Mahaa Daily Exclusive

  నేరెళ్ల, లగచర్ల ఘటనలు – ఒక విశ్లేషణ..!

Share

”పోలీసు లాకప్ లో మమ్మల్ని నగ్నంగా బంధించారు. కిటికీకి చేతులు కట్టివేసి,మా కాళ్ళపై కూడా బరువు పెట్టారు. రబ్బరు లాఠీలతో మమ్మల్ని కొట్టేవారు. ఒక్క లాఠీ దెబ్బ తగిలితేనే మేము స్పృహ కోల్పోయే వాండ్లం.మా కాళ్ళు,చేతులు చచ్చుబడి పోయినట్టుగా అనిపించేది. మా కాళ్ళను చాచి,మా పాదాలను పైకప్పు నుండి గొలుసుకు వేలాడదీసి,మాపై నీళ్లు చల్లుతూ మళ్ళీ మళ్ళీ చితకబాదేవారు. మా పాదాలను చెక్క పలకపై లాక్ చేసి,మా చేతులను వెనుకకు కట్టి దారుణంగా కొడుతుండే వాళ్ళు. మా తొడలపై నిలబడి నిరంతరం కొట్టేవాండ్లు. ప్రాణముందో, లేదో తెలియని స్థితిలో మేము కేకలు కూడా వేయలేకపోయేవాళ్ళం.మేము విపరీతమైన నొప్పిని, అత్యంత బాధను అనుభవించాం” అని నేరెళ్ల దళితులు పోలీసులు పెట్టిన చిత్రహింసలను భయాందోళనలతో ఆంగ్ల మీడియా ప్రతినిధులకు చెప్పారు. ‘శక్తివంతమైన వ్యక్తులను ప్రశ్నించడానికి మీకు ఎంత ధైర్యం’ అని పోలీసులు తమను కులం పేరుతో తిట్టారని దళితులు చెప్పారు. తనను తాను ఆధునిక రాజకీయ నాయకునిగా చెప్పుకునే కేటీఆర్ మంత్రిగా ప్రాతినిధ్యం వహించిన ప్రాంతంలో 2017 జూలైలో ‘దళితులపై పోలీసులు థర్డ్ డిగ్రీ ప్రయోగించిన’ ఘటన అది. జాతీయ స్థాయిలో ఆ ఘటన తీవ్ర ప్రకంపనలు సృష్టించింది. నేరెళ్ల దళితులు చేసిన నేరమేమిటంటే చట్టవిరుద్ధంగా వందలాది లారీలలో ఇసుక రవాణ జరగడాన్ని,ఆ లారీల కింద పడి అమాయక గ్రామీణ ప్రాంత ప్రజలు ‘రోడ్డు ప్రమాదం’ లో బలి కావడాన్ని ప్రశ్నించడమే! “కాంగ్రెస్,బిజెపి సహాయం లేకపోతే తాము ఈపాటికి చనిపోయి ఉండేవాళ్లం”! అని కూడా బాధిత దళితులు వాపోయిన ఉదంతం టీవీ న్యూస్ ఛానళ్లలో అప్పట్లో ప్రసారమైంది. కేసీఆర్ అధికారంలో ఉన్నంత కాలం, ‘ప్రత్యేక రాష్ట్రంలో ప్రత్యేక సామాజికవర్గం’గా ‘కొంతమంది వ్యక్తులు’,శక్తులు పొందిన గౌరవ మర్యాదలు,చేసిన లూటీ గురించి మాట్లాడవలసిన అవసరం ప్రత్యేకంగా లేదు. ”ఈ ఘటన అనుకోకుండా జరిగింది.దళితులపై దాడి చేయాల్సిందిగా మా ప్రభుత్వం ఎందుకు ఆదేశిస్తుంది? 10 లారీలను తగులబెట్టి,గూండాగిరీ చేస్తామంటే ఊరుకుంటామా? ఇది శాంతి భద్రతల సమస్య. ఖచ్చితంగా అణచివేస్తాం. దళితులని వాళ్ళ ముఖాలపై రాసి ఉందా?” అని నాటి సీఎం.