Mahaa Daily Exclusive

  2027 ఆగస్టు 15 నుంచి దేశంలో తొలి బుల్లెట్ ట్రైన్…

Share

• సూరత్–బిలిమోరా మార్గంలో తొలి హైస్పీడ్ సర్వీస్.

• హైదరాబాద్‌కు మూడు కొత్త కారిడార్లు.

ఢిల్లీ, మహా.

భారత రైల్వే చరిత్రలో కొత్త అధ్యాయానికి తెరలేవనుంది. దేశంలో తొలి బుల్లెట్ ట్రైన్ సేవలను 2027 ఆగస్టు 15 నుంచి ప్రారంభించనున్నట్లు కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ ప్రకటించారు. ముంబై–అహ్మదాబాద్ హైస్పీడ్ రైలు కారిడార్‌లో భాగంగా సూరత్–బిలిమోరా మధ్య తొలి సర్వీసును అందుబాటులోకి తీసుకురానున్నట్లు వెల్లడించారు. దేశంలోనే తొలి హైస్పీడ్ రైలు మార్గంగా ఈ సెక్షన్ నిలవనుందని తెలిపారు.

 

మొత్తం 508 కిలోమీటర్ల పొడవున్న ముంబై–అహ్మదాబాద్ బుల్లెట్ ట్రైన్ కారిడార్‌ను దశలవారీగా ప్రారంభించనున్నట్లు మంత్రి వివరించారు. తొలి దశలో సూరత్–బిలిమోరా మార్గం అందుబాటులోకి రానుండగా, అనంతరం వాపి–సూరత్, వాపి–అహ్మదాబాద్, థానే–అహ్మదాబాద్ మార్గాలను వరుసగా ప్రారంభించి, చివరగా పూర్తి స్థాయిలో ముంబై–అహ్మదాబాద్ కారిడార్‌ను ప్రారంభించనున్నట్లు తెలిపారు. ప్రస్తుతం ఈ ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టు పనులు దాదాపు 80 శాతం పూర్తయ్యాయని, నిర్ణీత గడువులోగా నిర్మాణాన్ని పూర్తి చేసేందుకు పనులు వేగంగా సాగుతున్నాయని చెప్పారు.

 

జపాన్ షింకాన్సెన్ సాంకేతికత ఆధారంగా రూపొందుతున్న ఈ హైస్పీడ్ రైలు గంటకు 320 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించనుంది. పూర్తి కారిడార్ అందుబాటులోకి వచ్చిన తర్వాత ముంబై–అహ్మదాబాద్ మధ్య ప్రయాణ సమయం గణనీయంగా తగ్గనుండటంతో పాటు పారిశ్రామిక, వాణిజ్య అభివృద్ధికి కూడా ఊతమివ్వనుందని అధికారులు భావిస్తున్నారు.

 

ఈ సందర్భంగా దేశవ్యాప్తంగా హైస్పీడ్ రైలు నెట్‌వర్క్ విస్తరణ ప్రణాళికలను కూడా అశ్విని వైష్ణవ్ వెల్లడించారు. హైదరాబాద్‌ను కేంద్రంగా చేసుకుని పుణె–హైదరాబాద్, హైదరాబాద్–చెన్నై, హైదరాబాద్–బెంగళూరు అనే మూడు కొత్త బుల్లెట్ ట్రైన్ కారిడార్లను ప్రతిపాదించినట్లు తెలిపారు. అదనంగా హైదరాబాద్–ముంబై హైస్పీడ్ రైలు అనుసంధానంపైనా ప్రణాళికలు రూపొందుతున్నాయని చెప్పారు. ఈ కారిడార్లు దక్షిణాది రాష్ట్రాల మధ్య వేగవంతమైన రైలు అనుసంధానానికి దోహదపడతాయని పేర్కొన్నారు.

 

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆధ్వర్యంలో హైదరాబాద్‌కు మూడు హైస్పీడ్ రైలు కారిడార్లు కేటాయించబడినట్లు అశ్విని వైష్ణవ్ తెలిపారు. ఈ ప్రాజెక్టులు తెలంగాణలోని పలు ప్రాంతాల మీదుగా ప్రయాణిస్తూ రాష్ట్ర రవాణా వ్యవస్థలో కీలక మార్పులకు దారితీస్తాయని చెప్పారు.

 

అదేవిధంగా, ‘నవ్ నిర్మాణ్’ కార్యక్రమంలో భాగంగా దేశవ్యాప్తంగా 261 రైల్వే స్టేషన్లను ఆధునిక సౌకర్యాలతో అభివృద్ధి చేస్తున్నట్లు మంత్రి వెల్లడించారు. తెలంగాణలో సికింద్రాబాద్, బేగంపేట్, హైటెక్ సిటీ వంటి కీలక రైల్వే స్టేషన్ల ఆధునికీకరణ పనులు వేగంగా కొనసాగుతున్నాయని తెలిపారు. ఈ ప్రాజెక్టుల ద్వారా ప్రయాణికులకు మరింత మెరుగైన సౌకర్యాలు అందుబాటులోకి రానున్నాయని చెప్పారు.