Mahaa Daily Exclusive

  తెలంగాణ రక్షణ సేనకు గుర్తింపు ఇవ్వాలి..! అభ్యంతరాల కాపీలు ఇవ్వకుండా సమాధానం ఎలా చెబుతాం? ఈసీని ప్రశ్నించిన కల్వకుంట్ల కవిత..

Share

హైదరాబాద్, మహా.

తెలంగాణ రక్షణ సేన పార్టీకి గుర్తింపు మంజూరు చేయాలని ఆ పార్టీ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత కేంద్ర ఎన్నికల కమిషన్‌ను కోరారు. ఢిల్లీ హైకోర్టు ఇటీవల ఇచ్చిన ఆదేశాల మేరకు కేంద్ర ఎన్నికల కమిషన్‌కు సమగ్ర వివరణను సమర్పించినట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. పార్టీ ప్రధాన కార్యదర్శి అనిల్ కుమార్ ఆదివారం ప్రధాన ఎన్నికల కమిషనర్‌తో పాటు ఎన్నికల కమిషనర్‌లకు లేఖ పంపి, పార్టీ పేరుకు సంబంధించిన అభ్యంతరాలపై తమ వాదనలను వివరించారు.

 

కేంద్ర ఎన్నికల కమిషన్ ఈ ఏడాది ఏప్రిల్ 28న పంపిన లేఖ ద్వారా “తెలంగాణ రక్షణ సేన” పేరును తమకు కేటాయించినట్లు తెలియజేసిందని లేఖలో పేర్కొన్నారు. ఆ అనుమతిని ఆధారంగా చేసుకుని తెలంగాణ వ్యాప్తంగా 105 అసెంబ్లీ నియోజకవర్గాల్లో పార్టీ జెండాల ఆవిష్కరణ, సంస్థాగత నిర్మాణం, సభ్యత్వ నమోదు, విస్తరణ కార్యక్రమాలు చేపట్టామని తెలిపారు. అనంతరం జూన్ 23న కమిషన్ నుంచి మరో లేఖ అందిందని, పార్టీ రిజిస్ట్రేషన్‌పై సుమారు వెయ్యి అభ్యంతరాలు వచ్చాయని అందులో పేర్కొన్నారని వివరించారు.

 

అయితే ఇప్పటివరకు ఆ అభ్యంతరాల కాపీలను తమకు అందజేయలేదని పార్టీ పేర్కొంది. అభ్యంతరాలు ఎవరు దాఖలు చేశారు, వాటిలో ఏమి పేర్కొన్నారు, ఏ ఆధారాలపై అభ్యంతరాలు వ్యక్తం చేశారనే వివరాలు ఇవ్వకుండా తమ నుంచి సమాధానం కోరడం సహజ న్యాయ సూత్రాలకు విరుద్ధమని అభిప్రాయపడింది. అభ్యంతరాల వివరాలే తెలియకపోతే సమర్థవంతమైన వివరణ ఎలా ఇవ్వగలమని ప్రశ్నించింది.

 

రాష్ట్ర జనాభా మూడున్నర కోట్లకు పైగా ఉండగా వెయ్యి అభ్యంతరాలు వచ్చాయనే కారణంతో పార్టీ పేరును తిరస్కరించడం సరైన విధానం కాదని లేఖలో పేర్కొన్నారు. కేవలం అభ్యంతరాల సంఖ్యను పరిగణనలోకి తీసుకోవడం కాకుండా వాటి చట్టపరమైన బలం, వాస్తవికత, ఉద్దేశాలను కూడా పరిశీలించాలని సూచించారు. ఎవరైనా ప్రణాళికాబద్ధంగా సమూహాలుగా ఏర్పడి అభ్యంతరాలు దాఖలు చేశారా అనే అంశం కూడా అభ్యంతరాల కాపీలు అందిన తర్వాతే స్పష్టమవుతుందని పేర్కొన్నారు.

 

కేంద్ర ఎన్నికల కమిషన్ ఆమోదించిన పేరును విశ్వసించి ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా పార్టీ నిర్మాణ కార్యక్రమాలు చేపట్టామని, ఇప్పుడు అదే పేరును మార్చుకోవాలని సూచించడం వల్ల పార్టీకి తీవ్ర నష్టం, అన్యాయం జరుగుతుందని కవిత వాదించారు. ఢిల్లీ హైకోర్టు సూచించినట్లుగా వ్యక్తిగత విచారణకు హాజరయ్యే ముందు తమ పార్టీపై వచ్చిన అన్ని అభ్యంతరాల కాపీలను, వాటికి సంబంధించిన ఆధారాలను అందించాలని కోరారు. పూర్తి వివరాలు అందిన తర్వాతే తమ వాదనలను సమగ్రంగా వినిపించే అవకాశం ఉంటుందని తెలిపారు.

