మహిళా క్రీడల్లో ట్రాన్స్‌జెండర్లకు నో ఎంట్రీ.
*నిషేధాన్ని సమర్థించిన అమెరికా సుప్రీంకోర్టు.
*రిపబ్లికన్ పాలిత రాష్ట్రాలకు భారీ ఊరట.
ఢిల్లీ, మహా
అమెరికాలో సుదీర్ఘకాలంగా రగులుతున్న క్రీడా, సాంస్కృతిక వివాదానికి ఆ దేశ అత్యున్నత న్యాయస్థానం ఎట్టకేలకు ముగింపు పలికింది. ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలల్లో నిర్వహించే మహిళల, బాలికల క్రీడా పోటీల్లో ట్రాన్స్‌జెండర్ అథ్లెట్లు పాల్గొనకుండా వివిధ రాష్ట్రాలు విధించిన నిషేధాన్ని సుప్రీంకోర్టు గట్టిగా సమర్థించింది. సర్వోన్నత న్యాయస్థానం వెలువరించిన ఈ సంచలన తీర్పుతో రిపబ్లికన్ల ప్రాబల్యం ఉన్న ఐడహో, వెస్ట్ వర్జీనియాతో పాటు మరో రెండు డజన్లకు పైగా రాష్ట్రాలకు భారీ ఊరట లభించినట్లయింది.
సుప్రీంకోర్టు తాజా తీర్పుతో ఇకపై ఆయా రాష్ట్రాల్లోని విద్యాసంస్థల్లో విద్యార్థులు తమ ‘లింగ గుర్తింపు’ (జెండర్ ఐడెంటిటీ) ఆధారంగా కాకుండా, పుట్టినప్పుడు అధికారికంగా నమోదైన లింగ నిర్ధారణ ఆధారంగానే క్రీడా పోటీల్లో బరిలోకి దిగాల్సి ఉంటుంది. అంటే, పుట్టుకతో అబ్బాయిలైనప్పటికీ.. ఆ తర్వాత లింగమార్పిడి ద్వారా అమ్మాయిలుగా మారిన ట్రాన్స్‌జెండర్లు ఇకపై మహిళల క్రీడా విభాగాల్లో పోటీ పడేందుకు ఎలాంటి అవకాశమూ ఉండదు. ఈ తరహా నిబంధనను స్థానిక కన్జర్వేటివ్ వర్గాలు మొదటి నుంచి బలంగా సమర్థిస్తూ వస్తున్నాయి. పురుషులకు సహజంగా ఉండే శారీరక దారుఢ్యం కలిగిన వారు మహిళల విభాగంలో పోటీ పడటం వల్ల, అసలైన మహిళా అథ్లెట్లకు తీవ్ర అన్యాయం జరుగుతోందన్న వారి వాదనతో కోర్టు ఏకీభవించడం గమనార్హం.
గత ఏడాది మైనర్లకు అందించే లింగ మార్పిడి చికిత్సలపై టెన్నెస్సీ రాష్ట్రం విధించిన నిషేధాన్ని కూడా సుప్రీంకోర్టు సమర్థించిన విషయం విదితమే. కాగా, తాజా తీర్పు అమెరికా వ్యాప్తంగా క్రీడా, రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఒకవైపు మానవ హక్కుల సంఘాలు ఈ తీర్పుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తూ వ్యతిరేకిస్తుండగా.. క్రీడల్లో వాస్తవ సమానత్వాన్ని, న్యాయాన్ని సాధించడంలో ఇది ఒక చారిత్రాత్మక విజయమని రిపబ్లికన్ పాలిత రాష్ట్రాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి.