కేసీఆర్ మీడియా సమావేశంలో పోలీసు చర్యను గట్టిగా సమర్ధించుకున్నారు. ఇప్పుడిక ‘లగచర్ల’ దగ్గరకు వద్దాం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సొంత నియోజకవర్గం కొడంగల్ ప్రాంతంలో ఫార్మాసిటీ కోసం లగచర్లలో ప్రజాభిప్రాయసేకరణకు పూనుకున్నప్పుడు జరిగిన హింసాత్మక ఘటనలు ఆయనను రాజకీయంగా దెబ్బ తీయడానికి జరిగినవి.కేసీఆర్ హయాంలో పదేండ్లలో పలు ప్రాజెక్టులు,సంస్థల కోసం వేలాది ఎకరాలు సేకరణ జరిగినా,ఇటువంటి ఘటనలు చోటు చేసుకోకపోవడం రాజకీయంగా ‘మేనేజ్ మెంటు’ వైఫల్యమే. ఇలాంటి ఘటనలను ముందుగానే పసిగట్టి,అవి తలెత్తకుండా రేవంత్ రెడ్డి పక్షాన ఒక ‘బృందం’ లగచర్ల తదితర గ్రామాలకు వెళ్లి ‘మేనేజ్’ చేసి ఉండవలసింది. అలా జరిగితే ప్రతిపక్షాలకు ఒక ‘అస్త్రం’ దొరకకుండా ఉండేది. ఈ ఘటన ‘రాజకీయ ప్రేరేపిత’మైనదని స్పష్టంగా తెలుస్తూనే ఉన్నది. కానీ నేరెళ్ల ఘటనలో రాజకీయాలు లేవు. మావోయిస్టులు ఆ ఘటనలో లేరు.కేవలం నాటి అధికారపార్టీ నాయకుల అక్రమాలను ప్రశ్నించిన పాపానికి 8 మంది దళితులను ఎంత క్రూరంగా హింసించారో మాటల్లో చెప్పలేం. కానీ ఇదివరకెన్నడూ చరిత్రలో జరగని సంఘటన లాగా బిఆర్ఎస్ ‘ మాధ్యమాలు,లగచర్ల ఘటనను ముడిసరుకుగా మార్చుకున్నవి.’పౌరహక్కుల ఉద్యమ కార్యకర్తలు ఏమయ్యారు?కోదండరాం ఎటు పోయారు? ప్రజాసంఘాల నోరు ఎందుకు మూతపడింది’?. అంటూ ఆ మాధ్యమాలు ఘోషిస్తున్నవి. తెగ బాధపడుతున్నవి. పౌరహక్కులు,ప్రజాస్వామిక హక్కుల గురించి కేసీఆర్ పార్టీ కానీ,కేటీఆర్ నీడలో చెలరేగిపోతున్న సోషల్ మీడియా గానీ మాట్లాడడం వింతగా,ఎందుకో ఎబ్బెట్టుగా కనిపిస్తుంది. ఇందిరాపార్కు ధర్నా చౌక్ ఎత్తివేసి,కోదండరాం లాంటి వారి ఇండ్లపై దాడులు చేసి,తలుపులు బద్దలుగొట్టి అరెస్టు చేసిన ఉదంతాలన్నింటినీ ఉద్దేశపూర్వకంగానే కేసీఆర్ పార్టీ నాయకులు మరచిపోయారేమో! కేసీఆర్ అధికారం కోల్పోతే తప్ప ప్రజాసంఘాలు,పౌరహక్కుల ఉద్యమాలు గుర్తుకు రావడం లేదు. ‘లగచర్ల’ వంటి ఒకటీ,రెండు ఘటనలను భూతద్దంలో చూపి రాష్ట్రంలో శాంతిభద్రతలలో ముఖ్యమంత్రి విఫలమయ్యారని బిఆర్ఎస్ మీడియా’ ఉధృతంగా ప్రచారం చేస్తున్నది.రేవంత్ రెడ్డి ఒక ‘విజన్’ తో వెడుతున్నారు.