 

“తెలంగాణ రక్షణ సేన” అనే పేరును పూర్తిగా స్వతంత్రంగా, సదుద్దేశంతో ఎంపిక చేశామని లేఖలో వివరించారు. ఈ పేరుతో దేశంలో మరే రాజకీయ పార్టీ నమోదు కాలేదని, గుర్తింపు పొందిన లేదా నమోదైన ఏ పార్టీ పేరును కూడా ఇది పోలి ఉండదని పేర్కొన్నారు. పార్టీ పేర్లను పరిశీలించే సమయంలో మొత్తం పేరును ఒక సమగ్ర రూపంగా చూడాలే తప్ప అందులోని విడి పదాలను వేరు చేసి పోలికలు వెతకడం సరికాదని అభిప్రాయపడ్డారు.

 

ఎన్నికల కమిషన్ ప్రస్తావించిన “తెలంగాణ రక్షణ సమితి (డెమోక్రాటిక్)” మరియు “తెలంగాణ రాజ్య సమితి” వంటి పేర్లు తమ పార్టీ పేరుతో పూర్తిగా భిన్నమైనవేనని పేర్కొన్నారు. ఉచ్చారణ, నిర్మాణం, నాయకత్వం, రాజకీయ గుర్తింపు, ప్రజల్లో ఉన్న అవగాహన పరంగా కూడా ఈ పేర్లకు స్పష్టమైన తేడా ఉందని వివరించారు. ప్రస్తుతం ఉనికిలో ఉన్న ఏ గుర్తింపు పొందిన లేదా నమోదైన రాజకీయ పార్టీతోనూ తమ పార్టీ పేరుకు గందరగోళం ఏర్పడే అవకాశం లేదని స్పష్టం చేశారు.

 

దేశవ్యాప్తంగా ఒకే విధమైన భౌగోళిక, సిద్ధాంతపరమైన లేదా సాధారణ పదాలతో వందలాది రాజకీయ పార్టీలు నమోదై ఉన్నాయని లేఖలో గుర్తుచేశారు. ఆమ్ ఆద్మీ, అఖండ్ భారత్, ప్రజా సేవ, జన్ అధికార్, రాష్ట్రీయ జనతా, డెమోక్రాటిక్, సోషల్, రిపబ్లిక్ ఇండియా, శిరోమణి వంటి పదాలతో అనేక పార్టీలు ఎన్నికల కమిషన్ వద్ద నమోదు పొందిన ఉదాహరణలను జత చేసినట్లు పేర్కొన్నారు. కేవలం కొన్ని సాధారణ పదాల సారూప్యత ఆధారంగా పార్టీ పేరును తిరస్కరించడం చట్టపరంగా సమంజసం కాదని అభిప్రాయపడ్డారు.

 

తమ పార్టీపై వచ్చిన అన్ని అభ్యంతరాల కాపీలతో పాటు వాటికి ఆధారంగా ఉపయోగించనున్న ప్రతి పత్రాన్ని తమకు అందజేయాలని తెలంగాణ రక్షణ సేన కోరింది. వాటిని క్షుణ్ణంగా పరిశీలించి సమగ్ర సమాధానం ఇచ్చేందుకు తగిన సమయం కల్పించిన తర్వాతే వ్యక్తిగత విచారణకు పిలవాలని విజ్ఞప్తి చేసింది. కేవలం ఊహాజనిత సంక్షిప్త రూపాలు లేదా సాధారణ భౌగోళిక పదాల ఆధారంగా వచ్చిన అభ్యంతరాలను తిరస్కరించాలని కోరుతూ, ప్రజాప్రాతినిధ్య చట్టం–1951లోని సెక్షన్ 29ఏ ప్రకారం “తెలంగాణ రక్షణ సేన” పార్టీ నమోదుకు తమ దరఖాస్తును పరిశీలించి ఆమోదించాలని కేంద్ర ఎన్నికల కమిషన్‌ను విజ్ఞప్తి చేసింది.