిగట్టిన అధికార లేబర్ పార్టీ.. తమ ఉనికిని, పట్టును నిలుపుకునేందుకు తక్షణ దిద్దుబాటు చర్యలకు ఉపక్రమించింది. ఇందులో భాగంగానే ప్రధాని పదవి నుంచి కీర్ స్టార్మర్‌ను తప్పించక తప్పలేదని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.