అది బిఆర్ఎస్ కు,ఆ పార్టీ ప్రాయోజిత మీడియాకు కంటగింపుగా ఉన్నది.అందువల్ల ఎక్కడయినా ప్రజల్లో కొంత అసంతృప్తి,లేదా ఆగ్రహం వ్యక్తమయితే దాన్ని గోరంతలు కొండంతలు చేసి రేవంత్ ను అప్రదిష్ట పాలు జేసే పథకాన్ని బిఆర్ఎస్ సమర్ధంగా అమలు చేస్తున్నది. ఇందులో భాగంగానే జాతీయ స్థాయిలో తెలంగాణ సిఎం.రేవంత్ ఇమేజ్ ను దెబ్బ కొట్టడానికి బీఆరెస్ తీవ్రంగా ప్రయత్నిస్తోంది.కేటిఆర్ డిల్లీలో ‘లగచర్ల’ ఘటనపై ‘ షో ‘ నిర్వహించారు. లగచర్ల నుంచి లంబాడీలను డిల్లీకి తీసుకువెళ్లి, జాతీయ ఎస్.టీ.కమిషన్ ముందు ‘పరేడ్’ చేయించారు. కాగా లగచర్ల ఘటనపై సీఎం. రేవంత్ రెడ్డి ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదుశాంతి భద్రతలకు భంగం కలిగించినందున అణచివేస్తామనీ అనలేదు. సాక్షాత్తు జిల్లా కలెక్టర్ స్థాయి అధికారిని అవసరమైతే ‘ భౌతికంగా నిర్మూలించాల’ ని అక్కడి ఘటనలు,దృశ్యాలు కనిపించినా ముఖ్యమంత్రి సంయమనంతో ఉన్నారు. పోలీసు వర్గాలు చట్టప్రకారం నడుచుకుంటున్నవి. ఇదిలా ఉండగా సోషల్ మీడియాపై కోట్లాదిరూపాయలు ఖర్చు పెట్టగలుగుతూ,తామే అధికారంలో ఉన్నట్టుగా బీఆర్ ఎస్ ఒక ‘ఇంప్రెషన్’ ప్రజలకు ఇవ్వడానికి కారణం,ధైర్యం వాళ్ళ ‘ధన బలమే’! ఆ బలం పుష్కలంగా ఉన్న కారణంగా నిజాలను పాతర వేయవచ్చునని,అబద్ధాలను విరివిగా మార్కెట్లోకి వదలవచ్చునని ప్రధాన ప్రతిపక్షం భావిస్తున్నది.నిజానికి ఇలాంటి ట్రెండ్ ఇదివరకు లేదు. ‘అధికార లేమి’తో కొట్టుమిట్టాడుతూ తక్షణం మళ్ళీ అధికారంలోకి రావాలన్న కాంక్షతో బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ‘కదన కుతూహలం’తో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై విరుచుకుపడుతున్నారు. సీఎంతో ‘ప్రత్యక్ష యుద్ధాని’కి సిద్ధమైనట్టుగానే ప్రకటనలు చేస్తున్నారు. తెలంగాణ రాజకీయాల్లో రెండు అంశాల చుట్టూ చర్చ కేంద్రీకృతమైంది.ఇందులో ఒకటి: రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత.రెండవది:అతి కొద్ది కాలంలోనే ప్రధాన ప్రతిపక్షం పుంజుకోవడం.ఈ రెండు అంశాలు వేర్వేరు కాదు.ఒకదానికొకటి ముడిపడి ఉన్నవి.ప్రభుత్వంపై వ్యతిరేక గాలి నెమ్మదిగా మొదలయి క్రమంగా పెరగడం.ఈ ‘వ్యతిరేక గాలి’ని ఆయుధంగా మలచుకొని ప్రతిపక్షం తన అస్త్ర,శస్త్రాలను దుమ్ముదులిపి బయటకు తీయడం.ముందుగా ప్రభుత్వంపై ప్రజల్లో అసంతృప్తి గురించి చర్చించాలి. పరిపాలన వేరు.రాజకీయాలు వేరు.రాజకీయ నాయకత్వ ప్రతిభ రేవంత్ లో పుష్కలంగా ఉన్నది. అయితే అదొక్కటే ముఖ్యమంత్రిగా రాణించడానికి,పాలనా పరంగా మెరుపులు మెరిపించడానికి సరిపోకపోవచ్చు. సంక్షేమ కార్యక్రమాలు కేసీఆర్ హయాంలో స్వైర విహారం చేశాయి. వాటి లోటుపాట్లు,ఇతర నెగెటివ్ పాయింట్లు ఎలా ఉన్నా జనంలో ‘కేసీఆర్ ఫోటో’ నమోదయిపోయింది. అదంతా ఒక్క రాత్రిలో జరగలేదు.2001 నుంచి 2014 వరకు నడిపిన ఉద్యమ అనుభవాలు కేసీఆర్ పరిపాలనకు అదనపు బలంగా పనికివచ్చాయి.ప్రొఫెసర్ జయశంకర్,ఆర్.విద్యాసాగరరావు,గాదె ఇన్నయ్య,వి.ప్రకాష్ వంటి వారందరూ వ్యవసాయం, ఇరిగేషన్,విద్యుత్తు తదితర పలు రంగాలపై కేసీఆర్ ‘శిక్షణ’ పొందారు. ఆ అధ్యయనాన్ని 2014 లో ముఖ్యమంత్రి అయిన తర్వాత అమలులో పెట్టారు. ప్రజలకు’ ఇన్ స్టంట్ ఫలితాలు ‘కావాలి. కళ్ళ ముందు వాళ్ళకు డబ్బు కనిపించాలి. ‘రైతు బంధు’ సహా అనేక సంక్షేమ కార్యక్రమాలతో జనంపై ప్రయోగాలు చేశారు.ఈ పథకాలన్నింటికీ తెలంగాణను ఆయన ప్రయోగశాలగా మార్చేశారు.పక్కా ప్రణాళిక ప్రకారం ఓటు బ్యాంకులను తయారుచేసుకోవడం,వాటిని సుస్థిరం చేసుకోవడంపై కేసీఆర్ తొమ్మిదిన్నర ఏండ్ల పాటు పూర్తిగా దృష్టిని కేంద్రీకరించారు.ఆయన రైతుబంధు,వృద్ధాప్య పెన్షన్ లు తనను శాశ్వతంగా సీఎంగా ఉండేలా చేస్తాయని నమ్మారు.కానీ 2023 డిసెంబర్ లో అసెంబ్లీ ఎన్నికల్లో ఆయా లబ్ధిదారులు అనూహ్యంగా కేసీఆర్ కు వ్యతిరేకంగా ఓటు వేశారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఫ్యూచర్ సిటీ ఏర్పాటు చేస్తున్నది. హైదరాబాద్,సికింద్రాబాద్,సైబరాబాద్ వంటి మూడు సిటీలు ఉండగా,ఫోర్త్ సిటీగా ఫ్యూచర్ సిటీని నిర్మించతలపెట్టారు.రంగారెడ్డి జిల్లా ముచ్చింతల్ ప్రాంతాల్లో ఈ ఫోర్త్‌సిటీ ఏర్పాటవుతోంది. ఇప్పటికే ప్రభుత్వం వద్ద 14 వేల ఎకరాల భూమి ఉండగా,మరో 16 వేల సేకరించనున్నారు. ల్యాండ్ పూలింగ్ ద్వారా భూ సేకరణ జరపనున్నారు.మొత్తం 30 వేల ఎకరాల్లో ఫ్యూచర్ సిటీ నిర్మితమవుతుంది. శంషాబాద్ ఎయిర్‌పోర్టు నుంచి ఫ్యూచర్ సిటీకి మెట్రోను విస్తరించాలని సీఎం ఆలోచన.