Mahaa Daily Exclusive

  ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్న కాంగ్రెస్–బీఆర్ఎస్‌లు… కేంద్ర మంత్రి బండి సంజయ్..

Share

హైదరాబాద్, మహా.

కాళేశ్వరం ప్రాజెక్టు అంశంలో కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నాయని కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ తీవ్రస్థాయిలో విమర్శించారు. ఒక పార్టీ తప్పు చేస్తే మరో పార్టీ దానిని సరిదిద్దకుండా రాజకీయ ఆరోపణలకే పరిమితమవుతోందని ఆయన మండిపడ్డారు. తెలంగాణ ప్రజలకు ఈ రెండు పార్టీలు కలిసి “రక్తకన్నీరు–2” సినిమా చూపిస్తున్నాయంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు.

 

బీఆర్ఎస్ ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్టును నిర్లక్ష్యంగా నిర్వహించి లక్ష కోట్ల రూపాయల ప్రజాధనాన్ని నీళ్ల పాల్జేసిందని బండి సంజయ్ ఆరోపించారు. మరోవైపు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా సమస్య పరిష్కారానికి అవసరమైన చర్యలు తీసుకోకుండా ప్రాజెక్టును కోమాలోకి నెట్టిందని విమర్శించారు. ఈ రెండు పార్టీల పాపాలకు తెలంగాణ రైతులే బలవుతున్నారని ఆయన పేర్కొన్నారు.

 

డ్యామ్ సేఫ్టీ యాక్ట్–2021 ప్రకారం బ్యారేజీల యజమాని తెలంగాణ ప్రభుత్వమేనని గుర్తు చేసిన బండి సంజయ్, జాతీయ డ్యామ్ భద్రతా సంస్థ (ఎన్డీఎస్ఏ), కేంద్ర జల సంఘం (సీడబ్ల్యూసీ) కమిటీలు కేవలం సాంకేతిక సలహాలు మాత్రమే ఇస్తాయని స్పష్టం చేశారు. బ్యారేజీల మరమ్మతులు చేపట్టాల్సిన బాధ్యత పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వానిదేనని చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వం తన చేతకానితనాన్ని ఎన్డీఎస్ఏపై నెట్టడం సిగ్గుచేటని ఆయన వ్యాఖ్యానించారు.

 

కాళేశ్వరం ప్రాజెక్టుపై ఎన్డీఎస్ఏ ఇప్పటికే మూడు విడతల్లో నివేదికలు సమర్పించినప్పటికీ వాటిలో పేర్కొన్న సిఫార్సులను అమలు చేయడంలో ప్రభుత్వం ఎందుకు విఫలమైందని బండి సంజయ్ ప్రశ్నించారు. పునరుద్ధరణ చర్యలను యుద్ధ ప్రాతిపదికన చేపట్టాలని పలుమార్లు సూచించినా ప్రభుత్వం ఎందుకు పట్టించుకోలేదని నిలదీశారు. ప్రజల దృష్టిని మళ్లించేందుకే ఇప్పుడు మరోసారి ఎన్డీఎస్ఏ పేరును ముందుకు తెస్తున్నారని ఆరోపించారు.

 

కాళేశ్వరం ప్రాజెక్టులో లక్ష కోట్ల రూపాయల అవినీతి జరిగిందని గతంలో కాంగ్రెస్ నేతలే ప్రకటించారని బండి సంజయ్ గుర్తు చేశారు. అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ ఆరోపణలపై పూర్తి స్థాయి విచారణ జరపకుండా పరిమిత స్థాయిలోనే దర్యాప్తును కొనసాగించారని విమర్శించారు. విజిలెన్స్ నివేదిక సిద్ధంగా ఉన్నప్పటికీ దానిపై చర్యలు ఎందుకు తీసుకోవడం లేదని, ఆ నివేదికను ప్రజల ముందుకు తీసుకురావడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందా అని ప్రశ్నించారు.

 

బీఆర్ఎస్ హయాంలో జరిగిన అవకతవకలపై కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పిన కాంగ్రెస్ ప్రభుత్వం, ఇప్పుడు అదే అంశంలో వెనక్కి తగ్గడానికి కారణమేంటని ఆయన నిలదీశారు. బీఆర్ఎస్ పాపాలను రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఎందుకు మోస్తోందో తెలంగాణ ప్రజలకు స్పష్టమైన సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.

 

మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల మరమ్మతుల విషయంలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం రెండున్నరేళ్లుగా జాప్యం చేసిందని బండి సంజయ్ ఆరోపించారు. రాజకీయ ఆరోపణలు, ప్రత్యారోపణలు పక్కనపెట్టి ఎన్డీఎస్ఏ సిఫార్సులను వెంటనే అమలు చేయాలని, మూడు బ్యారేజీల పునరుద్ధరణ పనులను వేగవంతం చేయాలని ఆయన డిమాండ్ చేశారు.

 

బీఆర్ఎస్ పదేళ్ల పాలనలో జరిగిన అవినీతి, నిర్లక్ష్యం, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వ అసమర్థత కారణంగా గోదావరి జలాలను తెలంగాణ ప్రజలు పూర్తిస్థాయిలో వినియోగించుకోలేని పరిస్థితి ఏర్పడిందని బండి సంజయ్ ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా రాజకీయ డ్రామాలకు ముగింపు పలికి రైతుల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని తక్షణ చర్యలు చేపట్టాలని, లేనిపక్షంలో తెలంగాణ రైతుల ఆగ్రహానికి కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు సమాధానం చెప్పాల్సి వస్తుందని హెచ్చరించారు.