Mahaa Daily Exclusive

  షేక్ హసీనా వార్తలపై బంగ్లాదేశ్ ప్రభుత్వం నిషేధం…

Share

• ప్రసంగాలు ప్రసారం చేయొద్దని మీడియాకు ఆదేశాలు.

ఢాకా,మహా.

బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనాకు మరో ఎదురుదెబ్బ తగిలింది. ఆమెకు సంబంధించిన వార్తలు, ప్రకటనలు, ఇంటర్వ్యూలు, ప్రసంగాలు లేదా ఇతర వ్యాఖ్యలను ప్రచురించడం, ప్రసారం చేయకుండా అన్ని ప్రింట్, ఎలక్ట్రానిక్, ఆన్‌లైన్ మీడియా సంస్థలతో పాటు సామాజిక మాధ్యమ వేదికలకు కూడా బంగ్లాదేశ్ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఈ నిర్ణయం న్యాయస్థానం ఇచ్చిన ఆదేశాల అమలులో భాగంగానే తీసుకున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది.

 

ఈ మేరకు బంగ్లాదేశ్ సమాచార, ప్రసార శాఖ సలహాదారు డాక్టర్ జాహెద్ ఉర్ రహ్మాన్ మీడియాతో మాట్లాడుతూ, కొందరు మీడియా సంస్థలు న్యాయస్థానం విధించిన నిషేధాన్ని పాటించడం లేదని ప్రభుత్వం గుర్తించిందన్నారు. దీంతో అన్ని మీడియా సంస్థలు కోర్టు ఆదేశాలను తప్పనిసరిగా అమలు చేయాలని స్పష్టమైన సూచనలు జారీ చేసినట్లు తెలిపారు.

 

ఇటీవల షేక్ హసీనా అంతర్జాతీయ వార్తా సంస్థ రాయిటర్స్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూను బంగ్లాదేశ్‌లోని కొన్ని మీడియా సంస్థలు ప్రచురించడం వివాదానికి దారితీసింది. ఈ పరిణామం తర్వాత ప్రభుత్వం తాజా ఆదేశాలను జారీ చేయడంతో దేశంలో ఈ అంశం మరోసారి చర్చనీయాంశంగా మారింది.

 

2024లో జరిగిన రాజకీయ పరిణామాల అనంతరం షేక్ హసీనా అధికారాన్ని కోల్పోయి బంగ్లాదేశ్‌ను వీడిన విషయం తెలిసిందే. అనంతరం ఆమె భారత్‌లో ఆశ్రయం పొందారు. ప్రస్తుతం ఆమెపై బంగ్లాదేశ్‌లో పలు కేసులు నమోదై ఉండగా, ప్రభుత్వం ఆమెను “పరారీలో ఉన్న మాజీ ప్రధాని”గా పేర్కొంటోంది.

 

ఇటీవల షేక్ హసీనా ఈ ఏడాది డిసెంబరులో బంగ్లాదేశ్‌కు తిరిగి వెళ్లి అధికారుల ఎదుట లొంగిపోతానని ప్రకటించారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం మీడియాపై విధించిన తాజా ఆంక్షలు దేశంలో భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ, మీడియా స్వాతంత్ర్యంపై కొత్త చర్చకు దారితీశాయి. ప్రభుత్వం మాత్రం ఇది పూర్తిగా న్యాయస్థానం ఆదేశాల అమలులో భాగమేనని స్పష్టం చేస్తుండగా, ప్రతిపక్ష వర్గాలు, మీడియా స్వేచ్ఛకు మద్దతు తెలిపే వర్గాలు ఈ నిర్ణయంపై ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి.