ముంబై, మహా: దేశంలో అత్యంత కీలకరాష్ట్రం మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ప్రచారం ఆఖరి ఘట్టంలో ఉంది. ఆరు ప్రధాన పార్టీల అగ్రనేతలు ప్రతిష్టాత్మకంగా తీసుకుని హోరాహోరీగా సాగించిన మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ప్రచారానికి సోమవారం సాయంత్రం తెరపడింది. తుదిరోజు ప్రచారంలో ఊహించినట్టుగానే బారామతిలో పవార్ వెర్సస్ పవార్ హోరాహోరీగా తలబడటం ఎన్నికల ఫలితాలు ఎలా ఉండబోతాయనే ఆసక్తిని మరింత పెంచింది. 288 అసెంబ్లీ నియోజకవర్గాలున్న మహారాష్ట్ర అసెంబ్లీకి ఒకే విడతలో నవంబర్ 20న పోలింగ్ జరుగనుంది. నవంబర్ 23న ఫలితాలు వెలువడతాయి.
ఫస్ట్ టైమ్.. బిగ్ ఫైట్
మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై ఇటు రాష్ట్రంలోనే కాకుండా దేశవ్యాప్తంగా కూడా ఆసక్తి నెలకొంది. దీనికి ప్రధాన కారణం కూడా ఉంది. మహారాష్ట్రలో ప్రధాన ప్రాంతీయ పార్టీలైన శివసేన, ఎన్‌సీపీలు గత రెండేళ్లలో అడ్డంగా చీలిపోవడం, చీలక పార్టీలు ప్రధాన ప్రత్యర్థులుగా వేర్వేరు కూటమిల్లో తలపడతుండటం ఈ ఆసక్తిని పెంచుతోంది. ఎన్నికల ప్రచారం చివరిరోజున ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే 4 ర్యాలీల్లో, ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ బారామతి సహా 5 ర్యాలీల్లో, శరద్ పవార్ సైతం బారమతితో పాటు మరో 3 ర్యాలీలో పాల్గొన్నారు. మరో ఉపముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ తన నాగపూర్ సౌత్ వెస్ట్ నియోజవర్గంలో పలు ర్యాలీల్లో పాల్గొన్నారు.
దిగ్గజాల ప్రచారం
మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో అన్ని పార్టీల అగ్రనేతలు క్షణం తీరకలేక్కుండా హోరాహోరీ ప్రచారం సాగించారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ, హోం మంత్రి అమిత్‌షా, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్, ప్రియాంక గాంధీ , మల్లికార్జున్ ఖర్గే, పలువురు కేంద్ర మంత్రులు, పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు సైతం మహారాష్ట్రలో సుడిగాలి పర్యటనలతో ప్రచారం సాగించారు. అధికార మహాయుతి కూటమి తిరిగి అధికారం నిలబెట్టుకోవాలనే పట్టుదలతో ప్రచారం సాగించగా, మహా వికాస్ అఘాడి (ఎంవీఏ) లోక్‌సభ ఎన్నికల్లో రాష్ట్రంలో సాధించిన ఆధిక్యతను అసెంబ్లీ ఎన్నికల్లో కూడా కొనసాగించి అధికారంలోకి వస్తామనే ధీమాతో ఉంది. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు మంత్రులు కూడా ప్రచారంలో పాల్గొన్నారు.
నిర్ణయాత్మక అంశాలు ఇవే
అధికార మహాయుతి కూటమి ‘మాఝీ లడ్కీ బహిన్’ వంటి పాపులర్ స్కీమ్స్‌పైన గట్టి ఆశలే పెట్టుకుంది. సంక్షేమపథకాలు నమ్ముకుంది. కాగా, విపక్ష మహా వికాస్ అఘాడి (ఎంవీఏ) కులగణన, సామాజిక న్యాయం, రాజ్యంగ పరిరక్షణ వంటి అంశాలపై ప్రధానంగా ప్రచారం సాగించింది. బీజేపీ తుదిప్రయత్నంగా ‘సే నో టు కాంగ్రెస్’ అంటూ ప్రజలకు పిలుపునిచ్చింది. కాంగ్రెస్ కూటమి ప్రభుత్వ వ్యతిరేకతతో లోక్ సభ ఫలితాలు రిపీట్ చేస్తామన్న నమ్మకంతో ఉంది.
……….