ఈ మేరకు ఎలైన్‌మైంట్ ఖరారు చేసే పనిలో సర్కార్ నిమగ్నమైంది.ఫ్యూచర్‌ సిటీ అభివృద్ధి, భవిష్యత్‌ అవసరాలకు అనుగుణంగా గ్రీన్‌ ఫీల్డ్‌ రహదారిని నిర్మించనున్నారు. ఫ్యూచర్‌ సిటీలో ‘స్కిల్‌ యూనివర్సిటీ’తో పాటు ‘స్పోర్ట్స్ కాంప్లెక్స్’, అంతర్జాతీయ ప్రఖ్యాత సంస్థలు,పరిశ్రమలు,పెట్టుబడులు పెట్టనున్నవి. ఔటర్ రింగ్ రోడ్డు నుంచి శ్రీశైలం నేషనల్ హైవే వరకు 40 కి.మీ పొడవునా గ్రీన్‌ఫీల్డ్‌ రోడ్డును నిర్మించనున్నారు.రీజినల్ రింగుబంధించారు.రెయిలింగ్‌లతో రోడ్డును దీన్ని కనెక్టు కనెక్ట్ చేయనున్నారు. ”ముందుగా జరిగేది ఎప్పుడు కూడా తరువాత జరిగే దానికన్నా మెరుగ్గా,మౌలికమైనట్టుగా కనిపిస్తుంది.ఇదివరకటి పాలకుడు ప్రసిద్ధుడు,గొప్ప పేరు ఉన్న వ్యక్తి అయితే అతన్ని ప్రజలు మరచిపోయేలా చెయ్యాలి.అతని కన్నా ఎక్కువ పేరు మీకు రావాలంటే మీరు రెండింతలు విజయం సాధించాలి.గత పాలకుల నీడలు,జాడలను నామరూపాల్లేకుండా చేయాలి.మీరు వేరే మార్గాన్ని,ఇంకా చెప్పాలంటే ఒక ప్రత్యేక మార్గాన్ని ఎంపిక చేసుకొని ముందుకు వెళ్ళాలి.ఆ దారిలో మునుపెవరూ నడిచి ఉండకపోవచ్చు.అయినా మీరు అలాంటి దారిలోనే వెళ్ళాలి.మీకంటూ ఒక గుర్తింపు,పేరు ప్రతిష్టలు సంపాదించుకోవాలి” అని 1601-1658 కాలానికి చెందిన తత్వవేత్త బాలస్తర్ గ్రేషియన్ అన్నాడు.రేవంత్ రెడ్డి కూడా గ్రేషియన్ ఫార్ములాను పాటించవలసి ఉన్నది. గత ముప్పయి ఏళ్లలో హైదరాబాద్ నగరం వేగంగా అభివృద్ధి చెందుతున్నది.ఇదేమీ కేసీఆర్ మహత్యం కాదు.ఇంద్రజాలమూ కాదు.ముఖ్యమంత్రులుగా చంద్రబాబు,వైఎస్ రాజశేఖర్ రెడ్డి చేసిన కృషిని కేసీఆర్ కొనసాగించారు. రాజకీయాలకు అతీతంగానే గత ప్రభుత్వాల నిర్ణయాలను ముందుకు తీసుకెళ్లడానికి సీఎం.రేవంత్ రెడ్డి ప్రయత్నిస్తున్నారు.రీజనల్ రింగ్ రోడ్డు నిర్మాణానికి ఏర్పాట్లు పూర్తయ్యాయి.రింగ్ రోడ్డు చుట్టూ రైలు సదుపాయం కూడా కల్పించబోతున్నారు.హైదరాబాద్‌ లోనే అభివృద్ధి కేంద్రీకృతం కాకుండా రాష్ట్రం మొత్తం అభివృద్ధి చెందేలా రేవంత్ దగ్గర ఒక ప్రణాళిక ఉన్నది దాన్ని ‘2050 మెగా మాస్టర్ ప్లాన్ ‘ గా రేవంత్ రెడ్డి నిర్వచించారు.

 

– ఎస్.కే.జకీర్, సీనియర్ జర్నలిస్ట్.

Latest