Mahaa Daily Exclusive

  పశ్చిమాసియాలో మళ్లీ యుద్ధ మేఘాలు..! అమెరికా స్థావరాలపై దాడులంటూ ఇరాన్ ప్రకటన..

Share

  • అమెరికా స్థావరాలపై దాడులంటూ ఇరాన్ ప్రకటన.
  •  హర్మూజ్ జలసంధి మూసివేత ప్రకటించిన ఐఆర్జీసీ.

టెహ్రాన్/వాషింగ్టన్,మహా.

మధ్యప్రాచ్యంలో ఉద్రిక్త పరిస్థితులు మరోసారి తీవ్రమయ్యాయి. తమ దేశ దక్షిణ ప్రాంతాల్లోని సైనిక స్థావరాలపై అమెరికా వైమానిక దాడులు జరిగాయని ఆరోపించిన ఇరాన్, దీనికి ప్రతీకార చర్యలు చేపట్టినట్లు ప్రకటించింది. జోర్డాన్, ఖతార్, ఒమన్‌లలో ఉన్న అమెరికా సైనిక స్థావరాలను లక్ష్యంగా చేసుకుని దాడులు నిర్వహించినట్లు ఇరాన్ ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ వెల్లడించింది. ఇదే సమయంలో ప్రపంచ చమురు రవాణాకు అత్యంత కీలకమైన హర్మూజ్ జలసంధిని తదుపరి ఆదేశాలు వచ్చే వరకు మూసివేస్తున్నట్లు కూడా ప్రకటించింది.

 

ఇరాన్ అధికారిక మీడియా సంస్థ ద్వారా విడుదల చేసిన ప్రకటనలో, తమ దక్షిణ తీర ప్రాంతాల్లోని సైనిక స్థావరాలు, కమ్యూనికేషన్ కేంద్రాలపై అమెరికా దాడులు జరిపిందని ఆరోపించింది. దీనికి ప్రతిస్పందనగా మూడు దశల్లో ప్రతీకార చర్యలు చేపట్టినట్లు పేర్కొంది. మొదటి దశలో జోర్డాన్‌లోని ప్రిన్స్ హసన్ వైమానిక స్థావరంపై దాడి చేసి కమాండ్ అండ్ కంట్రోల్ కేంద్రంతో పాటు డ్రోన్ హ్యాంగర్లను లక్ష్యంగా చేసుకున్నట్లు తెలిపింది.

 

రెండో దశలో ఖతార్‌లోని అల్ ఉదెయిద్ వైమానిక స్థావరంపై దాడులు నిర్వహించినట్లు ఇరాన్ ప్రకటించింది. కమాండ్ సెంటర్‌తో పాటు యుద్ధ విమానాల నిర్వహణ కేంద్రాలు కూడా ఈ దాడుల్లో దెబ్బతిన్నాయని పేర్కొంది. అనంతరం మూడో దశలో ఒమన్‌లోని దుక్మ్ పోర్టు ప్రాంతంలో ఉన్న అమెరికా లాజిస్టికల్ కేంద్రాలను లక్ష్యంగా చేసుకుని భారీ దాడులు చేసినట్లు వెల్లడించింది.

 

అంతేకాకుండా కువైట్, బహ్రెయిన్‌లలోని అమెరికా సైనిక స్థావరాలపై కమికాజే డ్రోన్లతో దాడులు నిర్వహించినట్లు ఇరాన్ సైన్యం ప్రకటించింది. ఈ దాడుల్లో రాడార్ కేంద్రాలు, ఆయుధ నిల్వ కేంద్రాలు ధ్వంసమైనట్లు పేర్కొంది. తమపై మళ్లీ దాడులు జరిగితే మరింత తీవ్ర స్థాయిలో ప్రతీకార చర్యలు తప్పవని అమెరికాకు హెచ్చరికలు జారీ చేసింది.

 

హర్మూజ్ జలసంధిని తాత్కాలికంగా మూసివేస్తున్నట్లు ఇరాన్ ప్రకటించడం ప్రపంచవ్యాప్తంగా ఆందోళనకు దారితీసింది. ప్రపంచ చమురు రవాణాలో అత్యంత కీలకమైన ఈ సముద్ర మార్గంలో నౌకల రాకపోకలను నిలిపివేస్తామని ప్రకటించడం అంతర్జాతీయ వాణిజ్యంపై ప్రభావం చూపే అవకాశాలపై చర్చకు దారితీసింది. అమెరికా జోక్యం పూర్తిగా ఆగే వరకు హర్మూజ్ జలసంధి గుండా ఎలాంటి నౌకలను అనుమతించబోమని ఇరాన్ స్పష్టం చేసింది.

 

అమెరికా, ఇరాన్ మధ్య పెరుగుతున్న ఉద్రిక్తతల నేపథ్యంలో మధ్యప్రాచ్య దేశాలు అప్రమత్తమవుతున్నాయి. తాజా పరిణామాలు ప్రాంతీయ భద్రతతో పాటు అంతర్జాతీయ ఇంధన మార్కెట్లపై కూడా ప్రభావం చూపే అవకాశముందని విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే ఇరాన్ ప్రకటించిన దాడులు, వాటి ప్రభావంపై స్వతంత్ర ధృవీకరణ లేదా అమెరికా అధికారిక స్పందన కోసం అంతర్జాతీయ స్థాయిలో ఎదురుచూస్తున్నారు.