- సబ్ జూనియర్ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లో రజతం,
ఖమ్మం, మహా.
హైదరాబాద్‌లో నిర్వహించిన 12వ తెలంగాణ రాష్ట్ర సబ్ జూనియర్స్ పురుషుల, మహిళల అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లో ఖమ్మం జిల్లాకు చెందిన విద్యార్థి సుధగాని ఉపేక్షిత్ అద్భుత ప్రతిభ కనబర్చి రెండు పతకాలను కైవసం చేసుకున్నాడు. గాడియం స్పోర్టోపియా స్కూల్ వేదికగా జరిగిన ఈ రాష్ట్రస్థాయి పోటీల్లో అండర్–12 విభాగంలో పాల్గొన్న ఉపేక్షిత్ తన వేగంతో అందరి ప్రశంసలు అందుకున్నాడు.
ఖమ్మంలోని హార్వెస్ట్ పబ్లిక్ స్కూల్‌లో చదువుతున్న ఉపేక్షిత్, డాక్టర్ సుధగాని కరుణాకర్–భరణిక దంపతుల కుమారుడు. ఖమ్మం సర్దార్ పటేల్ స్టేడియంలో కోచ్‌లు గౌస్ పాషా, హలీం పర్యవేక్షణలో క్రమం తప్పకుండా శిక్షణ పొందుతూ రాష్ట్రస్థాయిలో తన ప్రతిభను నిరూపించుకున్నాడు.
ఈ పోటీల్లో 60 మీటర్ల పరుగుపందెంలో రజత పతకం, 300 మీటర్ల పరుగుపందెంలో కాంస్య పతకం సాధించి విశేష ప్రతిభ కనబర్చాడు. పతకాలతో పాటు ప్రైజ్ మనీని కూడా అందుకొని మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నాడు.
ఉపేక్షిత్ సాధించిన ఈ విజయం ఖమ్మం జిల్లా అథ్లెటిక్స్‌కు మరోసారి రాష్ట్రస్థాయిలో గుర్తింపు తీసుకువచ్చిందని క్రీడా వర్గాలు పేర్కొన్నాయి. అతని విజయానికి కోచ్‌లు గౌస్ పాషా, హలీం అందించిన శిక్షణ, తల్లిదండ్రుల ప్రోత్సాహం కీలకమని అభిప్రాయపడ్డారు.
ఈ సందర్భంగా విజేత ఉపేక్షిత్‌ను హార్వెస్ట్ పబ్లిక్ స్కూల్ యాజమాన్యం, ఉపాధ్యాయులు, సహచర విద్యార్థులు ఘనంగా అభినందించారు. జిల్లా క్రీడా ప్రముఖులు, అథ్లెటిక్స్ సంఘం ప్రతినిధులు, తల్లిదండ్రులు శుభాకాంక్షలు తెలియజేస్తూ భవిష్యత్తులో జాతీయ, అంతర్జాతీయ స్థాయిలోనూ రాణించి ఖమ్మం జిల్లాకు మరింత పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు.







