Mahaa Daily Exclusive

  ఇంగ్లాండ్‌లో వైభవ్‌కు డ్రెస్సింగ్ రూమ్ దూరం!

Share

ఇంగ్లాండ్‌లో వైభవ్‌కు డ్రెస్సింగ్ రూమ్ దూరం!
* నిబంధనల వల్లే 15 ఏళ్ల యువ క్రికెటర్‌కు ప్రత్యేక గది.
* ఈసీబీ నిబంధనలపై చర్చించనున్న బీసీసీఐ.
హైదరాబాద్, మహా.
టీమిండియా యువ సంచలనం, పదిహేనేళ్ల వయసులోనే జాతీయ జట్టుకు ఎంపికైన వైభవ్ సూర్యవంశీకి ఇంగ్లాండ్ పర్యటనలో ఒక విచిత్రమైన పరిస్థితి ఎదురుకానుంది. ఐర్లాండ్, ఇంగ్లాండ్ టీ20 సిరీస్‌ల కోసం ఎంపికైన వైభవ్.. ఇప్పటికే జట్టుతో కలిసి పయనమయ్యాడు. చిన్న వయసు కావడంతో బీసీసీఐ ప్రత్యేక అనుమతితో అతడి వెంట తల్లిదండ్రులు కూడా ప్రయాణించారు. అయితే, జులై 1 నుంచి ప్రారంభమయ్యే ఇంగ్లాండ్ పర్యటనలో వైభవ్‌కు భారత జట్టు ప్రధాన డ్రెస్సింగ్ రూమ్‌ను వినియోగించుకునే అవకాశం లేకుండా పోతుందని క్రికెట్ వర్గాలు వెల్లడించాయి. ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు (ఈసీబీ), ఐసీసీ నిర్దేశించిన కఠినమైన వయో నిబంధనలే ఇందుకు కారణమని తెలుస్తోంది.
ఐసీసీ భద్రతా నిబంధనల ప్రకారం 16 ఏళ్లలోపు వయసున్న ఆటగాళ్లు పెద్దలు ఉండే డ్రెస్సింగ్ రూమ్‌లను వాడేందుకు అనుమతి లేదు. ఇది ఐసీసీ నిబంధనల పరిధిలో జరిగే ఈవెంట్ కావడంతో ఆ భద్రతా విధానాలు కచ్చితంగా అమల్లో ఉంటాయని, అందుకే సూర్యవంశీకి ప్రత్యేకంగా ఒక గదిని కేటాయించనున్నామని ఇంగ్లాండ్ బోర్డు వర్గాలు స్పష్టం చేశాయి. మ్యాచ్ జరుగుతున్న సమయంలో మాత్రమే వైభవ్‌ భారత డ్రెస్సింగ్ రూమ్‌లోకి వెళ్లేందుకు అనుమతి ఉంటుంది. కానీ, మ్యాచ్‌కు ముందు మరియు మ్యాచ్ ముగిసిన తర్వాత దుస్తులు మార్చుకోవడానికి (ఛేంజింగ్ కోసం) మాత్రం ప్రధాన డ్రెస్సింగ్ రూమ్‌ను ఉపయోగించడానికి అనుమతి ఉండదని అధికారులు తేల్చి చెప్పారు.
వైభవ్‌ కోసం కేటాయించే ప్రత్యేక గదితో పాటు అతని వెంట వచ్చిన తల్లిదండ్రులకు కూడా ప్రతి మ్యాచ్ వేదిక వద్ద తగిన వసతి సదుపాయాలు కల్పిస్తామని ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు ప్రతినిధులు వెల్లడించారు. అయితే, ఈ అసాధారణ పరిస్థితి దృష్ట్యా పదిహేనేళ్ల వైభవ్ ఏమాత్రం ఇబ్బంది పడకుండా ఉండేందుకు బీసీసీఐ అధికారులు త్వరలోనే ఇంగ్లాండ్ బోర్డు ప్రతినిధులతో ప్రత్యేకంగా చర్చలు జరిపే అవకాశం ఉన్నట్లు సమాచారం.